సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని పంట భూముల్లో ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,049 ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్లు వెలిసినట్లు 2015లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించగా ఇప్పుడు వాటి సంఖ్య పది వేలకు పైనే ఉంటుందని అంచనా. ప్రతి లే అవుట్‌లో సగటున 50 ఇంటి ప్లాట్లు ఉంటాయని అంచనా వేసినా దాదాపు 5 లక్షల మంది అక్రమ లే అవుట్లలో స్థలం కొనుగోలు చేసి మోసపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
అనుమతులు తప్పనిసరి
గ్రామాల పరిధిలో కొత్తగా ఇళ్ల ప్లాట్లతో లే అవుట్ వేయాలంటే అనుమతి తప్పనిసరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే 2002 ఫిబ్రవరి 26న గ్రామ పంచాయతీ ల్యాండ్ డెవలప్‌మెంట్ (లేఅవుట్ అండ్ బిల్డింగ్)పై సమగ్ర విధానాలతో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త లే అవుట్ వేయాలంటే రోడ్లు, పార్కు, ఆటస్థలం లేదా పాఠశాల తదితరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని సంబంధిత గ్రామ పంచాయతీకి ఉచితంగా రాసివ్వాలి. గ్రామ పంచాయతీలకు ఇలా ఉచితంగా రాసి ఇవ్వాల్సిన స్థల పరిమితి లే – అవుట్ మొత్తం విస్తీర్ణంలో పది శాతం విస్తీర్ణానికి పైబడి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం..
అనుమతి లేకుండా ఏర్పాటయ్యే అక్రమ లే–అవుట్లలలో నిబంధనల ప్రకారం ఇంటి ప్లాన్ అప్రూవల్, కరెంట్ కనెక్షన్, మంచినీటి కొళాయి కనెక్షన్లు మంజూరు చేయరు. బ్యాంకు లోను కూడా రాదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకున్నా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇబ్బంది లేకుండా రెగ్యులరైజేషన్
అక్రమ లే–అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించగా ఎన్నో ఏళ్ల కిత్రం తెలియక అక్రమ లే–అవుట్లలో స్థలం కొన్న వారికి ఇబ్బంది లేకుండా, గ్రామ పంచాయతీలకు నష్టం జరగకుండా రెగ్యులరైజ్ చేయడంపై మార్గాలను సూచించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అక్రమ లే–అవుట్ల రెగ్యులరైజ్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, గ్రామాల్లో అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ శాఖ విడిగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇల్లు కట్టుకున్నా ఆందోళనే..
గుంటూరు జిల్లా నరసరావుపేటలో చిన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్న రాము కష్టార్జితంతో పట్టణ శివారులోని కొత్త లే అవుట్‌లో నాలుగు సెంట్ల స్థలం కొనుక్కున్నాడు. ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అక్రమ లే అవుట్ అని తెలియడంతో నివ్వెరపోయాడు. లక్షలు ధారపోసి కొన్న స్థలాన్ని అలా వదిలేయలేక అక్రమ మార్గంలో భారీగా డబ్బులు ముట్టజెప్పి అనుమతులు తెచ్చుకున్నాడు. బ్యాంకు రుణం రాకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్‌గా అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇంత చేశాక తాను ఇల్లు కట్టింది అక్రమ లే అవుట్‌లో కావడంతో భవిçష్యత్‌లో ఇబ్బందులు తప్పవని మనసులో ఓ మూల భయం రామును తొలుస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment