సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. అర్థరాత్రి వైఎస్సార్ కాలనీలో దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అబ్దుల్ ఇంట్లోకి చొరబడి టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. అబ్ధుల్ ఇంట్లో వస్తువులు, బైక్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న అబ్దుల్ మామను తలపై కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నామనే దాడి చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు
చిత్తూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామంలో టీడీపీ నేతలు దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాత్రి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్త విఘ్నేష్ కనిపించకుండా పోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విఘ్నేష్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్రేగిపోతున్న టీడీపీ నేతలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలను అరికట్టాల్సిన పోలీసులు.. ప్రేక్షక పాత్ర పోషించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో హింసా రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల దాకా ప్రశాంతంగా ఉన్న అనంతలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమారుస్తున్నారు. శింగనమల నియోజకవర్గం పుట్లూరు లో ఎరికలయ్య (50), హిందూపురం నియోజకవర్గంలో సతీష్ (40) లపై టీడీపీ దాడులు చేసింది. ఈ ఇద్దరు నేతలు బెంగళూరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు.
తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గం మల్లికార్జున పల్లిలో టీడీపీ వేధింపులకు ఇద్దరు బలయ్యారు. మల్లికార్జునపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శాంతకుమార్‌పై టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టారు. పోలీసులు కూడా విచారణ పేరుతో శాంతకుమార్‌ను వేధించారు. ఈ మనస్తాపంతో శాంతకుమార్ భార్య మమత (30) ఆరుమాసాల కూతురిని చంపి తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేతల దాష్టీకానికి ఇదే ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ కదిరి, తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment