‘వెంకయ్య ట్రస్టుపై విచారణ చేయాలి’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన స్వర్ణభారతి ట్రస్టు భవనాల నిర్మాణంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎంకు రాసిన బహిరంగ లేఖను ఆయన విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబును ఉపయోగించుకుని వెంకయ్య స్వర్ణభారతి ట్రస్టు పేరుతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనే అనుమానాలున్నాయన్నారు.
ఆత్కూరులో సుమారు 8 ఎకరాల్లో స్వర్ణభారతి ట్రస్టును ఏర్పాటు చేశారని, అందులో ఎకరం గ్రామకంఠం భూమి ఉందని ఆరోపించారు. స్వర్ణభారతి వ్యవహారంలో ఎవరెవరున్నారు, భూములు కొన్నది ఎవరనే విషయాలను నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, లారీల సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరో రెండు లేఖలను రామకృష్ణ సీఎంకు రాశారు.