నుడా చైర్మన్‌గా దీపా వెంకట్?
-
వర్గ పోరాటాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఎత్తుగడ
-
కేంద్ర మంత్రి వెంకయ్యతో అవసరాలు కూడా కారణమే
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) మొదటి చైర్మన్ పదవి దక్కించుకోవాలని అనేక మంది టీడీపీ నేతలు ఆశ పడుతున్న తరుణంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. వెంకయ్య నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు, బీజేపీ కోటా సమీకరణల్లో సహాయ మంత్రి హోదా లభించే ఈ పదవి దీపాకు కట్టబెట్టాలని టీడీపీ ఉన్నత స్థాయి వర్గాలు ఆలోచిస్తున్నాయి.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడిన టీడీపీ సీనియర్లు అనేక మంది నుడా చైర్మన్ పదవి మీద కన్నేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ మనీ అందించిన డాక్టర్ జెడ్ శివప్రసాద్ తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు మరింత మంది నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవి కోరుతున్నప్పటికీ, అది కాకపోతే నుడా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిటీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఆశీస్సులు ఈయనకు పుష్కలంగా ఉండటంతో సరైన సమయంలో ఆ వైపు నుంచి నరుక్కు వచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈయనతో పాటు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి సతీమణి అనూరాధ కూడా ఈ పదవి మీద కన్నేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు ఇటీవల లభించిన మహిళా కార్పొరేషన్ సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించారు. పట్టభద్రుల స్థానానికి జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన దేశాయిశెట్టి హనుమంత రావు ఈ సారి తాను పోటీ చేయలేనని చెబుతున్నారు. గతంలో తాను పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి నుడా చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ హై కమాండ్‌ను కోరుతున్నారు. నెల్లూరుకు చెందిన ముఖ్యమైన నాయకులంతా నుడా చైర్మన్ గిరీ మీద కన్ను వేయడంతో ఈ పదవి ఎవరికి ఇచ్చినా నుడా అభివృద్ధిలో వర్గ రాజకీయాలు చోటు చేసుకుంటాయని మున్సిపల్ మంత్రి నారాయణ భావిస్తున్నారు. చైర్మన్‌తో పాటు 20 మంది సభ్యులను నియమించే అవకాశం ఉన్నందున, చైర్మన్ పదవి రాజకీయాల్లో క్రియాశీలంగా లేని వారికి ఇస్తే ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులకు ఇబ్బంది లేకుండా పోతుందని ఆయన ఆలోచిçస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీపా వెంకట్ పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం.
వెంకయ్యతో అవసరం కోసమే..
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుకు రాజకీయ అవసరాలున్నాయి. నుడా ఏర్పాటైనా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులు తేలేక పోతే రాబోయే రెండున్నరేళ్లలో అభివృద్ధి చూపించే పరిస్థితి ఉండదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ పని జరగాలంటే వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్‌కు నుడా చైర్మన్ పదవి ఇవ్వడమే ఏకైక మార్గమని అంచనా వేస్తున్నారు. పైగా కీలకమైన పదవి బీజేపీ కోటా కింద ఇచ్చేసినట్లు చెప్పుకోవచ్చనే రాజకీయ వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నారు. దీపాకు ఈ పదవి ఇస్తే టీడీపీలో వర్గాల పోరుకు చెక్ పడుతుందని కూడా పార్టీ హై కమాండ్ ఆలోచిస్తోంది. చైర్మన్ కాకుండా 20మంది సభ్యులను నియమించే అవకాశం ఉన్నందువల్ల ఈ పదవుల్లో ద్వితీయ శ్రేణి నేతలను నియమించి కేడర్‌ను సంతృప్తి పరచేలా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే నుడా ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రక్రియ మొత్తం ముగిసి పాలక వర్గం నియమించడానికి కనీసం రెండు నెలలు పడుతుందని, అప్పటి వరకు ఈ వ్యవహారం బయటకు రాకుండా చూసుకోవడం మేలని టీడీపీ ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి.