
విజయవాడ: తనకు భారత ప్రధాన మంత్రి కావాలని కోరిక లేదని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...2020 జనవరి 12కి రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుంటానని చెప్పారు. కేవలం సమాజ సేవకే పరిమితం అవుతానని వ్యాఖ్యానించారు. భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దేశంలో 35 సంవత్సరాల వయసున్న వారు 60 శాతం మంది ఉన్నారని, ప్రపంచంలో ఏదేశానికి ఇంత గొప్ప వనరు లేదని తెలిపారు.
ప్రపంచం మొత్తం ఆర్థికంగా మందగమనం దిశగా వెళ్తున్నప్పటికీ భారతదేశం మాత్రం నిలదొక్కుకుందని, ఎంతవరకు ముందుకు వెళ్లింది అనే అంశం తరవాత అంశమని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని, వ్యవసాయం ప్రస్తుత పరిస్థితులలో సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రైతుకు సామర్థ్యం పెరగాలని, లేకపోతే దేశం, భావితరాలు ఇబ్బందికి గురిఅవుతాయని చెప్పారు. 2018లో ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
భావితరాలు కష్టపడటం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఫిరాయింపులపై ఫిర్యాదులు వస్తే మూడు నెలల్లో పరిష్కరించాలని, దీనిపై తానో ఒరవడి సృష్టించానని చెప్పారు. చట్ట సభలను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని, చట్ట సభలు సజావుగా సాగితే బిల్లులను చర్చించవచ్చునని పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారాలుంటే కొందరు సభ్యులు హడావుడి చేస్తారని, సభ్యుల ప్రవర్తన ఎలా ఉందో ప్రజలకు తెలియాలంటే ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలనే అభిప్రాయమూ ఉందని చెప్పారు. చట్ట సభల్లో నిరసన తెలపడానికి వాకౌట్ల వంటి అనేక మార్గాలున్నాయన్నారు. పార్టీలు తీసుకునే నిర్ణయాలపై తాను కామెంట్ చేయదలచుకోలేదన్నారు. పరిపాలనా సౌలభ్యంగా అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు ఉండాలని వ్యాఖ్యానించారు.