ప్రస్తుతం ఉన్న ప్రహరీ
కావలి : కావలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పెద్ద తలకాయలు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. వివిధ రకాల పనులు కోసమంటూ పలు శాఖలు ద్వారా నిధులను మంజూరు చేసుకొని, మొక్కుబడిగా పనులు చేస్తూ నిధులు స్వాహా జైత్రయాత్ర చేపడుతున్నారు. కావలి పట్టణ పరిధిలో ట్రంక్‌రోడ్డును ఆనుకుని ఉత్తర శివారు ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన కంపోస్ట్ డంపింగ్ యార్డ్ ఉండేది. అయితే పట్టణం విస్తరిస్తుండడంతో దీన్ని మండలంలోని మోర్లవారిపాళెం ప్రాంతానికి తరలించారు. పాత డంపింగ్ యార్డ్ ఉన్న సర్వే నంబర్ 789లో మొత్తం 8 ఎకరాల స్థలం ఉంది. ఇందులో పార్క్ నిర్మించడానికి 3.2 ఎకరాలను ‘నుడా’కు అప్పగించారు. ఈ స్థలానికి ప్రహరీ లక్షణంగా ఉంది. అయితే ఈ స్థలంలో చెత్తచెదారం ఉండటంతో వాటిని పూర్తిగా తొలగించి, గ్రావెల్ పోసి ఎత్తు లేపాలని ‘నుడా’ అధికారులు స్థానిక మున్సిపాలిటీకి సూచించారు.
అయితే ఈ పనులకు సంబంధించిన ప్రక్రియను మున్సిపాలిటీ నేటి వరకు ప్రారంభించనే లేదు. ఈ పనులు పూర్తి కావడానికి కనీసం రెండు నెలలు పడుతుందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతనే నుడా నిర్మించ తలపెట్టిన పార్క్ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీ చేయాల్సిన ప్రాథమిక పనులకు నిధులు లేక మిన్నకుండిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోగా ప్రభుత్వ నిధులు దిగమింగడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. నుడా ఏర్పడిన తర్వాత కావలికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో వీరి కన్ను నుడాపై పడింది. నుడా ద్వారా కావలిలో పార్క్ నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో అందుకు సంబంధించి ముందుగానే ప్రహరీని నూతనంగా నిర్మాణం చేపట్టాలనే పేరుతో రూ.50 లక్షలకు అంచనాలు తయారు చేయాలని నుడా అధికారులకు సూచించారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఉండే అధికారులు రూ.43,73,605 వ్యయంతో ప్రహరీ నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు.
అన్ని సాంకేతిక ప్రక్రియలను పూర్తిచేసి టెండరు కూడా పిలిచారు. ఈ టెండరు ఎవరి కంటే వారికి దక్కనీయకుండా టీడీపీ నాయకులే బినామీ పేర్లతో దక్కించుకోవడానికి అంతా సిద్ధం చేశారు. అసలు పార్క్ నిర్మాణ పనులకు నిధులే మంజూరు కాలేదు. ఆ పనులు ప్రారంభం కాకుండానే టీడీపీ నాయకులు ఆ ప్రదేశంలో ఉన్న ప్రహరీ కూల్చేసి కొత్త ప్రహరీ పేరుతో నిధులను లూటీ చేస్తున్న వైనం అధికార వర్గాలే విస్తుపోతున్నాయి. నిధులను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు ‘నుడా’ పాలక వర్గం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనవసరమైన పనులు చేపడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment