Deepa Venkat
-
ఇంటి నుంచే సాధికారత మొదలవ్వాలి
‘బీ యువర్ ఓన్ హీరో’ సెమినార్లో దీపా వెంకట్ సాక్షి, అమరావతి: ప్రతి ఇంటి నుంచి మహిళా సాధికారిత మొదలవ్వాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్టు ఎండీ దీపా వెంకట్ ఆకాంక్షించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో భాగంగా శనివారం ‘బీ యువర్ ఓన్ హీరో’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆమె ప్రసంగించారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ, సహకారం వల్లే తాను స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు రాజకీయంగా, సామాజికంగా సమాన అవకాశాలు దక్కడం లేదన్నది వాస్తవమన్నారు. రాజకీయ నాయక త్వం ఒక్కటే మహిళా సాధికారితకు చిహ్నం కాదని.. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగడం ద్వారా సాధికారికతని అన్నారు. కాగా, మహిళా సాధికారి త గురించి మాటలు చెప్పడం కాకుండా.. చెప్పే దానిని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితాలుంటాయని టీటీడీ పాలకమండలి సభ్యురాలు, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా చెప్పారు. మహిళలు ప్రతి విషయంలోనూ ఇంట్లో పెద్దవారి అభిప్రాయం తీసుకోవడం సరికాదని, సొంత నిర్ణయాలతో ఎదిగేందుకు ప్రయత్నించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమార్తె, వైద్యురాలు విజయలక్ష్మి సూచించారు. -
మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత
స్వర్ణభారత్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.దీపావెంకట్ వెంకటాచలం : మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేయూతనిస్తుందని ఆ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.దీపావెంకట్ అన్నారు. దీపావెంకట్ కుమారుడు విష్ణు జన్మదినం సందర్భంగా వెంకటాచలంలోని సెయింట్ జ్యూడ్స్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. రూ.25వేల విలువ చేసే ఇన్వర్టర్ను, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కేంద్రానికి బహూకరించారు. మానసిక వికలాంగులకు అరటి పండ్లు, తినుబండరాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ స్వర్ణభారత్ ట్రస్ట్ పక్కనే ఉన్న మానసిక వికలాంగుల కేంద్రంలో నా కుమారుడు విష్ణు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున చేయూత నిస్తామని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ జనార్దన్‌రాజు, బీజేపీ ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల మురళి పాల్గొన్నారు. -
నుడా చైర్మన్‌గా దీపా వెంకట్?
వర్గ పోరాటాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ఎత్తుగడ కేంద్ర మంత్రి వెంకయ్యతో అవసరాలు కూడా కారణమే సాక్షి ప్రతినిధి – నెల్లూరు : నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) మొదటి చైర్మన్ పదవి దక్కించుకోవాలని అనేక మంది టీడీపీ నేతలు ఆశ పడుతున్న తరుణంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. వెంకయ్య నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అవసరాలు, బీజేపీ కోటా సమీకరణల్లో సహాయ మంత్రి హోదా లభించే ఈ పదవి దీపాకు కట్టబెట్టాలని టీడీపీ ఉన్నత స్థాయి వర్గాలు ఆలోచిస్తున్నాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడిన టీడీపీ సీనియర్లు అనేక మంది నుడా చైర్మన్ పదవి మీద కన్నేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ మనీ అందించిన డాక్టర్ జెడ్ శివప్రసాద్ తన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు మరింత మంది నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవి కోరుతున్నప్పటికీ, అది కాకపోతే నుడా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిటీ నటుడు, సీఎం చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఆశీస్సులు ఈయనకు పుష్కలంగా ఉండటంతో సరైన సమయంలో ఆ వైపు నుంచి నరుక్కు వచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈయనతో పాటు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి సతీమణి అనూరాధ కూడా ఈ పదవి మీద కన్నేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తమకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు ఇటీవల లభించిన మహిళా కార్పొరేషన్ సభ్యురాలి పదవిని సున్నితంగా తిరస్కరించారు. పట్టభద్రుల స్థానానికి జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన దేశాయిశెట్టి హనుమంత రావు ఈ సారి తాను పోటీ చేయలేనని చెబుతున్నారు. గతంలో తాను పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి నుడా చైర్మన్ పదవి ఇవ్వాలని పార్టీ హై కమాండ్‌ను కోరుతున్నారు. నెల్లూరుకు చెందిన ముఖ్యమైన నాయకులంతా నుడా చైర్మన్ గిరీ మీద కన్ను వేయడంతో ఈ పదవి ఎవరికి ఇచ్చినా నుడా అభివృద్ధిలో వర్గ రాజకీయాలు చోటు చేసుకుంటాయని మున్సిపల్ మంత్రి నారాయణ భావిస్తున్నారు. చైర్మన్‌తో పాటు 20 మంది సభ్యులను నియమించే అవకాశం ఉన్నందున, చైర్మన్ పదవి రాజకీయాల్లో క్రియాశీలంగా లేని వారికి ఇస్తే ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులకు ఇబ్బంది లేకుండా పోతుందని ఆయన ఆలోచిçస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీపా వెంకట్ పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం. వెంకయ్యతో అవసరం కోసమే.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుకు రాజకీయ అవసరాలున్నాయి. నుడా ఏర్పాటైనా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులు తేలేక పోతే రాబోయే రెండున్నరేళ్లలో అభివృద్ధి చూపించే పరిస్థితి ఉండదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ పని జరగాలంటే వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్‌కు నుడా చైర్మన్ పదవి ఇవ్వడమే ఏకైక మార్గమని అంచనా వేస్తున్నారు. పైగా కీలకమైన పదవి బీజేపీ కోటా కింద ఇచ్చేసినట్లు చెప్పుకోవచ్చనే రాజకీయ వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నారు. దీపాకు ఈ పదవి ఇస్తే టీడీపీలో వర్గాల పోరుకు చెక్ పడుతుందని కూడా పార్టీ హై కమాండ్ ఆలోచిస్తోంది. చైర్మన్ కాకుండా 20మంది సభ్యులను నియమించే అవకాశం ఉన్నందువల్ల ఈ పదవుల్లో ద్వితీయ శ్రేణి నేతలను నియమించి కేడర్‌ను సంతృప్తి పరచేలా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే నుడా ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రక్రియ మొత్తం ముగిసి పాలక వర్గం నియమించడానికి కనీసం రెండు నెలలు పడుతుందని, అప్పటి వరకు ఈ వ్యవహారం బయటకు రాకుండా చూసుకోవడం మేలని టీడీపీ ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి. -
శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు
స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా విస్తృత సేవలు నాన్నే ఆదర్శం.. రాజకీయాల్లోకి వెళ్లను ‘సాక్షి’తో కేంద్రమంత్రి వెంకయ్య కుమార్తె దీపా వెంకట్ న్యూఢిల్లీ: నగరంలో కలియుగ వైకుంఠుని వైభవోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. తిరుమలలో వేంకటేశ్వరునికి జరిగే ఉత్సవాల మాదిరిగానే ఢిల్లీలో నిర్వహిస్తోన్న వైభవోత్సవాలు భక్తులకు మహాదానందాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ వాసులకు ఈ భాగ్యాన్ని కల్పించిన ఘనత దీపా వెంకట్‌కే దక్కుతుంది. జీఎంఆర్ సంస్థల సహకారంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె అయిన దీపా వెంకట్‌కు చెందిన స్వర్ణ భారతి ట్రస్టు శ్రీ వేంకటేశ్వరుని వైభవోత్సవాలను ఢిల్లీలో నిర్వహిస్తోంది. తన వైభవాన్ని ఢిల్లీ వాసులకు చూపించడానికి వేంక టేశ్వరుడు తనను సాధనంగా ఎంచుకున్నాడని వినమ్రతతో చెబుతున్న దీపా వెంకట్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెల్లూరు వైభవోత్సవాలే ప్రేరణ నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాన్ని నిర్వహించినపుడు లభించిన అనుభవం.. ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడానికి ప్రేరణ ఇచ్చింది. రద్దీ, సమయాభావం, ఇతర కారణాల వల్ల భక్తులు తిరుమలలో స్వామివారిని దర్శించుకోలేక పోతున్నారని, ప్రత్యేక సేవలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని గుర్తించిన టీటీడీ శ్రీవారి వైభవోత్సవాలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సమయంలో నెల్లూరులో ఆ ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం వేంరెడ్డి ప్రభాకర్‌తో పాటు మా స్వర్ణభారతి ట్రస్టుకు లభించింది. నెల్లూరులో వైభవోత్సవాలకు 7 లక్షల మంది హాజరయ్యారు. రోజుకు కనీసం 60 వేల మంది ఉత్సవంలో పాల్గొనేవారు. శ్రీవారికి చేసే సేవలను సంతృప్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా మంది నన్ను అభినందించారు. తిరుమలకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు వాసుల స్పందనే ఈ విధంగా ఉంటే.. రాష్ట్రం వెలుపల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు స్ఫురించిన ప్రదేశం దేశ రాజధాని ఢిల్లీ. ఇందుకు టీటీడీని సంప్రదించాను. టీటీడీ కూడా ఢిల్లీలో వైభవోత ్సవాల నిర్వహణకు సానుకూలంగా స్పందించింది. ఇది స్వామి సంకల్పమే స్వామివారు తన వైభవాన్ని ఢిల్లీ ప్రజలకు చూపించాలని సంకల్పించాడు. అందుకే ఉత్సవ ప్రారంభోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వేడుక నిర్వహణకు అనుమతి లభించినప్పటికీ కొద్ది సమయంలోనే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అది స్వామి మహిమే. భూకంపం వచ్చినా ఎలాంటి అవాంతరంరాలేదు. గ్రామీణులకు సేవలందించేందుకు స్వర్ణ భారతి నేను స్వర్ణ భారతి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీని. గ్రామీణులకు విద్య వైద్య సేవలందించే ఉద్దేశంతో స్వర్ణ భారతి ట్రస్టు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఇటీవలే మా ట్రస్టు కార్యక్రమాలను విజయవాడకు విస్తరించాం. యువతకు వృత్తి విద్యలు, స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడంపై ఎక్కువగా దృష్టి పెట్టాము. ఇప్పటి వరకు 20 వేల మందికి ఈ అంశాల్లో శిక్షణ ఇచ్చాం. ఆంధ్రా బ్యాంకు, జీఎంఆర్ తదితరసంస్థల సహకారంతో శిక్షణ పొందే వారికి స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి పైసా సాయం తీసుకోకుండా ట్రస్టు పనిచేస్తుంది. వారానికి రెండ్రోజులు నెల్లూరులో.. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. వారానికి రెండు రోజులు నెల్లూరుకు వెళ్లి ట్రస్టు వ్యవహారాలు చూస్తుంటాను. మిగతా రోజులు చెన్నైలో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశాను. అందులో గోల్డ్ మెడల్ సాధించాను. సేవాతత్పరత నాన్న నుంచే అబ్బింది సేవ చేయాలని మా నాన్న గారు చెబుతుంటారు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు మానవ సేవతో పాటు మాధవ సేవను చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాన్న నుంచి సేవా దృక్పథాన్ని వారసత్వంగా స్వీకరించాను. రాజకీయాలను మాత్రం కాదు. ప్రజలకు నాయకుడు కావాలంటే రాజకీయాలొక్కటే మార్గం కాదని నా అభిప్రాయం. బయట ఉంటేనే నచ్చిన రీతిలో ప్రజాసేవ చేయవచ్చని నా ఉద్దేశం. అందుకే రాజకీయాల జోలికి వెళ్లదలచుకోలేదు. -
అణువణువునా భారతీయత : దీపా వెంకట్
విజయనగరం రూరల్: సైనిక పాఠశాలలో అణువణువునా భారతీయత ప్రతిబింబిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ అన్నారు. విజయనగరం సమీపంలోని కోరుకొండ సైనిక స్కూల్‌ను ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు సైనిక పాఠశాల రిజిస్ట్రార్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబు పాఠశాల ప్రాంగణంలోని విద్యార్థుల హౌస్‌లు, మెస్ హాల్, సైనిక పాఠశాల అడ్మినిస్ట్రేషన్ భవనం, మైదానాలు, తదితర వాటిని చూపించి వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్, గ్రూప్‌కెప్టెన్ పి.రవికుమార్ పాఠశాలలో చేస్తున్న కార్యకలాపాలు, విద్యార్థుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకిత భావం ఎంతో గొప్పగా ఉందని కొనియాడారు. ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయులలోను, పాఠశాల ఆవరణలో దేశభక్తి ప్రస్పుష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న పూర్వ విద్యార్థులు వారి చదివిన పాఠశాలపై వారికి ఉన్న గౌరవభావాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.