crop lands
-
గ్రామాల్లో అక్రమ లే–అవుట్లు 10,000 పైనే
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని పంట భూముల్లో ఇబ్బడి ముబ్బడిగా ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,049 ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ లే అవుట్లు వెలిసినట్లు 2015లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించగా ఇప్పుడు వాటి సంఖ్య పది వేలకు పైనే ఉంటుందని అంచనా. ప్రతి లే అవుట్లో సగటున 50 ఇంటి ప్లాట్లు ఉంటాయని అంచనా వేసినా దాదాపు 5 లక్షల మంది అక్రమ లే అవుట్లలో స్థలం కొనుగోలు చేసి మోసపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అనుమతులు తప్పనిసరి గ్రామాల పరిధిలో కొత్తగా ఇళ్ల ప్లాట్లతో లే అవుట్ వేయాలంటే అనుమతి తప్పనిసరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే 2002 ఫిబ్రవరి 26న గ్రామ పంచాయతీ ల్యాండ్ డెవలప్మెంట్ (లేఅవుట్ అండ్ బిల్డింగ్)పై సమగ్ర విధానాలతో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కొత్త లే అవుట్ వేయాలంటే రోడ్లు, పార్కు, ఆటస్థలం లేదా పాఠశాల తదితరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని సంబంధిత గ్రామ పంచాయతీకి ఉచితంగా రాసివ్వాలి. గ్రామ పంచాయతీలకు ఇలా ఉచితంగా రాసి ఇవ్వాల్సిన స్థల పరిమితి లే – అవుట్ మొత్తం విస్తీర్ణంలో పది శాతం విస్తీర్ణానికి పైబడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం.. అనుమతి లేకుండా ఏర్పాటయ్యే అక్రమ లే–అవుట్లలలో నిబంధనల ప్రకారం ఇంటి ప్లాన్ అప్రూవల్, కరెంట్ కనెక్షన్, మంచినీటి కొళాయి కనెక్షన్లు మంజూరు చేయరు. బ్యాంకు లోను కూడా రాదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకున్నా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇబ్బంది లేకుండా రెగ్యులరైజేషన్ అక్రమ లే–అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించగా ఎన్నో ఏళ్ల కిత్రం తెలియక అక్రమ లే–అవుట్లలో స్థలం కొన్న వారికి ఇబ్బంది లేకుండా, గ్రామ పంచాయతీలకు నష్టం జరగకుండా రెగ్యులరైజ్ చేయడంపై మార్గాలను సూచించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అక్రమ లే–అవుట్ల రెగ్యులరైజ్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, గ్రామాల్లో అక్రమ లే అవుట్లపై పంచాయతీరాజ్ శాఖ విడిగా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇల్లు కట్టుకున్నా ఆందోళనే.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో చిన్న మెడికల్ షాపు నిర్వహిస్తున్న రాము కష్టార్జితంతో పట్టణ శివారులోని కొత్త లే అవుట్లో నాలుగు సెంట్ల స్థలం కొనుక్కున్నాడు. ఇంటి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అక్రమ లే అవుట్ అని తెలియడంతో నివ్వెరపోయాడు. లక్షలు ధారపోసి కొన్న స్థలాన్ని అలా వదిలేయలేక అక్రమ మార్గంలో భారీగా డబ్బులు ముట్టజెప్పి అనుమతులు తెచ్చుకున్నాడు. బ్యాంకు రుణం రాకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్‌గా అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇంత చేశాక తాను ఇల్లు కట్టింది అక్రమ లే అవుట్లో కావడంతో భవిçష్యత్‌లో ఇబ్బందులు తప్పవని మనసులో ఓ మూల భయం రామును తొలుస్తూనే ఉంది. -
సాగు భూములకు ఎసరు
► చలానా కడితే చాలు.. భూ వినియోగ మార్పిడి ► ఆర్డీవో అనుమతితో పనిలేదు.. ఇక వ్యవసాయ భూమి ► పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు విచ్చలవిడిగా కేటాయింపు ► భూ వినియోగ మార్పిడి నాలా ఫీజు భారీగా తగ్గింపు ► 9 శాతం నుంచి మూడు శాతానికి కుదింపు.. ► రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేబినేట్లో ఆమోదం.. త్వరలో ఆర్డినెన్స్ ► ఈ నిర్ణయంతో మరింతగా తగ్గిపోనున్న వ్యవసాయ భూమి సాక్షి, అమరావతి రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి వేలాది ఎకరాల సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూములను లాగేసుకుంది. మరోవైపు పారిశ్రామికవేత్తలకు లక్షలాది ఎకరాలను అప్పనంగా అప్పగిస్తోంది. ఇప్పుడీ విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యవసాయ భూములను మరింత విచ్చలవిడిగా పారిశ్రామికవేత్తలకు, తనకు అనుకూలమైన వారికి అప్పగించేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఆంక్షలు, సంబంధిత అధికారుల తనిఖీల్లేకుండానే సాగు భూముల్ని వ్యవసాయేతర పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలు కల్పించింది. ప్రస్తుతమున్న చట్టం ప్రకారం సాగు భూమిని వ్యవసాయేతర అవసరాలకు.. అంటే పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు వినియోగించాలంటే సంబంధిత ఆర్డీవో నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. దీనికి చెల్లుచీటీ ఇస్తూ సవరణలు చేసింది. ఆ ప్రకారం.. ఆర్డీవో అనుమతితో నిమిత్తం లేకుండానే చలానా రూపంలో నాలా(నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్) ఫీజు చెల్లిస్తే సరిపోతుందని, ఆ చలానానే భూవినియోగ మార్పిడికి అనుమతినిచ్చినట్టుగా పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. అంటే భూవినియోగ మార్పిడి కావాల్సిన వ్యక్తి వినియోగ మార్పిడి నాలా ఫీజును చలానా రూపంలో చెల్లిస్తే చాలు.. భూవినియోగ మార్పిడి జరిగిపోయినట్టే. అంతేకాదు.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చేందుకు చెల్లించాల్సిన నాలా ఫీజును సైతం భారీగా తగ్గించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి(కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) చట్టం 3 ఆఫ్ 2006లో చేసిన సవరణలకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సవరణలకు అనుగుణంగా త్వరలో ఆర్డినెన్స్ జారీ కానుంది. పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో సులభంగా వ్యాపారం(ఈజీ బిజినెస్) చేసుకోడానికే ఈ నిర్ణయమని సాకు చెబుతోంది. రాజధాని పేరుతో ఇప్పటికే సాగు యోగ్యమైన వేల ఎకరాల భూమిని ఎడాపెడా పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండడంతో వ్యవసాయ భూమి రానురాను తగ్గిపోతున్నది. దీనిపై ఒకవైపు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దీనివల్ల విచ్చలవిడిగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేందుకు ఆస్కారమేర్పడుతుంది. రైతులకు తీరనినష్టం వాటిల్లనుంది. అంతేగాక భవిష్యత్తులో వ్యవసాయ భూమి మరింతగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతమున్న విధానమిది.. ప్రస్తుతమున్న చట్టప్రకారం సాగు భూమిని ఇతర అవసరాలు.. అంటే పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు వినియోగించాలంటే సంబంధిత ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డీవో ఆ భూమిని స్వయంగా పరిశీలిస్తారు. సాగుభూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించవచ్చా? లేదా? అని పరిశీలించాక గ్రీనరీ ఎంతప్రాంతంలో ఉండాలనే నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, నాలా ఫీజు చెల్లించాక భూవినియోగ మార్పిడికి అనుమతి ఇస్తారు. ఇకపై ఆర్డీవోకు దరఖాస్తు చేయనక్కర్లేదు.. అయితే తాజా సవరణలతో సాగుభూమిని పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు వినియోగించుకోవాలంటే ఇకపై ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. అలాగే ఆర్డీవో అనుమతి అవసరం లేదు. భూ వినియోగ మార్పిడి కావాల్సిన వ్యక్తి వినియోగ మార్పిడి నాలా ఫీజును చలానారూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఆ చలానానే వినియోగ మార్పిడికి అనుమతిచ్చినట్టుగా పరిగణిస్తూ సవరణ చేశారు. అంతేగాక భూవినియోగ మార్పిడికి చెల్లించాల్సిన నాలా ఫీజును భారీగా తగ్గించారు. విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మినహాయించి మిగతా రాష్ట్రమంతటా భూవినియోగ మార్పిడి నాలా ఫీజు 9 శాతంగా ఉండగా దాన్ని మూడు శాతానికి తగ్గించింది. (అంటే భూమి విలువలో గతంలో 9 శాతం నాలా ఫీజు చెల్లిస్తుండగా ఇప్పుడు కేవలం మూడు శాతం చెల్లిస్తే చాలు). విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూవినియోగ మార్పిడి నాలా ఫీజును 5 శాతం నుంచి రెండు శాతానికి తగ్గించారు. ఈ ఫీజును తగ్గించడం వల్ల పరిశ్రమల ఏర్పాటును, గృహాల ప్రాజెక్టులు చేపట్టడాన్ని ప్రోత్సహించినట్లవుతుందని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. నాలా ఫీజు పూర్తిగా రద్దుకు తొలుత నిర్ణయం.. నిజానికి నాలా ఫీజును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలు తొలుత నిర్ణయించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఒకానొక పరిశ్రమకు కేటాయించిన భూముల్ని వ్యవసాయ వినియోగం నుంచి పారిశ్రామిక వినియోగానికి మార్చేందుకు చెల్లించాల్సిన నాలా ఫీజు నుంచి మినహాయింపు సైతం ఇచ్చారు. అయితే ఒక పరిశ్రమకోసం మినహాయింపు కల్పిస్తే.. మిగతావారూ ఇదే విధానం అమలు చేయాలని అడుగుతారని రెవెన్యూశాఖ అభ్యంతరం చెప్పింది. అయినప్పటికీ ‘ముఖ్య’ నేత ఒత్తిడితో సదరు పరిశ్రమకు నాలా ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇచ్చారు. ఇదే క్రమంలో నాలా ఫీజును రద్దు చేయాలని ‘ముఖ్య’ నేత ఆ తర్వాత భావించడంతో తప్పనిసరై రెవెన్యూశాఖ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించింది. దీనిపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో నాలా ఫీజు రద్దు నుంచి ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గారు. ఫీజు తగ్గింపుతో సరిపుచ్చారు. -
మిడ్‌మానేరుకు గండిపై దర్యాప్తు జరపాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మంకమ్మతోట/బోయినపల్లి: కరీంనగర్‌లోని మిడ్‌మానేర్‌కు గండిపడి.. వరద ప్రవాహం తో ఇసుక మేటలు పడిన పంట భూములకు ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మిడ్‌మానేర్ ప్రాజెక్టును సంద ర్శించి పంటలు కోల్పోయిన బాధితులను పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు. అలాగే, బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గండిపడ్డ మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. మాన్వాడ వద్ద పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. నష్టపరిహారం అందేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిడ్‌మానేర్ ప్రాజెక్టు ముంపుకు గురై పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అలాగే 12 ముంపు గ్రామాల నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కట్ట తెగడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం కనబడుతున్నా యన్నారు. స్పిల్‌వే కన్నా ఎత్తులో మట్టి కట్ట నిర్మించాల్సి ఉండగా, తక్కువ ఎత్తులో నిర్మిం చడం తోనే నీటి ఉధృతికి కట్ట తెగిందన్నారు. మిడ్‌మానేర్‌ను సందర్శించిన వారిలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మతీన్ ముజారుద్దీన్, బోయినపల్లి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు అక్కెనపెల్లి కుమార్, బమ్మిడి శ్రీనివాసరెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాడెం శాంతకుమార్, అమృతసాగర్, వెల్లాల రామ్మోహన్ తదితరులు ఉన్నారు. -
లింగాకర్షక బుట్టల ఏర్పాటు
గజ్వేల్: వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సూచించారు. గురువారం గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో రైతు నరేందర్‌రెడ్డికి చెందిన వరి పొలంలో కాండం తొలుచు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ లింగాకర్షక బుట్టల్లో ఉన్న ఆడ రెక్కల పురుగులు మగ రెక్కల పురుగులను వాసనతో ఆకర్షించి బుట్టలో పడేలా చూస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల కాండం తొలుచు పురుగు ఉదృతి తగ్గుతుందని వెల్లడించారు. ఈ బుట్టలను రైతులు వరి పొలంలో ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ అధికారి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో గజరాజుల బీభత్సం
ఓబులవారిపల్లె: వైఎస్ఆర్ జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలోని వై. కోటలోకి మంగళవారం ఉదయం ప్రవేశించిన ఏనుగుల గుంపు పొలాలను ధ్వంసం చేశాయి. స్ధానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగులు గుంపు గ్రామంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
పంట పొలాలపై గజరాజుల బీభత్సం
కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కొన్ని గ్రామాల పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. మండలంలోని కంగోలి, రాముల గుట్టచేను ప్రాంతాల్లోని పంటపొలాలను నాశనం చేశాయి. గజరాజుల బీభత్సంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగులను తరిమేందుకు గ్రామస్థులు యత్నిస్తుండగా, అటవీశాఖ అధికారుల జాడ కనబడటం లేదు. ఈ ప్రాంతాల్లో ఏనుగుల దాడులు జరగడం సర్వసాధారణంగా మారింది. -
కుండపోత
లోతట్టు ప్రాంతాలు జలమయం పంటలకు మేలు బుధవారం కుండపోతగా కురిసిన వర్షానికి జిల్లా తడిసి ముద్దయింది. 28 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చినుకు కోసం ఎదురు చూస్తున్న రైతులను సైతం చిత్తడి చేసేలా కురిసింది. పగుళ్లు తీసిన పంట భూములకు కరువు తీరింది. అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేయగా..లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. -
ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా
చిత్తూరు(వి.కోట): చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో రైతులు ధర్నాకు దిగారు. ఆదివారం మండలంలోని ఏడుచోట్లకోట గ్రామంలో లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే తమ సాగు భూములు వదులుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకుని రైతులకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. -
ఇక వానలే వానలు
రాష్ట్రంలో ఈసారి వర్షాలు అధికంగా కురవనున్నాయి. నిర్ణీత వర్షపాతం కంటే 6 శాతం వరకు అధికంగా వర్షం కురుస్తుందని వాతావరణ అధ్యయనకారులు పేర్కొంటున్నారు. ప్రతిఏటా జూన్‌లో రాష్ట్రంలోకి వచ్చే రుతుపవనాలు ఈ సారి మాత్రం మేలోనే రానున్నాయట. మరి ఇక వర్షంలో తడిసిపోదామా..! బెంగళూరు: కర్ణాటకలోని రైతులకు శుభవార్త. రెండేళ్లుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రైతులు కరువు ఛాయల్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. సరైన వర్షాలు లేక సాగునీరు అందక అనేక ప్రాంతాల్లో పంట భూములు సైతం బీడు వారాయి. దీంతో పశుగ్రా సం కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఏడాది మాత్రం నైరుతి రుతుపవనాలు రైతుల జీవితా ల్లో సంతోషాలను వర్షించనున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు నివేదిక పేర్కొం టోంది. అంతేకాదు నైరుతి రుతుపవనాలకు సంబంధించి నిర్ణీత వర్షపాతం కంటే దాదాపు ఆరు శాతం వరకు ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో ఈ ఏడాది నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోకి జూన్ మొదటి వారంలోనే ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం నిర్ణీత సమయం కంటే ముందుగానే మే 27 నుంచి 29 లోపే రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా కురిసే వర్షాల్లో నిర్ణీత వర్షపాతం కంటే మూడు నుంచి ఆరు శాతం వరకు ఎక్కువగానే వర్షపాతం నమోదు కావచ్చని సైతం వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, తీర ప్రాంతాల్లో సైతం సరిపడా వర్షాలు కురవనున్నాయి. ఇక మే చివరి వారంలో ప్రారంభమైన నైరుతి రుతుపవనాల ప్రభావం జూలై నాటికి పూర్తిగా పుంజుకోనున్నాయి. అయితే రాష్ట్రంలోని బెళగావి, హావేరి, ధార్వాడ, గదగ్ ప్రాంతాల్లో మాత్రం నిర్ణీత వర్షపాతం కంటే కాస్తంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు వి.ఎస్.ప్రకాష్ చెబుతున్నారు. -
పంట భూముల నుండి రైతులను గెంటేయవద్దు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం పేరిట ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్నదంతా దాని సాకున నల్లధన కుబేరుల జూదగొండి ప్రయోజనాలను కాపాడటమేనని రచయితలమూ, ఆలోచనాపరుల మూ అయిన మేము బలంగా అభిప్రాయపడుతున్నాం. ప్రపంచాన్ని తలదన్నేంత మహోన్నత రాజధానిని నిర్మాణం చేయమని రాష్ట్ర ప్రజలు పాలకులను ఆదేశించలేదు. చంద్రబాబు తరహాలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధి, ప్రజానుకూల నమూనా కాదు. దాని వైఫల్యాలను చరిత్ర నమోదు చేసింది. రాజధాని కనీస అవసరాలైన పాలనా భవనాలు, గృహ సముదాయాల కోసం కొన్ని వందల ఎకరాల భూమి ఉంటే చాలు. 30 వేలు- లక్ష ఎకరాలు సమీ కరించటమన్నది దేశ విదేశీ ధనస్వాముల దోపిడీ ప్రయోజనాల కోసమే తప్ప సాధారణ ప్రజల లబ్ధి కోసం కాదని మా అభిప్రాయం. రాజధానికి అవసరమైన ప్రభుత్వ భూములు నిర్దేశిత ప్రాంతంలో ఉన్నాయి. అదనంగా రైతుల భూములను సమీకరించనక్కరలేదు. ముక్కారు పంటలు పండే పొలాలను కాంక్రీటు వనాలుగా మార్చనక్కరలేదు. తరతరాలుగా అక్కడ జీవిస్తున్న వేలాది కుటుంబా లను వలస జీవులుగా గెంటివేయనక్కరలేదు. మన దేశానికి ఆయువుపట్టు లాంటి గ్రామీణ జీవనంలో డబ్బుకు మించిన, అది కొనుగోలు చేయలేని సాంస్కృతిక ఔన్నత్యం ఒకటుంది. ఒక కుటుంబమంటే తల్లీ, తండ్రీ; భార్యా, భర్తా, పిల్లలు ఎలాగో గ్రామం అంటే ‘భూ మి, నారు, పశువు, పాడి, పంట, అనేక కుటుంబాల’ ఆత్మిక కలయిక. వారి జీవన విధ్వంస మంటే సాంస్కృతిక విధ్వంసం కూడానని మేము భావిస్తున్నాం. రాజధాని ప్రదేశం ఎంపికకు వాస్తు మౌఢ్యాన్ని అడ్డు పెట్టుకోవడాన్ని మేము అసహ్యిం చుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తికి కొరతను తెచ్చి, విదేశాల నుండి వాటిని దిగుమతి చేసుకోవా ల్సిన దుస్థితికి దేశాన్నీ, రాష్ట్రాన్నీ దిగజార్చే విధంగా, వేలాది ఎకరాల పంటభూముల్ని రాజధాని నిర్మా ణం కోసం సమీకరించే రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, చర్యలను మేము ఖండిస్తున్నాం. సాధారణ పరిపాలనా రాజధానిని ప్రభుత్వ భూముల్లో, పంటలు పండని భూముల్లో నిర్మించా లని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రజల వాస్తవిక సమస్యలైన ఆత్మహత్యలు, అధిక ధరలు, నిరుద్యోగం, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం, రైతాంగానికి గిట్టుబాటు ధరలు, శ్రామికులకు కనీస వేతన చట్టాలూ, మహి ళలూ, దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష, భాషా-సాంస్కృతిక వికాసం వంటి సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా పనిచేయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రచయితలుగా, ఆలోచనాపరులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. కె. రవిబాబు, దివికుమార్, సి.వి. చలసాని ప్రసాద్, నిర్మలానంద, శీలా వీర్రాజు, వరవరరావు, డా. ఎస్వీ సత్యనారాయణ, వరలక్ష్మి, వేల్పుల నారా యణ, వల్లూరి శివప్రసాద్, పెద్దిబొట్ల సుబ్బరామ య్య, అద్దేపల్లి రామమోహనరావు, అంపశయ్య నవీన్, కె.శివారెడ్డి, కడియాల రామమోహనరాయ్, సింగమనేని నారాయణ, బి. సూర్యసాగర్, పెను గొండ లక్ష్మీనారాయణ, కాత్యాయనీ విద్మహే, రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి, భూపాల్, పి.సత్యవతి, నలిమెల భాస్కర్, ముత్తేవి రవీంద్రనాథ్, దర్భ శయనం శ్రీనివాసాచార్య, పి.ఎస్. నాగరాజు, ఎన్ వేణుగోపాల్, నండూరి రాజగోపాల్, వి.వి.న. మూర్తి, కొల్లూరి, సింగంపల్లి, అశోక్‌కుమార్, బెం దాళం కృష్ణారావు, అల్లంశెట్టి చంద్రశేఖర్, ఖాదర్ మొహియుద్దీన్, చెరుకూరి సత్యనారాయణ ఇంకా కృష్ణా, గుంటూరు, హైదరాబాద్, శ్రీకాకుళం, విశా ఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, వరంగల్, ఖమ్మం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూ రు, కర్నూలు, కడప, అనంతపురం, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు, కర్నాటక రాష్ట్రానికి చెందిన 150 మంది రచయితలు. -
సర్వే పనులను అడ్డుకున్న రైతులు
నిర్మల్ (మామడ) : మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై ఎస్సారెస్పీ సదర్మాట్ బ్యారేజి నిర్మాణంలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు కొన్ని రోజులుగా అధికారులు సర్వే చేస్తున్నారు. బుధవారం పొన్కల్ రైతుల పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే నిర్వహించొద్దని స్పష్టం చేశారు. సర్వే పనులను అడ్డుకోవడంతో అధికారులు గ్రామానికి తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రామస్వామి, ఎస్పారెస్పీ డీఈ వెంకటేశ్వర్లు పొన్కల్ గ్రామానికి వచ్చారు. అప్పటికే కొందరు రైతులు, గ్రామస్తులు వాహనాల్లో వెళ్లి మామడ మండల కేంద్రంలోని నిర్మల్, ఖానాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బ్యారేజి నిర్మాణం కోసం చేపడుతున్న సర్వే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో తహశీల్దార్ రామస్వామి, డీఈ వేంకటేశ్వర్లు,ఏఎస్ఐ సిద్దేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సర్వేను నిలిపివేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. బాధిత రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
ల్యాండ్ పూలింగ్తో నష్టమే
తాడేపల్లి రూరల్ : నవ్యాంధ్రలో నిర్మించ తలపెట్టిన రాజధానిపై రగడ రాజుకుంటోంది. ప్రతి గ్రామంలో రైతులు సమావేశమవుతున్నారు. పంట భూములను వదులుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి ఉండవల్లిలో సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చేదిలేదంటున్నారు. ఇందు కోసం పార్టీలకతీతంగా పోరాడతామని హెచ్చరిస్తున్నారు. ఏడాది పాటు సమృద్ధిగా నీరుండి, మూడు పంటలు పండే పొలాల్లో భవన నిర్మాణాలేంటని ప్రశ్నిస్తున్నారు. బలవంతంగానైనా భూములు లాక్కుంటాం.. అంటున్న సీఎం చంద్రబాబు ప్రకటనలపై మండిపడుతున్నారు. భూములకు సంబంధించి మండలంలో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్న రైతులు ఆదివారం ఉండవల్లిలో సమావేశమయ్యారు. రైతులు, రైతు నేతలు పలువురు మాట్లాడారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని, భూములిస్తే వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్ విధానంతో రైతులకు నష్టమే తప్ప ఏ విధమైన లబ్ధి చేకూరదని, ఆహార కొరత ఏర్పడి భవిష్యత్తు తరాలు ఇబ్బందిపడతాయన్నారు. సమావేశంలో రైతు సంఘం నేత జొన్నా శివశంకర్, ఎల్ఐసీ రామిరెడ్డి, పెద్దిశెట్టి వీరాస్వామి, మానం బోసురెడ్డి, బాజి, అచ్చిరెడ్డి, బుర్రముక్కు పద్మారెడ్డి, ఈశ్వరరెడ్డి, బుల్లి కోటిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు. -
శిథిలమైన గొడారి ఆనకట్ట
నాసిరకం మరమ్మతులతో నీరు వృథా వరదలకు కొట్టుకుపోయిన ఆఫ్రాన్ గట్లు పనుల్లో అవినీతి కారణమని రైతుల ఆరోపణ అనకాపల్లి: వేలాది ఎకరాల భూములకు సాగు నీరందించాల్సిన గొడారి ఆనకట్టకు నాణ్యత లేని మరమ్మతులు చేపట్టడంతో రెండేళ్లు కాకుండానే పరిస్థితి మొదటికొచ్చింది. దిగువ భూములకు సాగునీరు అందడం లేదు. సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తున్న గొడారి ఆనకట్టపై నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎడారవుతున్న పంట భూములు శారద నది పరీవాహక ప్రాంతంలో భాగంగా పట్టణానికి దిగువన ఉమ్మలాడ, ఎన్జీఓ కాలనీ మధ్య గొడారి ఆనకట్ట ఉంది. ఈ ఆనకట్ట పరిధిలో 4,494 ఎకరాల ఆయకట్టు ఉండగా, 2150 మంది రైతుల భూములకు సాగు నీరందిస్తోంది. ఎడమవైపున్న కృష్ణంరాజు కాలువకు సాగునీటి సరఫరాకు గొడారి ఆనకట్టే కీలకం. ఇటీవల మరోవైపు పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ఎన్జీఓ కాలనీ వైపున్న గట్టును బలహీనపరుస్తూ, గండి పడేందుకు కారణమవుతోంది. దీంతో తరచూ ఎన్జీఓ కాలనీ పరిసరాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. 1999లో గొడారి ఆనకట్ట ప్రాధాన్యాన్ని గుర్తించి పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేశారు. 2002లో పునర్నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రారంభోత్సవం జరిగింది. మూడు నుంచి 4 ఆఫ్రాన్లు, ఎగువగోడ, దిగువగోడ, వరద గట్లు, రీచ్‌లతో గొడారి ఆనకట్టను నిర్మించారు. 2012, 2013 సంవత్సరాల్లో సంభవించిన భారీ తుపాన్లతో కుడివైపు గట్లకు గండ్లు పడ్డాయి. గొడారి ఆనకట్టను 13.48 కోట్ల నిధులతో పటిష్టపరిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం ఏర్పడింది. వైఎస్ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. నిధుల మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వేలాది మంది రైతుల ఆశలు అడియాశలయ్యాయి. మరమ్మతుల్లో అవినీతి గొడారి ఆనకట్ట పరిధిలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన అఫ్రాన్‌తో పాటు రీచ్‌ల తాత్కాలిక పనులు, కుడివైపు గట్ల పటిష్టానికి చేపట్టిన పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.32.82 లక్షలతో నిర్మించిన ఆఫ్రాన్, రీచ్‌లు స్వల్ప వ్యవధిలోనే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని ఆనకట్ట రాళ్లతో నాసిరకం పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. గొడారి ఆనకట్ట నుంచి భారీగా నీరు ప్రవహించినప్పుడు ఆనకట్టకు సమీపంలోని భూములపై ఇసుక మేటలు వేయడంతో అవి భారీ ఇసుక ర్యాంపులుగా మారాయి. ఆనకట్టకు ఎగువన నీరుండాల్సి ఉన్నా లీకుల వల్ల సాగునీరు వృథాగా పోతోంది. -
పేడే పెన్నిధి!
ఆల మందను చూసి ఆడపిల్లని ఇవ్వాలి అనేది పెద్దల మాట. పాడి ఉన్న చోట పంట ఉంటుందని, ఇవి ఉన్న ఇంటిలో ఆడపిల్ల హాయిగా బతుకుతుందని నాటి పెద్దల భరోసా. పాడికి పంటకు ఉన్న సంబంధం దండలో దారం లాంటిది.. ఒక్కమాటలో.. పంటకు పేడే పెన్నిధి! పంట భూములను సారవంతం చేయాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడటమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి మెరుగుపరచిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి. ఇంతకూ పేడలో ఏముంది? మనిషిని, అతని చుట్టూ ఉన్న ప్రకృతిని దేవుడు శాసిస్తుంటాడనేది కొందరి విశ్వాసం. జీవుల మనుగడ వెనుక కంటికి కనిపించకుండా అంతటా ఆవరించిన శక్తులు ఉన్నాయన్నది మాత్రం నిర్ధారిత నిజం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కోటాను కోట్ల సూక్ష్మజీవుల సముదాయమే శక్తి. ఆవు పేడ, మూత్రాలలో హితోపకారులైన ఈ సూక్ష్మజీవుల సముదాయాలు కోటాను కోట్లున్నాయి. ఒక గ్రాము పేడలో మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులున్నాయని అంచనా. ఇవి తమ జీవనక్రియ ద్వారా మనిషి మనుగడకే కాదు.. నేల మీద ఉనికిలో ఉన్న అన్ని రకాల జీవజాలం మనుగడకు అవసరమైన వనరులను అందిస్తున్నాయి. ప్రధానంగా పంటల విషయానికి వస్తే.. ఇవి నేల, గాలి, నీరులో ఉన్న అన్ని రకాల పోషకాలను సంగ్రహించి మొక్కలకు అందజేస్తున్నాయి. సూక్ష్మజీవులే పంటకు పోషణ, రక్షణ! పేడ ఎరువు ద్వారా పొలం మట్టిలోకి చేరిన ‘మేలు చేసే’ సూక్ష్మజీవులే మన పంటలకు పోషకాలను అందిస్తున్నాయి. కీడు చేసే ఇతర రకాల బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలను నియంత్రించే కాపాలాదారులుగా కూడా వ్యవహరిస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గు పెట్టుకునే సంప్రదాయం వెనుక దాగిన సత్యం ఇదే. ఇవి విరామమెరుగక చెమటను చిందించే రైతు కంటే ఎక్కువగా అనుక్షణం శ్రమిస్తుంటాయి. ఇవే కాకుండా మొక్కల మనుగడకు, ఎదుగుదలకు అవసరమైన స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఉన్నాయి. వీటికి తోడు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, రాగి, సల్ఫర్, మాంగనీస్, మల్బేడినమ్, వనాడియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు పంటలకు అత్యవసరమైన అమినో ఆమ్లాలు పేడలో ఉన్నాయి. తొలి వ్యవసాయ సమాజాలు ఏర్పడిన నాటి నుంచి కొనసాగిన అనుభవాలను క్రోడీకరించి పూర్వీకులు ప్రాచీన భారతీయ వ్యవసాయ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ‘కృషి పరాశర’, ‘వృక్షాయుర్వేద’, ‘కృషివల్లభ’, ‘కాష్యపీయ కృషి సూక్తి’, ‘లోకోపకార’ తదితర ప్రాచీన భారతీయ వ్యవసాయ విజ్ఞాన గ్రంథాలన్నిటిలోనూ పశువుల పేడ, పశువుల మూత్రంను వివిధ పద్ధతుల్లో వ్యవసాయానికి ఎలా వాడేదీ వివరించారు. పేడ, మూత్రంలను ఎరువులుగా, చీడపీడల నివారిణులుగా ఉపయోగించడం గురించి విశదపరిచారు. ఏభయ్యేళ్ల క్రితం వచ్చిపడిన పారిశ్రామిక వ్యవసాయ విధానంతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మజీవరాశికి నిలయమైన పేడ తదితర సేంద్రియ పదార్థాలకు ప్రాధాన్యం తగ్గి.. వివిధ రకాల రసాయనాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. ఫలితంగా వ్యవసాయం అభివృద్ధి మాటెలా ఉన్నా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. కాలం అకాలమై, రుతువులు గతి తప్పాయి. ఈ విషయాన్ని వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలు మొదలు సాధారణ వ్యవసాయ కూలీల వరకు అందరూ గుర్తించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం తిరిగి తన మూలాలను శోధించుకోవాల్సి వస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు ఉద్యమ స్థాయికి చేరుకున్నాయి. కృత్రిమ రసాయనిక ఎరువుల స్థానంలో.. పేడ, మూత్రంలతో తయారైన సహజ ఎరువులు, పంటల వ్యర్థాలతో తయారయ్యే కంపోస్టులే భూమికి బలిమిని, రైతుకు కలిమిని ఇస్తున్నాయి. ఎందరో రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి సాగు ఖర్చులు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు. - ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఆవు పేడతో ఉపయోగాలెన్నో! ఆవు పేడ ఉపయోగాలేమిటి? అని అడగటం అంటే.. సూర్యుడి ప్రయోజనం ఏమిటి? అని అడగటం వంటిదే! రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారమయ్యాయి. తిరిగి సారవంతం చేయడం ఆవు పేడ, మూత్రంతోనే సాధ్యం. వ్యవసాయానికి దిబ్బ ఎరువు, పంచగవ్య, బీజామృతం, జీవా మృతం, అమృత్‌పానీ తయారీలో ఆవు పేడ వాడకం తప్పనిసరి. పంచగవ్యను మనుషులకూ ఔషధంగా వాడుతున్నారు. కిలో పేడతో ‘నాడెప్’ పద్ధతిలో 20 కిలోల ఎరువును చేయొచ్చు. సేంద్రియ పురుగుమందులతోపాటు సౌందర్య సాధనాలు, కాగితం, దోమల కాయిల్స్, ధూప్ స్టిక్స్ తయారీలో ఉపయోగ పడుతోంది. గ్రామస్థాయిలో గోబర్ గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేసు కోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పేడ ప్రయోజనాలు ఇంకెన్నో.. మెట్ట ప్రాంతాల ఆవుల పేడ శ్రేష్టం సాధారణంగా పశువుల పేడలో నత్రజని 3%, ఫాస్ఫరస్ 2%, పొటాషియం 1% ఉంటాయి. అయితే, జంతువును బట్టి, జాతిని బట్టి, మేతను బట్టి పేడలో పోషకాల శాతం మారుతుంటుంది. మెట్ట ప్రాంతాల్లో గడ్డి మేసే ఆవుల పేడలో అన్ని రకాల (స్థూల, సూక్ష్మ) పోషకాలు, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. - డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు, అంతర్జాతీయ పశు పరిశోధనా సంస్థ, పటాన్చెరు, హైదరాబాద్ పాశ్చాత్యులకూ పేడంటే ప్రేమే! సూక్ష్మజీవులు, వానపాములు వ్యవసాయం లో అంతర్భాగమని తొలుత గుర్తించి, ప్రకటించిన మహానుభావుడు జీవపరిణామ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన స్ఫూర్తితో.. బాలలకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పుతున్న ఉపాధ్యాయులను అమెరికాకు చెందిన ఎఫ్‌ఎఫ్‌ఎ సంస్థ సన్మానిస్తోంది. ఎండిన ఆవు పేడ ముద్దకు బంగారు పూతపూసి బహుమతిగా ఇస్తోంది. 2013లో బెట్టీకూన్ అనే ఉపాధ్యాయినికి ఈ అవార్డు దక్కింది. ప్రాణ రక్షక ఔషధం పేడ! పేడ సజీవమైన ఎరువు. మట్టిలోని జీవులకు పేడ ప్రాణ రక్షక ఔషధం వంటింది. భూసారాన్ని పెంపొందించడంలో పేడ పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ, తండ్రులు, తాతల నాటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలో చాలా వరకు వదిలేశాం. కర్నాటక, మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఇప్పటికీ పట్టుదలగా సేంద్రియ సాగు కొనసాగిస్తున్నారు. పంచగవ్య, అమృత్‌పానీ, జీవామృతం, బీజామృతం వంటి వాటిల్లో పేడను విరివిగా వాడుతున్నారు. - డా. అంకిరెడ్డి ఓబిరెడ్డి (ankireddyobi@yahoo.co.in), విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు