శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు | Deepa venkat interview with sakshi | Sakshi
Sakshi News home page

శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు

Published Tue, Nov 3 2015 8:19 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు

శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు

 స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా విస్తృత సేవలు
 నాన్నే ఆదర్శం.. రాజకీయాల్లోకి వెళ్లను
‘సాక్షి’తో కేంద్రమంత్రి వెంకయ్య  కుమార్తె దీపా వెంకట్
 
 
న్యూఢిల్లీ: నగరంలో కలియుగ వైకుంఠుని వైభవోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. తిరుమలలో వేంకటేశ్వరునికి జరిగే ఉత్సవాల మాదిరిగానే ఢిల్లీలో నిర్వహిస్తోన్న వైభవోత్సవాలు భక్తులకు మహాదానందాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ వాసులకు ఈ భాగ్యాన్ని కల్పించిన ఘనత దీపా వెంకట్‌కే దక్కుతుంది.

జీఎంఆర్ సంస్థల సహకారంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె అయిన దీపా వెంకట్‌కు చెందిన స్వర్ణ భారతి ట్రస్టు శ్రీ వేంకటేశ్వరుని వైభవోత్సవాలను ఢిల్లీలో నిర్వహిస్తోంది. తన వైభవాన్ని ఢిల్లీ వాసులకు చూపించడానికి వేంక టేశ్వరుడు తనను సాధనంగా ఎంచుకున్నాడని వినమ్రతతో చెబుతున్న దీపా వెంకట్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
 
నెల్లూరు వైభవోత్సవాలే ప్రేరణ
నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాన్ని నిర్వహించినపుడు లభించిన అనుభవం.. ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడానికి ప్రేరణ ఇచ్చింది. రద్దీ, సమయాభావం, ఇతర కారణాల వల్ల భక్తులు తిరుమలలో స్వామివారిని దర్శించుకోలేక పోతున్నారని, ప్రత్యేక సేవలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని గుర్తించిన టీటీడీ శ్రీవారి వైభవోత్సవాలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించింది.

ఆ సమయంలో నెల్లూరులో ఆ ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం వేంరెడ్డి ప్రభాకర్‌తో పాటు మా స్వర్ణభారతి ట్రస్టుకు లభించింది. నెల్లూరులో వైభవోత్సవాలకు 7 లక్షల మంది హాజరయ్యారు. రోజుకు కనీసం 60 వేల మంది ఉత్సవంలో పాల్గొనేవారు. శ్రీవారికి చేసే సేవలను సంతృప్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా మంది నన్ను అభినందించారు.

తిరుమలకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు వాసుల స్పందనే ఈ విధంగా ఉంటే.. రాష్ట్రం వెలుపల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు స్ఫురించిన ప్రదేశం దేశ రాజధాని ఢిల్లీ. ఇందుకు టీటీడీని సంప్రదించాను. టీటీడీ కూడా ఢిల్లీలో వైభవోత ్సవాల నిర్వహణకు సానుకూలంగా స్పందించింది.
 
ఇది  స్వామి సంకల్పమే
స్వామివారు తన వైభవాన్ని ఢిల్లీ ప్రజలకు చూపించాలని సంకల్పించాడు. అందుకే ఉత్సవ ప్రారంభోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే జవహర్‌లాల్  నెహ్రూ స్టేడియంలో వేడుక నిర్వహణకు అనుమతి లభించినప్పటికీ కొద్ది సమయంలోనే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అది స్వామి మహిమే. భూకంపం వచ్చినా ఎలాంటి అవాంతరంరాలేదు.  
 
గ్రామీణులకు సేవలందించేందుకు స్వర్ణ భారతి
నేను స్వర్ణ భారతి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీని. గ్రామీణులకు విద్య వైద్య సేవలందించే ఉద్దేశంతో స్వర్ణ భారతి ట్రస్టు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఇటీవలే మా ట్రస్టు కార్యక్రమాలను విజయవాడకు విస్తరించాం. యువతకు వృత్తి విద్యలు, స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వడంపై ఎక్కువగా దృష్టి పెట్టాము. ఇప్పటి వరకు 20 వేల మందికి ఈ అంశాల్లో శిక్షణ ఇచ్చాం. ఆంధ్రా బ్యాంకు, జీఎంఆర్ తదితరసంస్థల సహకారంతో శిక్షణ పొందే వారికి స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి పైసా సాయం తీసుకోకుండా ట్రస్టు పనిచేస్తుంది.  
 
వారానికి రెండ్రోజులు నెల్లూరులో..
ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. వారానికి రెండు రోజులు నెల్లూరుకు వెళ్లి ట్రస్టు వ్యవహారాలు చూస్తుంటాను. మిగతా రోజులు చెన్నైలో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశాను. అందులో గోల్డ్ మెడల్ సాధించాను.
 
 
సేవాతత్పరత నాన్న నుంచే అబ్బింది
సేవ చేయాలని మా నాన్న గారు చెబుతుంటారు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు మానవ సేవతో పాటు మాధవ సేవను చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాన్న నుంచి సేవా దృక్పథాన్ని వారసత్వంగా స్వీకరించాను. రాజకీయాలను మాత్రం కాదు. ప్రజలకు నాయకుడు కావాలంటే రాజకీయాలొక్కటే మార్గం కాదని నా అభిప్రాయం. బయట ఉంటేనే నచ్చిన రీతిలో ప్రజాసేవ చేయవచ్చని నా ఉద్దేశం. అందుకే రాజకీయాల జోలికి వెళ్లదలచుకోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement