నుడాకు ఓకే
-
రెండేళ్ల నిరీక్షణ తరువాత క్యాబినేట్‌లో ఆమోదముద్ర
-
చిత్తూరు జిల్లాకు చెందిన రెండింటితో కలిపి 21 మండలాలు
-
పదవుల కోసం పైరవీలు ప్రారంభించిన టీడీపీ నేతలు
నెల్లూరు సిటీ: నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అ«ధారిటీ(నుడా) మంగళవారం క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర పొందింది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న అంశానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. 2014 నవంబర్‌లో ఐఏఎస్ చక్రధర్‌బాబు, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాసులు నుడా ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. నెల్లూరు జిల్లాలోని 33 మండలాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే చాలాకాలం పాటు నుడా అంశంలో కదలిక లేదు. మఽళ్లీ ఇటీవల నుడా వైపు అడుగులు పడ్డాయి. రెండు సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొదటగా 33 మండలాలతో కూడిన ప్రతిపాదన పంపగా, రెండవసారి 14 మండలాలతో కూడిన ప్రతిపాదనలు పంపారు. అయితే కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం 21 మండలాలతో కూడిన నుడాకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
నుడాలో కలిపిన ప్రాంతాలు ఇవే..
నెల్లూరు కార్పొరేషన్, గూడూరు, కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు, నాయుడుపేట నగర పంచాయితీలను నుడాలో కలిపారు. వాటితో పాటు కావలి రూరల్‌లోని గౌరవరం, అనుమడుగు, రుద్రకోట గ్రామాలతో పాటు జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కోవూరు, టీపీగూడూరు, ముత్తుకూరులోని కొంత భాగం, వెంకటాచలం, మలుబోలు, చిల్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, తడ మండలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలను నుడా జాబితాలో చేర్చారు. అయితే నుడాలో కలిపిన మండలాలు అన్నీ హైవేకు రెండువైపులా కలుపుకుంటూ వెళ్లారు. శ్రీసిటీకి చెందిన 7వేల ఎకరాలను మొత్తం నుడాలో కలిపారు. నుడాలో మొత్తం సుమారు 13లక్షల జనాభా, 1600 చదరపు కి.మీ విస్తీర్ణం ఉంది.
నుడా ద్వారానే అనుమతులు
ఇప్పటి వరకు భారీ పరిశ్రమలు, భవనాలు తదితర వాటికి అనుమతుల కోసం అమరావతికి వెళ్ళాల్సి వచ్చేది. అయితే నుడా ఏర్పడ్డంతో పరిశ్రమలు, భారీ భవనాలకు అనుమతులకు నుడా ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది. దీంతో నుడాకు భారీ ఆదాయం సమకూరుతుంది. నుడా ఆదాయాన్ని రోడ్లు, పార్క్‌లు, ఇతర అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. కార్పొరేషన్ పరిధిలోని భవన అనుమతులు కూడా నుడా ద్వారానే తీసుకోవాల్సి వస్తుంది.
నుడా పదవుల కోసం అధికార పార్టీ నేతల పైరవీలు
క్యాబినెట్‌లో మంగళవారం నుడాకు ఆమోద ముద్ర పడటంతో అధికార పార్టీ నేతలు పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. నుడాకు చైర్మన్, 20 మంది సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో నామినేటెడ్ చైర్మన్ పదవి కోసం నాయకులు పావులు కదుపుతున్నారు. అయితే మరికొంత మంది ఆశావహులు కూడా నుడా చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్నారు. సభ్యుల పదవుల కోసం టీడీపీలోని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, నుడా వైస్ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.