
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పొత్తు పేరుతో టీడీపీ జిల్లాలో జనసేన పార్టీ జెండా పీకేసే పనిలో ఉంది. క్యాడర్ అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీ ఉనికి నెల్లూరు, కావలిలో మాత్రమే కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ దఫా ఎన్నికల నాటికి కావలి, నెల్లూరు సిటీ, రూరల్‌లో మాత్రమే నియోజకవర్గ స్థాయి లీడర్ల హడావుడి కొంత కనిపించింది. తాజాగా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ కేడర్ పూర్తిగా కనుమరుగైందనే చెప్పాలి.
పాతాళంలోకి పడిపోయి
గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నెల్లూరు సిటీలో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌లో మనుక్రాంత్‌రెడ్డి, కావలి నుంచి అలహరి సుధాకర్ జనసేన పార్టీని కనిపెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉనికి చాటుకుంటూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచి పొత్తు పెట్టుకోవడంతో నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని గ్రహించిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తన భవిష్యత్ కోసం వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. దీంతో మనుక్రాంత్‌రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి సిటీకి మారిపోయారు.
పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ నుంచి తనకు అవకాశం వస్తుందని భావించిన మనుక్రాంత్‌రెడ్డి సిటీ పరిధిలో డివిజన్ల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. అయితే నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్య ర్థిగా నారాయణ పేరు ఖరారు కావడంతో కనీసం నెల్లూరు రూరల్ సీటు అయినా వస్తుందని ఆశించిన మనుక్రాంత్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో పార్టీ క్యాడర్ సైతం చెల్లాచెదురై పరిస్థితి పాతాళానికి పడిపోయింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలు ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థులు వారిని కనీసం దరిచేరనీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పనిచేయడం అవసరమా? అని లోలోన మదనపడుతున్నారు.
ఎన్నికల తర్వాత గ్లాసు కనిపించేనా..
ప్రస్తుతం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదు. అయినప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు టీడీపీ విజయం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా.. టీడీపీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా జనసేన జెండా పీకేసేందుకు కంకణం కట్టుకున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ తన బినామీ అయిన గునుకుల కిషోర్‌ను జనసేనలోకి పంపి ఆయన్ను ముందుంచి మనుక్రాంత్‌రెడ్డిని ఎన్నికల క్షేత్రంలో లేకుండా చేశారు. నారాయణ తన పార్టీ కేడర్‌తో జనసేన జెండాలు మోయిస్తూ ఆ పార్టీని దాదాపు లేకుండా చేశారు. కావలిలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అలహరి సుధాకర్ టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కోసం పనిచేస్తున్నారు.
అయితే కావ్య కృష్ణారెడ్డి తనదైన ధోరణిలో జనసేన క్యాడర్‌ను టీడీపీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు అలహరి సుధాకర్ ఇటీవల నాగబాబు, నాదెండ్ల మనోహర్‌లను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని తెలిసింది. జిల్లాలో ఎక్కడైతే జనసేన ఉనికి ఉందో అక్కడ ఆ పార్టీ క్యాడర్‌ను సైతం టీడీపీలో కలిపేసుకుని ఆ పార్టీ జెండా పీకేసే పనిలో పచ్చనేతలు నిమగ్నమయ్యారు. ఇదంతా టీడీపీ అధినేత సూచనల మేరకే జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన జెండా కనిపించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment