'స్వర్ణభారతి ట్రస్ట్ కు రూ. 160 కోట్లు మళ్లించారు'
తిరుపతి కల్చరల్: పదవుల్లో ఉండి అడ్డంగా వేలకోట్లు దోపిడీ చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడులపై తక్షణమే సీబీఐ విచారణ జరపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని అంబేడ్కర్ భవన్‌లో మం గళవారం నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 160 కోట్ల కేంద్ర నిధులు స్వర్ణభారతి ట్రస్ట్‌కు మళ్లించిన ఘనత వెంకయ్య నాయుడిదేనన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, తీసుకొచ్చిన దుగ్గరాజట్నం, కేన్సర్ ఆసుపత్రి, మన్నవరం, 7,008 నిరుపేదల నివాస గృహాలను రద్దు చేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చింతామోహన్ హెచ్చరించారు.
ఎలాంటి పదవులు లేకుండా తన వ్యాపార మేథస్సుతో ఆస్తులు సంపాదించిన వైఎస్ జగన్‌పై సీబీఐ విచారణ చేయడం సరికాదన్నారు. అనంతరం చింతామోహన్ వినూత్నంగా రోడ్డుపైకి వచ్చి చేతిలో చీపురు పట్టి చెత్త ఊడ్చి నిరసన తెలిపారు. రోడ్డులో చెత్త ఊడ్చినట్లు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఊడ్చేస్తానంటూ చింతామోహన్ సంకేతాలిచ్చారు.