ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్తంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోవాలసిందే!
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 –620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. .
మొదటి అంతస్తు: కింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గం, విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.
రెండవ అంతస్తు: రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతిగా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.
మూడవ అంతస్తులోకి మెట్లమార్గం...
చారిత్రక నేపథ్యం – ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయం. సాధారణం గా బౌద్ధ, జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ అనంత పద్మనాభుని గుహాలయాన్ని నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది.
ఇక్కడ నుంచి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించే వారని నానుడి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం.
మహా గణపతి...
లంబోదరుని సహస్ర రూ΄ాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పంలో దర్శింపజేయడం అనన్య సామాన్యం.
ఉగ్రనరసింహుడు: ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితోపాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి.
శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి...
స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు. ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు...
నాగబంథం: మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.
నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు?
రవాణాసౌకర్యాలు...
విజయవాడకు దేశంలోని అన్ని ్ర΄ాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు.
రోడ్డు మార్గం... ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలను సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.
అదేవిధంగా గుంటూరులో రైల్వే జంక్షన్, విజయవాడలో రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుంచి ఆలయానికి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ఉండవల్లి గుహకు వెళ్లడానికి సదుపాయాలు ఉన్నాయి.
(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం)
Comments
Please login to add a commentAdd a comment