సాగు భూములకు ఎసరు
► చలానా కడితే చాలు.. భూ వినియోగ మార్పిడి
► ఆర్డీవో అనుమతితో పనిలేదు.. ఇక వ్యవసాయ భూమి
► పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు విచ్చలవిడిగా కేటాయింపు
► భూ వినియోగ మార్పిడి నాలా ఫీజు భారీగా తగ్గింపు
► 9 శాతం నుంచి మూడు శాతానికి కుదింపు..
► రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేబినేట్‌లో ఆమోదం.. త్వరలో ఆర్డినెన్స్
► ఈ నిర్ణయంతో మరింతగా తగ్గిపోనున్న వ్యవసాయ భూమి
సాక్షి, అమరావతి
రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి వేలాది ఎకరాల సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూములను లాగేసుకుంది. మరోవైపు పారిశ్రామికవేత్తలకు లక్షలాది ఎకరాలను అప్పనంగా అప్పగిస్తోంది. ఇప్పుడీ విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యవసాయ భూములను మరింత విచ్చలవిడిగా పారిశ్రామికవేత్తలకు, తనకు అనుకూలమైన వారికి అప్పగించేందుకు వీలుగా నిబంధనల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఆంక్షలు, సంబంధిత అధికారుల తనిఖీల్లేకుండానే సాగు భూముల్ని వ్యవసాయేతర పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలు కల్పించింది.
ప్రస్తుతమున్న చట్టం ప్రకారం సాగు భూమిని వ్యవసాయేతర అవసరాలకు.. అంటే పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు వినియోగించాలంటే సంబంధిత ఆర్డీవో నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. దీనికి చెల్లుచీటీ ఇస్తూ సవరణలు చేసింది. ఆ ప్రకారం.. ఆర్డీవో అనుమతితో నిమిత్తం లేకుండానే చలానా రూపంలో నాలా(నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్) ఫీజు చెల్లిస్తే సరిపోతుందని, ఆ చలానానే భూవినియోగ మార్పిడికి అనుమతినిచ్చినట్టుగా పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. అంటే భూవినియోగ మార్పిడి కావాల్సిన వ్యక్తి వినియోగ మార్పిడి నాలా ఫీజును చలానా రూపంలో చెల్లిస్తే చాలు.. భూవినియోగ మార్పిడి జరిగిపోయినట్టే. అంతేకాదు.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర వినియోగానికి మార్చేందుకు చెల్లించాల్సిన నాలా ఫీజును సైతం భారీగా తగ్గించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి(కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) చట్టం 3 ఆఫ్ 2006లో చేసిన సవరణలకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సవరణలకు అనుగుణంగా త్వరలో ఆర్డినెన్స్ జారీ కానుంది.
పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో సులభంగా వ్యాపారం(ఈజీ బిజినెస్) చేసుకోడానికే ఈ నిర్ణయమని సాకు చెబుతోంది. రాజధాని పేరుతో ఇప్పటికే సాగు యోగ్యమైన వేల ఎకరాల భూమిని ఎడాపెడా పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండడంతో వ్యవసాయ భూమి రానురాను తగ్గిపోతున్నది. దీనిపై ఒకవైపు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దీనివల్ల విచ్చలవిడిగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేందుకు ఆస్కారమేర్పడుతుంది. రైతులకు తీరనినష్టం వాటిల్లనుంది. అంతేగాక భవిష్యత్తులో వ్యవసాయ భూమి మరింతగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతమున్న విధానమిది..
ప్రస్తుతమున్న చట్టప్రకారం సాగు భూమిని ఇతర అవసరాలు.. అంటే పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు వినియోగించాలంటే సంబంధిత ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డీవో ఆ భూమిని స్వయంగా పరిశీలిస్తారు. సాగుభూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించవచ్చా? లేదా? అని పరిశీలించాక గ్రీనరీ ఎంతప్రాంతంలో ఉండాలనే నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, నాలా ఫీజు చెల్లించాక భూవినియోగ మార్పిడికి అనుమతి ఇస్తారు.
ఇకపై ఆర్డీవోకు దరఖాస్తు చేయనక్కర్లేదు..
అయితే తాజా సవరణలతో సాగుభూమిని పరిశ్రమలు, రియల్ ఎస్టేట్‌కు వినియోగించుకోవాలంటే ఇకపై ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. అలాగే ఆర్డీవో అనుమతి అవసరం లేదు. భూ వినియోగ మార్పిడి కావాల్సిన వ్యక్తి వినియోగ మార్పిడి నాలా ఫీజును చలానారూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఆ చలానానే వినియోగ మార్పిడికి అనుమతిచ్చినట్టుగా పరిగణిస్తూ సవరణ చేశారు. అంతేగాక భూవినియోగ మార్పిడికి చెల్లించాల్సిన నాలా ఫీజును భారీగా తగ్గించారు. విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మినహాయించి మిగతా రాష్ట్రమంతటా భూవినియోగ మార్పిడి నాలా ఫీజు 9 శాతంగా ఉండగా దాన్ని మూడు శాతానికి తగ్గించింది. (అంటే భూమి విలువలో గతంలో 9 శాతం నాలా ఫీజు చెల్లిస్తుండగా ఇప్పుడు కేవలం మూడు శాతం చెల్లిస్తే చాలు). విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూవినియోగ మార్పిడి నాలా ఫీజును 5 శాతం నుంచి రెండు శాతానికి తగ్గించారు. ఈ ఫీజును తగ్గించడం వల్ల పరిశ్రమల ఏర్పాటును, గృహాల ప్రాజెక్టులు చేపట్టడాన్ని ప్రోత్సహించినట్లవుతుందని ప్రభుత్వం చెప్పడం గమనార్హం.
నాలా ఫీజు పూర్తిగా రద్దుకు తొలుత నిర్ణయం..
నిజానికి నాలా ఫీజును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలు తొలుత నిర్ణయించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఒకానొక పరిశ్రమకు కేటాయించిన భూముల్ని వ్యవసాయ వినియోగం నుంచి పారిశ్రామిక వినియోగానికి మార్చేందుకు చెల్లించాల్సిన నాలా ఫీజు నుంచి మినహాయింపు సైతం ఇచ్చారు. అయితే ఒక పరిశ్రమకోసం మినహాయింపు కల్పిస్తే.. మిగతావారూ ఇదే విధానం అమలు చేయాలని అడుగుతారని రెవెన్యూశాఖ అభ్యంతరం చెప్పింది. అయినప్పటికీ ‘ముఖ్య’ నేత ఒత్తిడితో సదరు పరిశ్రమకు నాలా ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇచ్చారు. ఇదే క్రమంలో నాలా ఫీజును రద్దు చేయాలని ‘ముఖ్య’ నేత ఆ తర్వాత భావించడంతో తప్పనిసరై రెవెన్యూశాఖ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించింది. దీనిపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో నాలా ఫీజు రద్దు నుంచి ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గారు. ఫీజు తగ్గింపుతో సరిపుచ్చారు.