ఆత్మకూరు: టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మడపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీకి చెందిన పెద్దిరెడ్డి కిరణ్, కిషోర్, నవీన్, వినయ్, పూర్ణచంద్ర తదితరులు అడ్డుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, నిలిపివేయమనడం సరికాదని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామపెద్దలు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టీడీపీకి చెందిన కిరణ్, కిషోర్ తదితరులు వైఎస్సార్ సీపీకి చెందిన ఇనకల్లు ప్రసాద్‌రెడ్డి, పెంచలరెడ్డి, మాజీ సర్పంచ్ గుండుబోయిన నారాయణయాదవ్ ఇళ్లపై రాళ్లు, కర్రలు, కొడవలి తదితర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు.
దాడిలో ప్రసాద్‌రెడ్డికి గాయాలు కాగా, పైదంతాలు రెండు ఊడిపోయాయి. పెంచలరెడ్డి, నారాయణయాదవ్‌లకూ గాయాలయ్యాయి. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. గాయపడిన వారిని తొలుత చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో కలిసి ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment