కోల్‌కత: ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ క్విక్ కామర్స్ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వేగవంతమైన డెలివరీల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుండి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో.. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, ముంబై, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో మినట్స్ పేరుతో క్విక్ కామర్స్ సేవలను నిర్వహిస్తోంది.
డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ రంగం 2024లో 6.1 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ 70 బిలియన్ డాలర్లు ఉంది. ఇది దేశంలోని మొత్తం రిటైల్ మార్కెట్‌లో 7 శాతం మాత్రమేనని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఆన్‌లైన్ షాపింగ్ జోరు..
భారత్‌లో రిటైల్ రంగం మొత్తంగా వృద్ధి చెందుతున్నందున ఆన్‌లైన్ షాపింగ్ గణనీయంగా పెరుగుతుందని నమ్ముతున్నామని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీశ్ కుమార్ తెలిపారు. 2028 నాటికి భారత రిటైల్ మార్కెట్‌లో దాదాపు 12 శాతం వాటాను ఈ–కామర్స్ దక్కించుకుంటుందని గణాంకాలు సూచిస్తున్నాయని వివరించారు.
గ్రామీణ, సెమీ–అర్బన్ వినియోగదారుల కోసం కంపెనీ ప్రధాన భారతీయ భాషల్లో యాప్‌ను రూపొందించింది. ఇంగ్లీష్ తెలియని కస్టమర్లు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా సుమారు 15 లక్షల మంది వర్తకులు ఉన్నారు. సరఫరా వ్యవస్థలో 3,00,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment