రియల్ డల్
రాజధాని ప్రాంతంలో భూముల ధరలు తగ్గుముఖం
శంకుస్థాపన తర్వాత తిరోగమనంలో రియల్‌ఎస్టేట్
ప్రత్యేకహోదా, ప్యాకేజీపై కేంద్రం మౌనమే ప్రధాన కారణం
సీఎం చంద్రబాబు రాజీ ధోరణి సైతం తోడ్పాటు
గుంటూరు అమరావతి శంకుస్థాపన తర్వాత రాజధాని పరిసర గ్రామాల్లో భూముల ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఊహించని విధంగా నేలకు దిగుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజి గురించి ఏదైనా ప్రకటన చేస్తారని ముందు నుంచీ ఇక్కడ భారీగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని రియల్టర్లు తమ వ్యాపార ప్రయోజనానికి వాడుకుని భూముల ధరలను భారీగా పెంచేశారు. తీరా శంకుస్థాపన రోజున ప్రధాని తన ప్రసంగంలో అసలు హోదా, ప్యాకేజీ గురించి కనీస ప్రస్తావన తేలేదు. దీంతో రాజధాని అభివృద్ధిపై సంశయంతో ఒక్కసారిగా ఇప్పుడు కొనుగోళ్లు మందగించాయి. కళకళలాడే రియల్ ఎస్టేట్ సైతం నీరసించింది. తాడికొండ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల పరిధిలోని భూములు, నివాస స్థలాల ధరలు క్రమేపి దిగివస్తున్నాయి.
ఆరంభంలోనే ఢమాల్...
రాజధాని ప్రాంతంగా అమరావతిని ప్రకటించిన వెంటనే ఇక్కడున్న భూములకు కనీవినీ ఎరుగని డిమాండ్ పెరిగిపోయింది. రూ. అరకోటి కూడా పలకని మారుమూల గ్రామాల్లో సైతం ఎకరం రూ.కోటి దాటిపోయింది. అంతేకాదు ఒక్కసారిగా ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్‌ఎస్టేట్ కంపెనీలు ఎకరాలకు ఎకరాల భూములను పోటాపోటీగా కొనేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అప్రమత్తమైన ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో పాటు లే అవుట్ల అనుమతుల నిబంధనల్లోను మార్పుచేసింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత ఏర్పడింది. అయినా మున్ముందు ధరలు ఇంకా పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారులు భూముల కొనుగోలుకు రిజిస్ట్రేషన్లు సైతం లేకుండానే ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
గతనెలలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం భారీ ప్రచారం కల్పించింది. రూ. కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసింది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారని, అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని విసృ్తతంగా ప్రభుత్వంలో ప్రచారం జరిగింది. దీన్ని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని రాజధానికి భారీగా పెట్టుబడులు వస్తాయనే ప్రచారంతో భూముల ధరలు పెంచేశారు. తీరా శంకుస్థాపన రోజు ప్రధాని హోదా,ప్యాకేజీపై నోరు మెదపకుండా అందరి ఆశలను అడియాశలు చేశారు.
దీనికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతోనూ ప్రజల్లో సందేహాలు లేవెనేత్తలా చేశాయి. వీటి ప్రభావం ఇప్పుడు రాజధాని భూముల ధరలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. శంకుస్థాపన తర్వాత రోజునుంచి వ్యవసాయ భూముల ధరలు తగ్గేలా చేసింది. ప్రధానంగా తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, కురగల్లు, నిడమర్రు, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోని వ్య వసాయ భూముల ధరలు తగ్గుముఖం పట్టాయి. శంకుస్థాపన ముందురోజు వరకు ఎకరా రూ.1.40 కోట్లు పలికిన ఈ భూములు ఇప్పుడు రూ.1.20 కోట్లకు తగ్గాయి. నివాసస్థలాల ధరల్లో మార్పు రాలేదు. మండల కేంద్రం తుళ్లూరులో చదరపు గజం రూ.25 నుంచి రూ.30 వేలు పలుకుతూ నిలకడగా ఉంది. రాజధాని ప్రకటనకు పూర్వం ఇక్కడ చదరపు గజం రూ.3 వేల లోపే. గుంటూరు సిటీ, పరిసర ప్రాంతాల్లో అయితే ప్రధాని ప్రకటన ప్రభావం పెద్దగా చూపలేదు. నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో చదరపు గజం రూ. లక్ష కొనసాగుతూనే ఉంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని నివాస స్థలాల ధరల్లో కూడా పెద్దగా మార్పులేదు. ప్రత్యేకంగా పెదకాకాని మండలంలో భూముల ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. జాతీయ రహదారికి, రాజధానికి సమీపంలోనే ఈ ప్రాంతం ఉన్నప్పటికీ ధరలు తగ్గుముఖం పట్టటం అక్కడి భూ యజమానులు, రియల్ వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
గ్రామ కంఠం నివాస స్థలాలకు డిమాండ్...
రాజధాని పరిధిలోని 29 గ్రామ కంఠాల్లో గల నివాస స్థలాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గ్రామ కంఠం పరిధిలోని స్థలాల్లో వెంటనే నిర్మాణాలు చేసుకునే అవకాశం ఉండటంతోపాటు రిజిస్ట్రేషన్ సమస్యలు లేవు. దీంతో దాదాపు అన్ని గ్రామ కంఠాల్లో సెంటు స్థలం రూ. 5 లక్షల వరకు పలుకుతోంది. ఉండవల్లి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లోని కంఠం స్థలాల సెంటు రూ.12 లక్షల నుంచి 16 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గ్రామకంఠంలో ఉన్న ఇళ్ల స్థలాలకు, ల్యాండ్‌పూలింగ్‌లో ఉన్న భూములు అమ్మకాలు సాగుతుండగా మిగిలిన పొలాలు, స్థలాలు అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.