సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పీఠం మార్పు విషయమై అధికార పార్టీ శ్రేణుల్లో చర్చలు నడుస్తున్నాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థ చుట్టూ ఉన్న ‘నుడా’ పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు బోధన్, ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో కలుపుకుని మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ‘నుడా’ విస్తరించి ఉంది.
అయితే ప్రస్తుతం ‘నుడా’ చైర్మన్‌గా చామకూర ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. మూడున్నరేళ్ల క్రితం చైర్మన్‌గా ఉత్తర్వులు పొందిన ప్రభాకర్‌రెడ్డి ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నారు. కాగా ఈ పదవి కోసం మరికొందరు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆశావహుడు ఈ పీఠం దక్కించుకునేందుకు ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అతిత్వరలో ఉత్తర్వులు వస్తాయని సదరు ఆశావహుడు ఆశాభావం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
నిజామాబాద్ నగర అభివృద్ధి, విస్తరణలో ‘నుడా’ పాత్ర అత్యంత కీలకం. దీంతో ఈ పదవి విషయంలో పలువురు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ఒకరి ప్రయత్నా లు తుది దశకు చేరినట్లు తెలుస్తుండడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెల కొంది. ఇదిలా ఉండగా మరోవైపు రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం సైతం గత మూడున్నరేళ్లుగా భర్తీ చేయకుండా ఖాళీగా ఉంది. ఈ పీఠం కోసం సైతం పలువురు ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు.
అయితే పోటీ తీవ్రంగా ఉండడం, మా ర్కెట్ కమిటీ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య ఈ పదవి విషయంలో గుంజాటన ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఎ టూ తేల్చకుండా మార్కెట్ కమిటీ పాలకవర్గం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. మార్కెట్ కమిటీ పరిస్థితి ఇలా ఉండగా, ‘నుడా’ పదవి విషయంలో పరిస్థితి మరోలా ఉంది. మొత్తం మీద జిల్లాలో కీలకమైన ఈ రెండు నామినేటెడ్ పదవుల భర్తీ, మార్పుల విషయంలో దేనికదే ప్రత్యేక పరిస్థితి కలిగి ఉండడంతో విచిత్ర వాతావరణం నెలకొంది.
దసరా నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించనుండడంతో ఆ తదుపరి నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర మంలో కీలకమైన ఈ రెండు నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు గట్టిగానే ప్నయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం ఎప్పుడొస్తుందా అని పలువురు ఎదురు చూస్తుండగా, ‘నుడా’ పీఠంపైకి కొత్త ముఖం వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment