swarna bharathi trust
-
తెలుగు సంస్కృతి నేర్పుతున్నారు : రాష్ట్రపతి
సాక్షి, నెల్లూరు : అక్షర స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయినా.. తెలుగు సంస్కృతి నేర్పుతున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనకు అత్యంత ఆప్తులని తెలిపారు. మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా.. సమాజానికి ఏదో ఒక సేవ చేయాలన్నారు. వెంకయ్య నాయుడు జీవితంలో ఎంతో సాధించాడని, ఆయన అందరికీ అజాతశత్రువన్నారు. వెంకయ్య నాయుడు తెలుగు సంస్కృతిని కాపాడేందుకు చేస్తున్న సేవలు అభినందనీయని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి స్వర్ణభారత్ ప్రజలకు చేరువ కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకే స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రారంభించామన్నారు. ట్రస్ట్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలోనే కాక ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తున్నామని తెలిపారు. ఇన్నేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలకు స్వయం శక్తితో ఎదిగేలా శిక్షణనిచ్చామన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు అనేక సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. తన పిల్లలు రాజకీయాల్లోకి వచ్చినా సంతోషమేనని... అక్కడ చేసే సేవనే స్వర్ణభారత్ ద్వారా ఇక్కడా చేస్తున్నారని అన్నారు. -
నాకు ప్రధాన మంత్రి కావాలని కోరిక లేదు
విజయవాడ: తనకు భారత ప్రధాన మంత్రి కావాలని కోరిక లేదని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...2020 జనవరి 12కి రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుంటానని చెప్పారు. కేవలం సమాజ సేవకే పరిమితం అవుతానని వ్యాఖ్యానించారు. భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దేశంలో 35 సంవత్సరాల వయసున్న వారు 60 శాతం మంది ఉన్నారని, ప్రపంచంలో ఏదేశానికి ఇంత గొప్ప వనరు లేదని తెలిపారు. ప్రపంచం మొత్తం ఆర్థికంగా మందగమనం దిశగా వెళ్తున్నప్పటికీ భారతదేశం మాత్రం నిలదొక్కుకుందని, ఎంతవరకు ముందుకు వెళ్లింది అనే అంశం తరవాత అంశమని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని, వ్యవసాయం ప్రస్తుత పరిస్థితులలో సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రైతుకు సామర్థ్యం పెరగాలని, లేకపోతే దేశం, భావితరాలు ఇబ్బందికి గురిఅవుతాయని చెప్పారు. 2018లో ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భావితరాలు కష్టపడటం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఫిరాయింపులపై ఫిర్యాదులు వస్తే మూడు నెలల్లో పరిష్కరించాలని, దీనిపై తానో ఒరవడి సృష్టించానని చెప్పారు. చట్ట సభలను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని, చట్ట సభలు సజావుగా సాగితే బిల్లులను చర్చించవచ్చునని పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారాలుంటే కొందరు సభ్యులు హడావుడి చేస్తారని, సభ్యుల ప్రవర్తన ఎలా ఉందో ప్రజలకు తెలియాలంటే ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలనే అభిప్రాయమూ ఉందని చెప్పారు. చట్ట సభల్లో నిరసన తెలపడానికి వాకౌట్ల వంటి అనేక మార్గాలున్నాయన్నారు. పార్టీలు తీసుకునే నిర్ణయాలపై తాను కామెంట్ చేయదలచుకోలేదన్నారు. పరిపాలనా సౌలభ్యంగా అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు ఉండాలని వ్యాఖ్యానించారు. -
‘వెంకయ్య ట్రస్టుపై విచారణ చేయాలి’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన స్వర్ణభారతి ట్రస్టు భవనాల నిర్మాణంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎంకు రాసిన బహిరంగ లేఖను ఆయన విజయవాడ దాసరి భవన్లో మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబును ఉపయోగించుకుని వెంకయ్య స్వర్ణభారతి ట్రస్టు పేరుతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనే అనుమానాలున్నాయన్నారు. ఆత్కూరులో సుమారు 8 ఎకరాల్లో స్వర్ణభారతి ట్రస్టును ఏర్పాటు చేశారని, అందులో ఎకరం గ్రామకంఠం భూమి ఉందని ఆరోపించారు. స్వర్ణభారతి వ్యవహారంలో ఎవరెవరున్నారు, భూములు కొన్నది ఎవరనే విషయాలను నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, లారీల సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరో రెండు లేఖలను రామకృష్ణ సీఎంకు రాశారు. -
స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవానికి హాజరైన సుమిత్ర
నెల్లూరు : నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రియో ఒలింపిక్స్‌లో రజిత పతక విజేత పి.వి.సింధు, పి. గోపి చంద్‌కు వెంకయ్యనాయుడు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యకలాపాలను వెంకయ్యనాయుడు వారికి వివరించారు. -
'స్వర్ణభారతి ట్రస్ట్ కు రూ. 160 కోట్లు మళ్లించారు'
తిరుపతి కల్చరల్: పదవుల్లో ఉండి అడ్డంగా వేలకోట్లు దోపిడీ చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడులపై తక్షణమే సీబీఐ విచారణ జరపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని అంబేడ్కర్ భవన్లో మం గళవారం నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 160 కోట్ల కేంద్ర నిధులు స్వర్ణభారతి ట్రస్ట్‌కు మళ్లించిన ఘనత వెంకయ్య నాయుడిదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, తీసుకొచ్చిన దుగ్గరాజట్నం, కేన్సర్ ఆసుపత్రి, మన్నవరం, 7,008 నిరుపేదల నివాస గృహాలను రద్దు చేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చింతామోహన్ హెచ్చరించారు. ఎలాంటి పదవులు లేకుండా తన వ్యాపార మేథస్సుతో ఆస్తులు సంపాదించిన వైఎస్ జగన్‌పై సీబీఐ విచారణ చేయడం సరికాదన్నారు. అనంతరం చింతామోహన్ వినూత్నంగా రోడ్డుపైకి వచ్చి చేతిలో చీపురు పట్టి చెత్త ఊడ్చి నిరసన తెలిపారు. రోడ్డులో చెత్త ఊడ్చినట్లు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఊడ్చేస్తానంటూ చింతామోహన్ సంకేతాలిచ్చారు. -
శ్రీవారు నన్ను సాధనంగా ఎంచుకున్నారు
స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా విస్తృత సేవలు నాన్నే ఆదర్శం.. రాజకీయాల్లోకి వెళ్లను ‘సాక్షి’తో కేంద్రమంత్రి వెంకయ్య కుమార్తె దీపా వెంకట్ న్యూఢిల్లీ: నగరంలో కలియుగ వైకుంఠుని వైభవోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. తిరుమలలో వేంకటేశ్వరునికి జరిగే ఉత్సవాల మాదిరిగానే ఢిల్లీలో నిర్వహిస్తోన్న వైభవోత్సవాలు భక్తులకు మహాదానందాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ వాసులకు ఈ భాగ్యాన్ని కల్పించిన ఘనత దీపా వెంకట్‌కే దక్కుతుంది. జీఎంఆర్ సంస్థల సహకారంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె అయిన దీపా వెంకట్‌కు చెందిన స్వర్ణ భారతి ట్రస్టు శ్రీ వేంకటేశ్వరుని వైభవోత్సవాలను ఢిల్లీలో నిర్వహిస్తోంది. తన వైభవాన్ని ఢిల్లీ వాసులకు చూపించడానికి వేంక టేశ్వరుడు తనను సాధనంగా ఎంచుకున్నాడని వినమ్రతతో చెబుతున్న దీపా వెంకట్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెల్లూరు వైభవోత్సవాలే ప్రేరణ నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాన్ని నిర్వహించినపుడు లభించిన అనుభవం.. ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించడానికి ప్రేరణ ఇచ్చింది. రద్దీ, సమయాభావం, ఇతర కారణాల వల్ల భక్తులు తిరుమలలో స్వామివారిని దర్శించుకోలేక పోతున్నారని, ప్రత్యేక సేవలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని గుర్తించిన టీటీడీ శ్రీవారి వైభవోత్సవాలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సమయంలో నెల్లూరులో ఆ ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం వేంరెడ్డి ప్రభాకర్‌తో పాటు మా స్వర్ణభారతి ట్రస్టుకు లభించింది. నెల్లూరులో వైభవోత్సవాలకు 7 లక్షల మంది హాజరయ్యారు. రోజుకు కనీసం 60 వేల మంది ఉత్సవంలో పాల్గొనేవారు. శ్రీవారికి చేసే సేవలను సంతృప్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినందుకు చాలా మంది నన్ను అభినందించారు. తిరుమలకు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు వాసుల స్పందనే ఈ విధంగా ఉంటే.. రాష్ట్రం వెలుపల నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు స్ఫురించిన ప్రదేశం దేశ రాజధాని ఢిల్లీ. ఇందుకు టీటీడీని సంప్రదించాను. టీటీడీ కూడా ఢిల్లీలో వైభవోత ్సవాల నిర్వహణకు సానుకూలంగా స్పందించింది. ఇది స్వామి సంకల్పమే స్వామివారు తన వైభవాన్ని ఢిల్లీ ప్రజలకు చూపించాలని సంకల్పించాడు. అందుకే ఉత్సవ ప్రారంభోత్సవానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వేడుక నిర్వహణకు అనుమతి లభించినప్పటికీ కొద్ది సమయంలోనే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అది స్వామి మహిమే. భూకంపం వచ్చినా ఎలాంటి అవాంతరంరాలేదు. గ్రామీణులకు సేవలందించేందుకు స్వర్ణ భారతి నేను స్వర్ణ భారతి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీని. గ్రామీణులకు విద్య వైద్య సేవలందించే ఉద్దేశంతో స్వర్ణ భారతి ట్రస్టు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఇటీవలే మా ట్రస్టు కార్యక్రమాలను విజయవాడకు విస్తరించాం. యువతకు వృత్తి విద్యలు, స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడంపై ఎక్కువగా దృష్టి పెట్టాము. ఇప్పటి వరకు 20 వేల మందికి ఈ అంశాల్లో శిక్షణ ఇచ్చాం. ఆంధ్రా బ్యాంకు, జీఎంఆర్ తదితరసంస్థల సహకారంతో శిక్షణ పొందే వారికి స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి పైసా సాయం తీసుకోకుండా ట్రస్టు పనిచేస్తుంది. వారానికి రెండ్రోజులు నెల్లూరులో.. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. వారానికి రెండు రోజులు నెల్లూరుకు వెళ్లి ట్రస్టు వ్యవహారాలు చూస్తుంటాను. మిగతా రోజులు చెన్నైలో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశాను. అందులో గోల్డ్ మెడల్ సాధించాను. సేవాతత్పరత నాన్న నుంచే అబ్బింది సేవ చేయాలని మా నాన్న గారు చెబుతుంటారు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు మానవ సేవతో పాటు మాధవ సేవను చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాన్న నుంచి సేవా దృక్పథాన్ని వారసత్వంగా స్వీకరించాను. రాజకీయాలను మాత్రం కాదు. ప్రజలకు నాయకుడు కావాలంటే రాజకీయాలొక్కటే మార్గం కాదని నా అభిప్రాయం. బయట ఉంటేనే నచ్చిన రీతిలో ప్రజాసేవ చేయవచ్చని నా ఉద్దేశం. అందుకే రాజకీయాల జోలికి వెళ్లదలచుకోలేదు. -
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపడాలి : వెంకయ్యనాయుడు
వెంకటాచలం (నెల్లూరు) : దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్ల శిశువు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో వైద్యం వెనుకబడి ఉందన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు వైద్యం, విద్యా ఖర్చులు పెరిగిపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. -
స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
-
'చంద్రబాబు మీ సీఎం కాదు.. మా సీఎం'
నెల్లూరు: స్వర్ణభారతి ట్రస్టు 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు ఓవర్‌యాక్షన్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎదుటే పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు నాయుడు మీ సీఎం కాదు.. మా సీఎం అంటూ విరుచుకుపడ్డారు. నేతల ఒత్తిడికి తలొగ్గి వాహనాలకు పోలీసులు అనుమతిచ్చారు. సమన్వయం లోపంతో గందరగోళం నెలకొనడంతో అంతకుముందు వీఐపీల వాహనాలను పోలీసులు ఆపేశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రోడ్డుమార్గానా రేణిగుంటకు చంద్రబాబు పయనమయ్యారు. రేణిగుంట నుంచి విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, 2019 జాతీయ క్రీడలు నెల్లూరులో నిర్వహించేందుకు యత్నిస్తానని చంద్రబాబు అంతకుముందు చెప్పారు. కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హామీయిచ్చారు.