ల్యాండ్ పూలింగ్‌తో నష్టమే
తాడేపల్లి రూరల్ : నవ్యాంధ్రలో నిర్మించ తలపెట్టిన రాజధానిపై రగడ రాజుకుంటోంది. ప్రతి గ్రామంలో రైతులు సమావేశమవుతున్నారు. పంట భూములను వదులుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి ఉండవల్లిలో సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇచ్చేదిలేదంటున్నారు. ఇందు కోసం పార్టీలకతీతంగా పోరాడతామని హెచ్చరిస్తున్నారు. ఏడాది పాటు సమృద్ధిగా నీరుండి, మూడు పంటలు పండే పొలాల్లో భవన నిర్మాణాలేంటని ప్రశ్నిస్తున్నారు.
బలవంతంగానైనా భూములు లాక్కుంటాం.. అంటున్న సీఎం చంద్రబాబు ప్రకటనలపై మండిపడుతున్నారు. భూములకు సంబంధించి మండలంలో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్న రైతులు ఆదివారం ఉండవల్లిలో సమావేశమయ్యారు. రైతులు, రైతు నేతలు పలువురు మాట్లాడారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారని, భూములిస్తే వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాండ్ పూలింగ్ విధానంతో రైతులకు నష్టమే తప్ప ఏ విధమైన లబ్ధి చేకూరదని, ఆహార కొరత ఏర్పడి భవిష్యత్తు తరాలు ఇబ్బందిపడతాయన్నారు. సమావేశంలో రైతు సంఘం నేత జొన్నా శివశంకర్, ఎల్‌ఐసీ రామిరెడ్డి, పెద్దిశెట్టి వీరాస్వామి, మానం బోసురెడ్డి, బాజి, అచ్చిరెడ్డి, బుర్రముక్కు పద్మారెడ్డి, ఈశ్వరరెడ్డి, బుల్లి కోటిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.