Land prices
-
భూమి విలువ పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయండి ‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలి. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి. తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు ఆదాయం ఎందుకు పెరగలేదు? గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్‌రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
అధిక వ్యయాలతో రియల్టీ ప్రాజెక్టులు అసాధ్యం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ అన్నారు. భూమి ధరలు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం, నిధుల వ్యయాలు పెరిగిపోవడానికి అదనంగా ఆర్థిక అనిశ్చితులను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులు నుంచి అభివృద్ది వరకు అన్ని సులభతరంగా సాగేందుకు భాగస్వాములను జవాబుదారీ చేయాలన్న అభిప్రాయాన్ని దత్ వినిపించారు. ‘‘రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. మొదట భూమిని సమీకరించుకోవాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై, బెంగళూరు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రాజెక్టు వ్యయాల్లో భూమి వాటా 50 శాతం నుంచి 80–85 శాతం వరకు ఉంటోంది. ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, నిర్మాణ ప్రారంభానికి 2–3 ఏళ్లు పడుతోంది. నిధుల వ్యయాలు ప్రముఖ సంస్థలకు 8.5 శాతంగా ఉంటే, పెద్దగా పేరులేని సంస్థలకు 18 శాతం వరకు ఉంటున్నాయి’’అని సంజయ్ దత్ వివరించారు. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రస్తుత వ్యయాల ఆధారంగా ధరలను ప్రకటించినప్పటికీ.. ప్రాజెక్టు పూర్తయ్యే 5–6 ఏళ్లలో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు. -
మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది, ఎగబడుతున్న జనం!
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్ స్థల కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌హెచ్–44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటూ పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు. సాక్షి, హైదరాబాద్: ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్‌గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు మళ్లుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు. కనెక్టివిటీ బాగుంది.. హైదరాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్‌వ్యాలీ, నల్సార్‌తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు. కండ్లకోయలో సైబర్ టవర్స్‌ను మించి.. పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: అదిరే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ -
రాత్రికిరాత్రే..ఈ ఏరియాలో నెల కిందట ఎకరా రూ. 2 కోట్లు.. ఇప్పుడు రూ. 5 కోట్ల పైనే
జీవో 111 ఎత్తివేత స్థిరాస్తి వ్యాపారంపై మిశ్రమ ప్రభావం చూపిస్తోంది. ఓవైపు 111 పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఊపందుకొని మరింతగా ధరలు పెరగొచ్చని రైతులు, భూ యజమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పశ్చిమ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి ఇంకోలా ఉంది. కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ఈ ఏరియాల్లో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ధరలు తగ్గొచ్చని అనుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో ఓ రైతు తన నాలుగెకరాల పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. 2 నెలల క్రితం ఎకరాకు రూ.2 కోట్లు వచ్చినా అమ్మాలని భావించాడు. అంతలోనే జీవో 111 ఎత్తివేతపై అసెంబ్లీలో ప్రకటన చేయడం.. తర్వాత ఉత్తర్వులు రావడంతో భూమి ధరను అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఎకరాకు రూ.5 కోట్లకు బేరం పెట్టాడు... ఇది ఈ ఒక్క గ్రామంలోనే కాదు. 111 జీవో పరిధిలోని 84 పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. నిన్నమొన్నటి వరకు జీవో 111ను సవరిస్తారో లేదోనని సందిగ్ధంలో ఉన్న భూ యజమానులు, రైతులు.. తాజాగా ప్రభుత్వం జీవోను రద్దు చేయడంతో ధరలు ఒక్కసారిగా పెంచేశారు. 111 జీవో పరిధిలో లేని ప్రాంతాలతో సమాంతరంగా ఇక్కడ రేట్లు పెరిగాయి. విధివిధానాలపైనే అందరి దృష్టి ఆ 84 గ్రామాల పరిధిలోని మాస్టర్‌ప్లాన్‌పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే గానీ గ్రీన్ జోన్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రిక్రియేషన్ జోన్లపై సందిగ్ధత తొలగనుంది. మాస్టర్‌ప్లాన్ అభివృద్ధిపై తొలిసారి భేటీ అయిన కమిటీ.. నెల రోజుల్లో దీనికి తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. ప్లాన్ కొలిక్కి వస్తే భూ విలువలపై స్పష్టత వస్తుందని, అప్పటివరకు ఆగాలని రియల్టర్లు, కొనుగోలుదారులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే మారిన సీను! ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. తద్వారా జీవో పరిధిలోని 84 గ్రామాల్లో నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులపై ఆంక్షలు పెట్టింది. అయితే జీవో 111 జీవో ఎత్తివేతకు సంబంధించి గత నెల 15న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడమే తరువాయి ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల క్రితం జీవో 111ను ఎత్తేస్తూ కొత్తగా జీవో 69ను ఇవ్వడంతో ధరలు చుక్కలను తాకాయి. నిన్న మొన్నటివరకు ఎకరా రూ.1 కోటి నుంచి రూ. 2 కోట్లు పలికిన భూములు తాజాగా రూ.3 కోట్ల నుంచి 5 కోట్లకు చేరాయి. ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండటంతో రియల్టీ సంస్థలు కూడా భూ నిధి సేకరణలో తలమునకలయ్యాయి. రైతులు మాత్రం భూ విక్రయాలపై ఆచితూచి అడుగులేస్తున్నారు. అమ్మకాలపై తొందరపడకుండా కొన్నాళ్లు వేచిచూడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. -
జాతీయ రహదారులతో భూముల ధరల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీ ల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మానిటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ అమెనిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లను నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్షించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. -
‘రియల్’ డబుల్!
గ్రేటర్ శివార్లలో రియల్ రంగం రయ్యిమని దూసుకుపోతోంది. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో నివాస భూముల ధర రెండేళ్లలోనే రెట్టింపు అయింది. నూతన ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల కార్యకలాపాలు పెరగడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొనడం, అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరగడం, ప్రధాన రహదారుల విస్తరణ, హరిత వాతావరణం, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు భారీగా వెలియడంతో ఆయా ప్రాంతాల్లో భూములకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కుష్మన్ వేక్ఫీల్డ్ అనే సంస్థ తాజాగా ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలపై చేసిన అధ్యయనం నిర్వహించి ఇందుకుగల కారణాలను విశ్లేషించింది. – సాక్షి, హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో భూములు బంగారం... గతంలో అభివృద్ధి ప్రధాన నగరంలోనే కేంద్రీకృతం కావడంతో భూముల ధరలు ఆయా ప్రాంతాల్లోనే అధికంగా ఉండేవి. ఇప్పుడు అభివృద్ధి గ్రేటర్ నలుచెరగులా విస్తరించడం, ఆయా ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు నెలకొనడంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణరంగ కార్యకలాపాలు గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరిగాయి. ప్రధానంగా పటాన్చెరు, నానక్‌రామ్‌గూడ, తెల్లాపూర్, మియాపూర్, అమీన్పూర్, కొల్లూర్, రాయదుర్గం, బాచుపల్లి, కూకట్పల్లి, పుప్పాల్‌గూడ, కొంపల్లి, మేడ్చల్, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో భూములకు డిమాండ్ భారీగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో నివాస భూముల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక మంగల్‌పల్లి, బాటసింగారం ప్రాంతాలతోపాటు శంషాబాద్, పెద్ద అంబర్పేట్, మనోహరాబాద్, మియాపూర్‌లో ప్రభుత్వం లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. - గ్రేటర్ మధ్యభాగం: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. సంపన్నుల నివాసాలకు చిరునామాగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు చదరపు గజం భూమి సైతం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పైగానే పలుకుతోంది. ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ నిర్మాణరంగ కంపెనీలు విలాసవంతమైన ఫ్లాట్లు, భవనాలు, ఆఫీస్ స్పేస్ ఉండే వాణిజ్య భవంతులు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు భారీగా నిర్మిస్తుండటంతో భూమి బంగారాన్ని తలపిస్తోంది. ఏ దిక్కు చూసినా కోట్లే.. కుష్మన్ వేక్ఫీల్డ్ తమ అధ్యయనంలో గ్రేటర్ సిటీని నాలుగు భాగాలుగా విభజించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూముల ధరలను సుమారుగా లెక్కగట్టింది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు బంగారం కావడానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే.. - గ్రేటర్ పడమర ప్రాంతం: రాయదుర్గం, పుప్పాల్‌గూడ, కొల్లూర్, కోకాపేట్, నానక్‌రామ్‌గూడ, తెల్లాపూర్, గోపన్‌పల్లి, కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాలున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఐటీ, బీపీఓ, కెపిఓ, బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రధాన కార్యాలయాలు వేలాదిగా వెలిశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిసరాలకు క్యూ కడుతుండడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా ఔటర్‌కు సమీపంలో ఉండటంతో ప్రధాన నగరంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ బాగా పెరిగింది. మరోవైపు వ్యాపార, వాణిజ్య అవకాశాలు విస్తృతమయ్యాయి. సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలు హబ్‌గా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తున్న వారితోపాటు విదేశీయులు సైతం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్, నివాస సముదాయాలకు గిరాకీ బాగా పెరగి బహుళ అంతస్తుల భవంతులు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు భారీగా వెలుస్తున్నాయి. - గ్రేటర్ తూర్పు ప్రాంతం: ఉప్పల్, పోచారం ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉప్పల్‌లో మెట్రో డిపో ఏర్పాటు, కనెక్టివిటీ పెరగడం, హెచ్ఎండీఏ మెట్రో సిటీ లే అవుట్, శిల్పారామం ఏర్పాటు కావడంతోపాటు వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని ఈ ప్రాంతం అక్కున చేర్చుకుంటోంది. ప్రస్తుతం కోర్ సిటీకి దీటుగా పురోగమిస్తోంది. ఇక పోచారంలో ఇన్ఫోసిస్ సంస్థతోపాటు ఇతర ఐటీ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా వెలుస్తుండడంతో టెకీలు ఈ ప్రాంతంలో ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. - గ్రేటర్ ఉత్తర ప్రాంతం: మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు ద్రాక్ష తోటలతో కనిపించిన ఈ ప్రాంతాలు ఇప్పడు ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నివాస సముదాయాలు, ఫ్లాట్లు, ప్లాట్లతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వాణిజ్య స్థలాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. -
తుర్కపల్లి : అక్రమవెంచర్లకు అడ్డేదీ ?
సాక్షి, తుర్కపల్లి : రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగి పోవడంతో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేసుకొని వాటిలో ప్లాట్లు చేసి వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు.అధికార యంత్రాంగానికి ఈ తంతు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది.హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుర్కపల్లి మండలంలో అక్రమ వెంచర్ల హవా కొనసాగుతున్నా అధికారులకు పట్టకపోవడం శోచనీయం. తక్కువ ధరలకు భూముల కొనుగోలు.. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకొని, ఆ భూమిలోనే 200 గజాలు, 100 గజాలు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా రు. మండల కేంద్రం హైదరాబాద్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉం డటం, యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం కావడంతో రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వ్యవసాయభూములు ఎకరానికి కోటి నుంచి కోటి 50 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల దగ్గర నుంచి ఎకరాల చొప్పున కొనుగోలు చేసుకొని ఎ టువంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అనుమతులు కరువు .. తుర్కపల్లి, మాదాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వెంకటాపూర్, పల్లెపహాడ్, ముల్కలపల్లి, రుస్తాపూర్ గ్రామాల్లో ఈ రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరుకాయలుగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను విక్రయించి వాటిని ప్లాట్లుగా మార్చేటప్పుడు డీటీసీపీ అనుమతులు పొందాలి. కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్‌శాఖ, అటవీశాఖ, గ్రామపంచాయతీ అనుమతులు, నీటి పారుదల శాఖ ముందస్తు అనుమతులు పొందాలి. అధికారులు వెంచర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. అక్రమ వెంచర్లపై చర్య తీసుకుంటాం.. మండలంలో నిర్వహిస్తున్న అక్రమ వెంచర్లపైన చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన వాటికి హద్దురాళ్లు తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన చర్యలు తీసుకున్నాం. గ్రామ కార్యదర్శులకు ఈ విషయంలో అవగాహన కలిగించి సత్వర చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌళి, ఈఓపీఆర్డీ -
ప్రాజెక్టుల కింద ‘భూ’సేకరణ సులభతరం!
- పెద్ద నోట్ల రద్దుతో దిగిరానున్న రియల్ భూముల ధరలు - భూసేకరణ, పెద్ద నోట్ల ప్రభావంపై నీటిపారుదల శాఖ సమీక్ష - నిర్వాసితులకు ప్రత్యామ్నాయ భూలభ్యత పెరుగుతుందని అంచనా సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తమకు మేలు చేయబోతోందని నీటి పారుదల శాఖ ఆశిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో రియల్ భూముల ధరలు దిగివస్తాయని, భూ లభ్యత పెరుగుతుందని, నిర్వాసితులు తిరిగి భూకొనుగోళ్లు చేసేందుకు ఉపకరిస్తాయని లెక్కలేస్తోంది. అదే జరిగితే సాగునీటి ప్రాజెక్టుల కింద మొత్తం భూసేకరణ సులభతరం అవుతుందనే నమ్మకంతో ఉంది. ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న సానుకూలత తదితర అంశాలపై తాజాగా నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నత స్థారుు సమీక్ష నిర్వహించారు. కలిసొస్తున్న నోట్ల రద్దు.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద మొత్తం గా 3.20లక్షల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఇందులో 2.12లక్షల ఎకరాల సేకరణ పూర్తరుుంది. మరో 1.08లక్షల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ప్రభుత్వం జీవో 123 కింద భూములు సేకరిస్తోంది. భూ రకాన్నిబట్టి ఎకరా రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు చెల్లిస్తోంది. చాలా చోట్ల నిర్వాసితులకు కొత్తగా భూములు కొందామంటే మాత్రం ధరలు అందుబాటులో లేవు. గ్రామీణప్రాంతాల్లోని భూముల రిజిస్టర్ విలువ తక్కువగా ఉండటంతో నల్లధనం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూములపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులకు కొత్తగా భూమి కొనుగోలు చేద్దామంటే ధరలు భారీగా ఉండేవి. ప్రత్యామ్నాయ భూమి దొరకకపోవడంతో ప్రాజెక్టులకు భూములు ఇచ్చేందుకు చాలా చోట్ల నిర్వాసితులు ముందుకు రావడం లేదు. దీంతో ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పెద్దనోట్ల రద్దుతో ఈ లావాదేవీలు చాలావరకు స్తంభిం చారుు. నల్ల ధనానికి కళ్లెం పడటంతో అమ్మేవాళ్లు ఉన్నా కొనేవాళ్లు కరువు కానున్నారు. ఈ పరిస్థితుల్లో భూ లభ్యత పెరగడంతోపాటు ధరలు తగ్గుముఖం పట్టనున్నారుు. ఇదే సమయంలో వైట్‌మనీ ఉన్నవాళ్లకు డిమాండ్ పెరగనుంది. ఇది ప్రభుత్వం నుంచి అధికారికంగా పరిహారం పొందుతున్న నిర్వాసితులకు వరంగా మారుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. భవన నిర్మాణరంగంలో సైతం ధరలు దిగివచ్చే నేపథ్యంలో..నిర్వాసితులకు చెల్లిస్తున్న పరిహార డబ్బుతో వారికి అనుకూలమైన గృహాల కొనుగోలుకు అవకాశం ఉంటుందని, ప్రస్తుత పరిణామాలతో భూసేకరణ వేగిరం అవుతుందని భావిస్తోంది. -
భగ్గుమంటున్న భూముల ధరలు
► గజం ధర రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు ►భూపాలపల్లి నుంచి గణపురం వరకు వెంచర్లు ►నెల రోజుల్లోనే మూడింతలు పెరిగిన ధరలు ►జిల్లా ఏర్పాటు చర్చతో రియల్ బూమ్ భూపాలపల్లి: భూపాలపల్లిలో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో నెల రోజుల వ్యవధిలోనే భూముల ధర లు మూడింతలు పెరిగాయి. ఎక్కడ చూసినా వెంచర్లు దర్శనమిస్తున్నా యి. పట్టణ శివారు నుంచి మొదలుకొని గణపురం క్రాస్‌రోడ్ వరకు రియల్ వ్యాపారులు తిష్టవేసి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నా రు. జిల్లాల పునర్విభజనపై గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు జరుపుతుంది. ఈ క్రమంలో భూపాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసి.. ఇందులో విలీనం చేయబోయే నియోజకవర్గాలపై చర్చ జరుగుతో ంది. జిల్లాగా ఏర్పడితే భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉం దని భావించిన కొందరు రియల్, వ్యాపారులు, భూస్వాములు గత కొద్ది రోజులుగా భూముల క్రయ విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. మూడింతలు పెరిగిన గజం ధర.. భూపాలపల్లి నుంచి గణపురం వరకు గజం ధర నెల రోజుల వ్యవధిలోనే మూడింతలయింది. కొద్ది రోజుల క్రితం వరకు భూపాలపల్లి పట్టణంలోని పోలీస్‌స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం, బస్ డిపో సమీపాల్లో గజం ధర రూ. 3 వేల వరకు ఉండేది. కాగా ప్రస్తుతం ఆయా స్థలాల్లో గజం ధర రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు పలుకుతోంది. పట్టణ సరిహద్దు నుంచి చెల్పూరు వరకు గతంలో గజం ధర రూ. 3 వేలు మాత్రమే ఉండగా ప్రస్తుతం సుమారు రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకు ఉంది. ఇదిలా ఉండగా పట్టణం నుంచి చెల్పూరు వరకు భూముల ధరలు పెరిగిన విషయాన్ని గమనించిన కొందరు వ్యాపారులు, రైతులు గణపురం క్రాస్‌రోడ్ వద్ద వ్యవసాయ భూములను ప్లాట్లుగా ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. అక్కడ ప్రస్తుతం గజం ధర రూ. 3 వేల వరకు పలుకుతోంది. భూపాలపల్లి, గణపురం మండల కేంద్రాల మధ్య గత ఏడాది క్రితం వరకు వ్యవసాయ భూములు దర్శనమిచ్చేవి. కాగా ప్రస్తుతం ప్లాట్లు, భవనాలు కనిపిస్తున్నాయి. మరో ఏడాది వరకు రెండు మండలాల మధ్య ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు కనిపించే అవకాశాలు కానరావడం లేదు. ఏది ఏమైనప్పటికీ బొగ్గు, విద్యుత్ రంగ పరిశ్రమలతో భూపాలపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండటమే కాక జిల్లాగా ఏర్పడనున్నట్లు వార్తలు వస్తుండటంతో భూముల ధరలు సామాన్యుడికి అందకుండాపోతున్నాయి. -
రికార్డులు గల్లంతు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లావ్యాప్తంగా కేవలం 54.56 శాతం సేత్వార్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు లెక్క తేలింది. ప్రతి సర్వే నంబర్‌కు ఒక సేత్వార్ ఉంటుంది. భూమి పుట్టుపూర్వోత్తరాలు, వర్గీకరణ, క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ధారించేందుకు సేత్వార్లు కొలబద్ధగా నిలుస్తాయి. ఈ భూమికి సంబంధించి ఏ రకమైన వివాదం ఏర్పడినా ముందుగా పరిశీలించేది సేత్వార్నే. ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం 1954 -55 కాస్రా పహాణీని పరిగణనలోకి తీసుకుంటారు. రాజధానిని ఆనుకొని ఉన్న జిల్లాలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికి తగ్గట్టుగానే రెవెన్యూ వివాదాలు రెట్టింపయ్యాయి. విలువైన భూములపై కన్నేసిన అక్రమార్కులు రికార్డులను తారుమారు చేయడమో.. దురుద్దేశంతో వాటిలో రికార్డులను దిద్దడమో చేశారు. కొన్నింటిని ఏకంగా కనిపించకుండా హస్తలాఘవం ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, సర్వే అధికారులు కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ఈ రికార్డులు సర్వే ల్యాండ్ రికార్డ్స్, తహసీల్దార్ల కనుసన్నల్లో ఉంటాయి. ఈ క్రమంలో రికార్డులను భద్రపరచాల్సిన సిబ్బంది భూ మాఫియాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. సేత్వార్లను మాయం చేయడం ద్వారా రెవెన్యూ వివాదాలకు ఊపిరి పోశారు. జిల్లావ్యాప్తంగా 2,51,830 సర్వేనంబర్లు (సేత్వార్లు) ఉండగా... దీంట్లో ఇప్పటి వరకు 1,40,514 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు లెక్క తేలింది. బాలానగర్‌లో దాదాపు 60 శాతం సేత్వార్లు అదృశ్యమయ్యాయి. చాలావరకు దీంట్లో సిబ్బంది హస్తమే ఉన్నట్లు జిల్లా యంత్రాంగం అభిప్రాయానికొచ్చింది. శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లోని 1052 సర్వే నంబర్లలో పట్టాదారుల పేర్లు లేకుండా పోయాయి. అలాగే భూ వర్గీకరణ కూడా లేదని తేలింది. ఉప్పల్ మండలం నాచారం గ్రామంలో 137 సేత్వార్ రికార్డులు ఉర్దూ, అరబిక్ లిపిలో ఉండడమే గాకుండా చదవలేని స్థితిలో శిథిలమైనట్లు గుర్తించారు. రామంతాపూర్ ఖల్సాకు సంబంధించిన రికార్డుల డేటా కూడా కనిపించకుండా పోయింది. ఉప్పల్ ఖల్సా 356 సేత్వార్లు అసంపూర్తిగా ఉన్నట్లు తాజా పరిశీలనలో వెల్లడైంది. -
‘పచ్చ’ విషం
రాజధాని రీజియన్‌లో 63 శాతం గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటన దీంతో ఇకపై లేఅవుట్లు, బిల్డింగ్‌లకు అనుమతులు నిల్ పరిశ్రమలు, వ్యాపారాలకూ అవకాశం లేదు దారుణంగా పడిపోయిన భూముల ధరలు ఆయా ప్రాంత రైతుల్లో ఆందోళన అస్మదీయులకు మేలు చేసేందుకేనంటూ విమర్శలు ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు రాజధాని రీజియన్‌లో గ్రీన్‌బెల్ట్ వ్యవహారంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఒక్కసారిగా భూముల రేట్లు పడిపోవటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రియల్ వ్యాపారాన్ని రాజధాని పరిసరాలకే పరిమితం చేయడం, భవిష్యత్తులో ఈ భూముల్ని వివిధ ప్రాజెక్టుల కోసం తేలిగ్గా తీసుకునే ఉద్దేశంతోనే కావాలని గ్రీన్‌బెల్ట్‌ను రూపొందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని డెల్టా ప్రాంత రైతులు ఆందోళనకు సైతం సిద్ధమవుతున్నారు. -
రియల్ డల్
రాజధాని ప్రాంతంలో భూముల ధరలు తగ్గుముఖం శంకుస్థాపన తర్వాత తిరోగమనంలో రియల్ఎస్టేట్ ప్రత్యేకహోదా, ప్యాకేజీపై కేంద్రం మౌనమే ప్రధాన కారణం సీఎం చంద్రబాబు రాజీ ధోరణి సైతం తోడ్పాటు గుంటూరు అమరావతి శంకుస్థాపన తర్వాత రాజధాని పరిసర గ్రామాల్లో భూముల ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఊహించని విధంగా నేలకు దిగుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజి గురించి ఏదైనా ప్రకటన చేస్తారని ముందు నుంచీ ఇక్కడ భారీగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని రియల్టర్లు తమ వ్యాపార ప్రయోజనానికి వాడుకుని భూముల ధరలను భారీగా పెంచేశారు. తీరా శంకుస్థాపన రోజున ప్రధాని తన ప్రసంగంలో అసలు హోదా, ప్యాకేజీ గురించి కనీస ప్రస్తావన తేలేదు. దీంతో రాజధాని అభివృద్ధిపై సంశయంతో ఒక్కసారిగా ఇప్పుడు కొనుగోళ్లు మందగించాయి. కళకళలాడే రియల్ ఎస్టేట్ సైతం నీరసించింది. తాడికొండ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల పరిధిలోని భూములు, నివాస స్థలాల ధరలు క్రమేపి దిగివస్తున్నాయి. ఆరంభంలోనే ఢమాల్... రాజధాని ప్రాంతంగా అమరావతిని ప్రకటించిన వెంటనే ఇక్కడున్న భూములకు కనీవినీ ఎరుగని డిమాండ్ పెరిగిపోయింది. రూ. అరకోటి కూడా పలకని మారుమూల గ్రామాల్లో సైతం ఎకరం రూ.కోటి దాటిపోయింది. అంతేకాదు ఒక్కసారిగా ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ఎస్టేట్ కంపెనీలు ఎకరాలకు ఎకరాల భూములను పోటాపోటీగా కొనేశారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అప్రమత్తమైన ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో పాటు లే అవుట్ల అనుమతుల నిబంధనల్లోను మార్పుచేసింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత ఏర్పడింది. అయినా మున్ముందు ధరలు ఇంకా పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారులు భూముల కొనుగోలుకు రిజిస్ట్రేషన్లు సైతం లేకుండానే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతనెలలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం భారీ ప్రచారం కల్పించింది. రూ. కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేసింది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారని, అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని విసృ్తతంగా ప్రభుత్వంలో ప్రచారం జరిగింది. దీన్ని రియల్ఎస్టేట్ వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని రాజధానికి భారీగా పెట్టుబడులు వస్తాయనే ప్రచారంతో భూముల ధరలు పెంచేశారు. తీరా శంకుస్థాపన రోజు ప్రధాని హోదా,ప్యాకేజీపై నోరు మెదపకుండా అందరి ఆశలను అడియాశలు చేశారు. దీనికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంతోనూ ప్రజల్లో సందేహాలు లేవెనేత్తలా చేశాయి. వీటి ప్రభావం ఇప్పుడు రాజధాని భూముల ధరలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. శంకుస్థాపన తర్వాత రోజునుంచి వ్యవసాయ భూముల ధరలు తగ్గేలా చేసింది. ప్రధానంగా తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, కురగల్లు, నిడమర్రు, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోని వ్య వసాయ భూముల ధరలు తగ్గుముఖం పట్టాయి. శంకుస్థాపన ముందురోజు వరకు ఎకరా రూ.1.40 కోట్లు పలికిన ఈ భూములు ఇప్పుడు రూ.1.20 కోట్లకు తగ్గాయి. నివాసస్థలాల ధరల్లో మార్పు రాలేదు. మండల కేంద్రం తుళ్లూరులో చదరపు గజం రూ.25 నుంచి రూ.30 వేలు పలుకుతూ నిలకడగా ఉంది. రాజధాని ప్రకటనకు పూర్వం ఇక్కడ చదరపు గజం రూ.3 వేల లోపే. గుంటూరు సిటీ, పరిసర ప్రాంతాల్లో అయితే ప్రధాని ప్రకటన ప్రభావం పెద్దగా చూపలేదు. నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో చదరపు గజం రూ. లక్ష కొనసాగుతూనే ఉంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని నివాస స్థలాల ధరల్లో కూడా పెద్దగా మార్పులేదు. ప్రత్యేకంగా పెదకాకాని మండలంలో భూముల ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. జాతీయ రహదారికి, రాజధానికి సమీపంలోనే ఈ ప్రాంతం ఉన్నప్పటికీ ధరలు తగ్గుముఖం పట్టటం అక్కడి భూ యజమానులు, రియల్ వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామ కంఠం నివాస స్థలాలకు డిమాండ్... రాజధాని పరిధిలోని 29 గ్రామ కంఠాల్లో గల నివాస స్థలాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గ్రామ కంఠం పరిధిలోని స్థలాల్లో వెంటనే నిర్మాణాలు చేసుకునే అవకాశం ఉండటంతోపాటు రిజిస్ట్రేషన్ సమస్యలు లేవు. దీంతో దాదాపు అన్ని గ్రామ కంఠాల్లో సెంటు స్థలం రూ. 5 లక్షల వరకు పలుకుతోంది. ఉండవల్లి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లోని కంఠం స్థలాల సెంటు రూ.12 లక్షల నుంచి 16 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో గ్రామకంఠంలో ఉన్న ఇళ్ల స్థలాలకు, ల్యాండ్‌పూలింగ్‌లో ఉన్న భూములు అమ్మకాలు సాగుతుండగా మిగిలిన పొలాలు, స్థలాలు అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
వచ్చే జూన్ కల్లా వెళ్లాల్సిందే...
♦ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ ♦ సిబ్బందిని అమరావతికి తరలించే పనిలో సీఎస్ సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం జూన్ కల్లా హైదరాబాద్ నుంచి అన్ని శాఖల ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటివరకు సచి వాలయంలోని శాఖల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమంది అమరావతికి వెళ్లారు? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అనే వివరాలను రాబట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నమూనా ప త్రంలో మంగళవారం సాయంత్రంలోగా సాధారణ పరిపాలన శాఖకు వివరాలు అందజేయాల్సిందిగా సీఎస్ సోమవారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడు వెళ్ళేదీ, పూర్తి స్థాయిలో ఎప్పటికి అమరావతికి వెళతారు? తేదీలను తెలియజేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ తేదీన నిర్వహించే అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో ఆయా అంశాలు, వివరాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. భూముల ధరలు పెంచేందుకేనా..? హైదరాబాద్ నుంచి అధికారులు, ఉద్యోగులను వీలైనంత త్వరగా అమరావతికి తరలించడం వల్ల అక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తద్వారా ప్రభుత్వ పెద్దలకు అక్కడ ఉన్న భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వం హడావుడి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి ధరలు రాగానే ఆ భూములను విక్రయించుకోవచ్చనేది ప్రభుత్వ పెద్దల యోచనగా చెబుతున్నారు. -
స్థిరాస్తి కొంటున్నారా?
రూ. 50 లక్షలు దాటితే టీడీఎస్ తప్పనిసరి గడిచిన పదేళ్లుగా భారత్‌లో రియల్టీ వ్యాపారం ఊపందుకోవడంతో... భూముల ధరలూ భారీగా పెరిగాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఈ దామాషా ప్రకారం భూముల విలువలు పెరగలేదు. ఇది రియల్టీలో నల్లధనం సమస్యను తీవ్రం చేసింది. ఇలాంటి పరిస్థితిని కొంతమేరకు నివారించడానికి కేంద్రం 1961 ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలో 194 ఐఏ సెక్షన్‌ను తీసుకొచ్చింది. ఇది 2013 జూన్ నుంచీ అమల్లోకి వచ్చింది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి లావాదేవీ విలువ రూ.50 లక్షలు, ఆపై ఉంటే ఒకశాతం టీడీఎస్‌ను (మూలం వద్ద పన్ను మినహాయింపు) ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది. తేలిగ్గా టీడీఎస్... ఈ సెక్షన్ ప్రకారం, రూ.50 లక్షలకు పైబడి స్థిరాస్తిని కొనుగోలు చేసేవారు ట్యాన్‌కు (ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్) దరఖాస్తు చేసి, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న కొన్ని ఇబ్బందుల దృష్ట్యా పన్ను చెల్లింపుదార్లకు ఒక వెసులుబాటు ఇచ్చారు. దీని ప్రకారం పన్నును డిపాజిట్ చేసి, ‘పాన్’ ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే సౌలభ్యాన్ని కల్పించారు. అమ్మకందారుకు పాన్ అవసరం.. ఇక్కడ టీడీఎస్ చెల్లింపులకు సంబంధించి బాధ్యత ఎవరిదన్న సందేహం తలెత్తవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసిన వ్యక్తిదే ఈ బాధ్యత. లావాదేవీ విలువలో ఒక శాతం టీడీఎస్‌గా చెల్లించాల్సి ఉన్నప్పటికీ... అమ్మకందారుకు పాన్ లేకపోతే మాత్రం ‘డిడక్షన్ రేటు’ 20 శాతంగా ఉంటుంది. అమ్మకందారు-కొనుగోలు దారు పరస్పరం నిర్ణయించుకున్న, లేదా ప్రభుత్వం నిర్ణయించిన విలువను ‘లావాదేవీ విలువ’గా పరిగణిస్తారు. రుణం పొందిన లేదా లావాదేవీ సొమ్ము చెల్లించిన తేదీ (ఏది మంచిదైతే అది) నుంచీ టీడీఎస్ అమలవుతుంది. ఆలస్యం అయితే... నెలకు ఒకశాతం వడ్డీ పడుతుంది. అలాగే నెలకు ఒకశాతం లేట్ పేమెంట్ పన్ను భారమూ పడుతుంది. చెల్లింపులు ఇలా... టీడీఎస్ జరిగిన 7 రోజుల నుంచి నెలరోజుల లోపు ప్రభుత్వానికి దీన్ని జమ చేయాల్సి ఉంటుంది. 26 క్యూబీ ఫారమ్ (రిటర్న్కమ్ చలాన్) ద్వారా ఆన్లైన్ ట్యాక్స్ పేమెంట్ జరపవచ్చు. ఠీఠీఠీ.్టజీటఛీ.ఛిౌఝ వెబ్సైట్లో (టీడీఎస్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ) ఈ ఫామ్ దొరుకుతుంది. పన్ను చెల్లింపులకు అలాగే ట్యాక్స్ డిడక్ట్, చెల్లింపులకు సంబంధించి రిటర్న్ ఫైలింగ్‌కు... రెండు విధాలా ఈ ఫామ్ ఉపయోగపడుతుంది. డిడక్టయిన పన్ను డిపాజిట్, 26క్యూబీ ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తయిన తరువాత 15 రోజులలోపు ఆస్తి కొనుగోలుదారు ఫారమ్ 16బీలో టీడీఎస్ సర్టిఫికెట్‌ను జారీచేయాలి. 16బీ ఫామ్ ఠీఠీఠీ.్టఛీటఛిఞఛి.జౌఠి.జీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26క్యూబీ అకనాలెడ్జ్మెంట్ ఫామ్‌ను ఆస్తి రిజిస్ట్రేషన్, బదిలీ సమయంలో సమర్పించాలి. ఈ ఆన్లైన్ ప్రక్రియను సొం తంగా చేసుకోలేకపోతే, వృత్తి నిపుణుల సహాయాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. 194 ఐఏ సెక్షన్‌పై ఇంకేమైనా సందేహాలు ఉంటే... మైఐటీరిటర్న్ మొబైల్ యాప్ ద్వారా ‘ఆస్క్ ఏ క్వశ్చన్’ సేవలను ఉచితంగా పొందవచ్చు. - అమూల్ మిశ్రా, మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్ -
ఇక ఎకరాలోనూ లేఅవుట్!
హెచ్ఎండీఏలో స్థలపరిమితిని తగ్గింపునకు సర్కారు ఓకే సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల చిన్నచిన్న మొత్తాల్లో భూములు గల యజమానులకు శుభవార్త! చిన్నచిన్న భూముల్లో లేఅవుట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నో రోజులుగా సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలుకు మోక్షం కలిగింది. లేఅవుట్ నిబంధనలను సడలించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో ఇకపై కనీసం ఎకరా స్థలం ఉన్నా లేఅవుట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లేఅవుట్నిబంధనల్లో సడలింపు కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులు, సన్నకారు రైతులు, చిన్న చిన్న రియల్టర్ల కలలు నెరవేరనున్నాయి. ప్రస్తుతం లేఅవుట్ నిర్మాణానికి అనుమతి రావాలంటే కనీసం పది ఎకరాలుండాలనేది నిబంధన. దీంతో చిన్న మొత్తంలో స్థలాలు గల రైతులు, భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో లేఅవుట్‌కు కనీస స్థల పరిమితిని ఎకరాకు తగ్గించాలని, ఎకరా నుంచి 9 ఎకరాల వరకు స్థలం ఉన్నా అనుమతిచ్చేలా నిబంధనలను సడలించాలని కోరుతూ హెచ్ఎండీఏ ఏడాది కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడు దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతిపాదనల ఫైలుపై తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకం చేయడంతో, ఒకట్రెండు రోజుల్లో జీవో జారీ చేసేందుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. భారీ సంఖ్యలో వెంచర్లు... లేఅవుట్ సడలింపుల వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని పురపాలక శాఖ వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వేల ఎకరాల భూముల్లో చిన్న చిన్న లేఅవుట్ల నిర్మాణం ఊపందుకోనుంది. భారీ సంఖ్యలో కొత్త వెంచర్లు పుట్టుకు రానున్నాయి. నగరం సైతం త్వరితంగా విస్తరించనుంది. మధ్యతరగతి ప్రజలకు నగర శివార్లలో స్థలాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు స్వయంగా లేఅవుట్లను నిర్మించి స్థిరాస్తి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కలగనుంది. చిన్న రియల్టర్లు సైతం అవకాశాలు పెరిగి లాభపడనున్నారు. మళ్లీ భూముల ధరలు సైతం పెరిగే అవకాశముంది. నిబంధనల మేరకు కనీసం 10 ఎకరాల స్థలం లేకపోవడంతో అనుమతులు రాక ఇప్పటికే వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా భవిష్యత్తులో ఈ అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించే అవకాశం కలగనుంది. అదేవిధంగా కొత్తగా అక్రమ లేఅవుట్ల నిర్మాణాన్ని అడ్డుకోవచ్చని హెచ్ఎండీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, అందుకు సర్కారు సానుకూలంగా స్పందించింది. ఇదిలా ఉండగా, 10 ఎకరాల్లోపు ఉన్న లే అవుట్లకు అనుమతులు జారీ చేసేందుకు అదనంగా 50 శాతం డెవలప్మెంట్ చార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కొసమెరుపు. -
కబ్జా చెరలో చెరువులు
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు ఉన్న చెరువులను సైతం రికార్డుల్లో చూపని వైనం చోడవరం: భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. చెరువులు.. గెడ్డలు.. వేటినీ వదలడం లేదు. సాగునీటి వనరులు కుదించుకుపోయి రై తులు అల్లాడుతున్నారు. వీటిని పరిరక్షిం చాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీటి వెతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల బడా రైతులు చెరువులను ఆక్రమించి తమ సాగులోకి తెచ్చుకుంటుండగా, మరికొన్ని చోట్ల కబ్జాచేసిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా వేసి దర్జాగా అమ్మేసుకుంటున్నారు. మేజర్ చెరువులు ఆక్రమించుకొని తోటలు కేపీఅగ్రహారంలో 4 చెరువులున్నాయి. సుమారు 800 ఎకరాల ఆయక ట్టు ఉంది. చెరువులు ఆక్రమించుకొని సరుగుడు, చెరకు తోటలు వేసుకొని అనుభవిస్తున్నారు. నీలం చెరువు కింద నాకు 2ఎకరాలు భూమి ఉంది. పూర్తిస్థాయిలో నీరందడంలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -యన్నంశెట్టి గోపి, రైతు, కేపీఅగ్రహారం ఇరిగేషన్లో ఉన్న చెరువుల కంటే మైనర్ ఇరిగేషన్లో ఉన్న సాగునీటి చెరువులు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉన్న చెరువుల ఆక్రమణ మరీ ఎక్కువగా ఉంది. మైదాన జిల్లాలో సుమారు 1500 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చోడవరం నియోజకవర్గంలోనే సుమారు 246 చెరువులు ఉండగా వీటిలో 180 చెరువుల వరకు కబ్జాలో ఉన్నాయి. ఆక్రమణల వల్ల చెరువులు కుదించుకుపోయి సాగునీరు నిల్వ ఉండే విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఎక్కువ రోజులు పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కొన్ని చెరువుల్లో ఆక్రమణలకు ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలే ఇచ్చేశారంటే ఆయా శాఖల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థమౌతుంది. చోడవరం మండలంలో అడ్డూరు చెరువు ఆక్రమణకు అడ్డులేకుండాపోయింది. ఖండిపల్లిలో చెరువును కొందరు రైతులు ఆక్రమించుకోవడంతో అక్కడ చెరువు గర్భమే కనిపించడంలేదు. వెంకన్నపాలెం చెరువును ఎకరా వరకు రియల్టర్లు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేస్తుండగా లక్కవరం, బెన్నవోలు, గంధవరం, దుడ్డుపాలెం, గవరవరం, లక్ష్మీపురం, నర్సయ్యపేట, గాంధీగ్రామం చెరువులు కొందరి ఆధీనంలో ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, ఎర్రవాయు ప్రాంతంలో ఉన్న చెరువులు, రావికమతం, రోలుగుంట మండలాల్లో పెద్దచెరువులు కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నాయి. మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయన్న వివరాలు ఇరిగేషన్ శాఖ వద్దే లేకపోవడం ఆ శాఖ అసలత్వాన్ని ఎత్తిచూపుతోంది. వీరి నిర్లక్ష్యం రియల్టర్లు, కబ్జాదారులకు వరంగా మరింది. చోడవరం మండలంలో మైచర్లపాలెంలో-3, జీజేపురంలో-2 చెరువులతోపాటు మరో 11 చెరువులు ఇరిగేషన్ జాబితాలో లేకపోవడం అందర్నీ అవాక్కుచేసింది. ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోకుండా ఉపాధి పనుల్లో గట్లు వేయడం కబ్జాదారులకు మరింత లాభదాయకంగా మారింది. జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాల సాగుభూమికి పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. నీలకంఠపురంలో 3 చెరువులున్నాయి. ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. వర్షాధారంపైనే ఆధారపడి సాగుచేస్తున్నాం. ఆక్రమణలు వల్ల చెరువు గర్భం కుదించుకుపోయింది. పెదకట్టు చెరువు కింద నాకు 2ఎకరాల భూమి ఉంది. నీరులేక ఇబ్బంది పడుతున్నారు. చెరువల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలి. -జి.సత్యనారాయణ, రైతు, నీలకంఠపురం. -
అవని.. ఆకాశమే హద్దని
జిల్లాలో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సామాన్య, మధ్య తరగతి జనం సెంటు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తూ రియల్టర్లు భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నరసాపురం అర్బన్ : జిల్లాలో భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. జిల్లాలో మారుమూల ఉన్న నరసాపురంలో మార్కెట్ ప్రాంతంలో గజం స్థలం రూ. 2 లక్షలు పైనే పలుకుతోంది. ఏలూరు నగరంతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. ఈ పట్టణాల్లోని మారుమూల కూడా గజం రూ.15 వేలకు చేరింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పాలకులు అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తుండడం, ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భూమ్ తీసుకొచ్చి ధరలు పెంచేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు ముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ మంది. ఒకానొక దశలో భూములను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, అనేక రకాల పరిశ్రమలు స్థాపిస్తామనే ప్రకటనలు గుప్పించడంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రధాన పట్టణాల్లో భూముల ధరలు రివ్వున ఆకాశాన్ని తాకాయి. జిల్లాకు శివారున ఉండే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సైతం పంట భూములు ఎకరం రూ.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన అపార్ట్మెంట్ల సంస్కృతి పల్లెలకూ పాకుతోంది. ఏలూరు కార్పొరేషన్‌తో సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించి 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం కూడా పేదలకు నివాస గృహాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. భూముల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మారింది. -
భాగ్యనగరంలో భూమి బంగారమే!
ఆగస్టు 1 నుంచి నగరంలో పెరగనున్న భూముల ధరలు స్టాంపు డ్యూటీ తగ్గిస్తే మరింత లాభమంటున్న నిపుణులు ప్రస్తుతం హైదరాబాద్‌లో సెంటు జాగా కొనాలంటేనే లక్షలు కావాలి. అలాంటిది మరో రెండు వారాల్లో అయితే కోట్లు వెచ్చించాల్సిందే. ఎందుకంటే ఆగస్టు 1 నుంచి ఆయా ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న ధరల కంటే 10-30 శాతం మేర భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది. అయితే స్టాంపు డ్యూటీని తగ్గించకుండా భూముల ధరలను పెంచితే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అంతగా పెరగదనేది స్థిరాస్తి నిపుణుల అభిప్రాయం. సాక్షి, హైదరాబాద్ : మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో కొన్నేళ్లుగా కుదేలైన భాగ్యనగర స్థిరాస్తి అభివృద్ధి తిరిగి పుంజుకోనుంది. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఫార్మా, హెల్త్, ఫిల్మ్ సిటీలు, సత్వర అనుమతుల కోసం పారిశ్రామిక విధానం.. వంటి వాటితో నగరంలో భూములకు తిరిగి రెక్కలురానున్నాయి. అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకు గిరాకీ రెట్టింపై దేశ, విదేశీ పెట్టుబడుదారులను హైదరాబాద్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని విస్తరణ యోచనలో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి, సేవా, ఆతిథ్యం, షాపింగ్ మాళ్లకు ఆదరణ పెరగనుంది. భారీగా పెరగనున్న ఉద్యోగులు, వేతనాలు.. వంటి కారణాల వల్ల స్థిరాస్తి రంగానికి ఢోకాలేదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కూడా సానుకూలంగా ఉండటం వల్ల వివిధ నిర్మాణాల్లో అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయంటున్నారు. గచ్చిబౌలి-పెద్ద అంబర్పేట్.. గతంలో స్థిరాస్తి వ్యాపారమంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల మీదే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డులతో నగరం చుట్టూ అభివృద్ధికి బాటలు పరచుకుంది. మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, అప్పా జంక్షన్, మణికొండ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుంది. 50 శాతం అభివృద్ధి తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్యే ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేకించి గచ్చిబౌలి నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హాట్‌స్పాట్. ఎందుకంటే ఇక్కడ భూమి ఉంది. ధరలూ అందుబాటులోనే ఉన్నాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. పెపైచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత అభివృద్ధి విజయవాడ హైవే మీదు గా వరంగల్ హైవేకు మళ్లే అవకాశాలున్నాయి. మరో 8 నెలల్లో 40-50 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైల్ కారణంగా భవిష్యత్తులో నగరమంతా అభివృద్ధి జరుగుతుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. ఫ్లాట్లకు గిరాకీ.. గతంలో సొంతూర్లలో స్థలాలు, ఇళ్లను కొనడం మీద దృష్టిసారించిన వారు సైతం నగరానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసుకొని ఇక్కడ ఫ్లాట్లను కొనడంపై మక్కువ చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో మాత్రమే కన్పించే అపార్ట్మెంట్ సంస్కృతి ఇప్పుడు శివారు ప్రాంతాలైన నార్సింగి, అప్పా జంక్షన్ , మణికొండ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రసు ్తతం నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నారంటే ఫ్లాట్లకు ఉన్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు. నాణ్యత, వసతుల కల్పనలో ఏమాత్రం తగ్గకుండా లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు కూడా. వాణిజ్య స్థిరాస్తి జోష్.. నగరంలో ఏటా 50 లక్షల చ.అ. వాణిజ్య స్థలం అభివృద్ధి చెందుతుంది. 2015 నాటికల్లా ఆఫీసు సముదాయాల విస్తీర్ణం 50 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం వల్లే ప్రపంచంలో హైదరాబాద్ రియల్ మార్కెట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో విస్తరణ కారణంగా నిర్మాణ సంస్థలు ఐటీ పార్కులు, షాపింగ్ మాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న వాణిజ్య ఆఫీసు సముదాయాల్లో స్థలాల్ని తీసుకునేవారు విపరీతంగా పెరుగుతున్నారు. స్టాంపు డ్యూటీని తగ్గించాల్సిందే.. సరిగ్గా రెండేళ్ల తర్వాత నగరంలో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బహిరంగ మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం భూముల ధరలను పెంచనుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల, మహేశ్వరం, ఘట్కేసర్, భువనగిరి, షామీర్పేట వంటి ప్రాంతాలకు బాగా కలిసొస్తుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే స్టాంప్ డ్యూటీని తగ్గించకుండా భూముల విలువను పెంచితే సామాన్యుల రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ముందుకురారని ఆయన పేర్కొన్నారు. అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీని 4 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు. అప్పుడే రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయమూ దండిగా వస్తుందన్నారు. ఇదిలా ఉంటే భూముల ధరలు తక్కువగా ఉన్నచోట ఎలాగైతే పెంచనుందో.. అలాగే ఎక్కువగా ఉన్న చోట ధరలను అదుపులో ఉంచడం కూడా అవసరమేననేది ఆయన అభిప్రాయం. -
పరి'శ్రమే'
-
పాఠాలు నేర్వలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల ధరలు ఆకాశన్నంటుతుండడం.. శివార్లలో వలసలు పెరిగిపోవడంతో ఆక్రమణకు గురవుతున్న సర్కారు స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 2008లో 166 జీఓను జారీ చేసింది. చాలా ఏళ్ల తర్వాత క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించడంతో 90,677 దరఖాస్తులొచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు 79,549 దరఖాస్తులు తిరస్కరించగా, 7,683 దరఖాస్తులకు మాత్రమే జిల్లాస్థాయి కమిటీ ఆమోదముద్ర వేసింది. 80 గజాలవే ఎక్కువ.. క్రమబద్ధీకరించిన వాటిలో అధికం 80 చదరపు గజాల్లోపు స్థలాలే. ఈ కేటగిరీలో 32,927 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చిన జిల్లాస్థాయి కమిటీ 3,811 అర్జీలను ఓకే చే యడం ద్వారా 53.05 ఎకరాలను క్రమబద్ధీకరించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించడంతో ఖజానాకు నయాపైసా సమకూరలేదు. ఇక 81-250 గజాలకు సంబంధించి 3,872 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన యంత్రాంగం 110.12 ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించింది. 251 నుంచి 500 చ.గజాల వరకు వచ్చినవాటిలో 1,064 దరఖాస్తులకు సీసీఎల్ఏ మోక్షం కలిగించింది. తద్వారా 72.18 ఎకరాలను క్రమబద్ధీకరించింది. ఆపై విస్తీర్ణం కలిగిన చాలావాటిని ప్రభుత్వం తిరస్కరించగా, 351 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయి. లోపాల పుట్ట! కమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 58,59 జీఓలు తప్పుల తడకగా ఉన్నాయి. మరి ముఖ్యంగా కనీస ధరల వర్తింపులో మార్కెట్ ధరలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా 2014 బేసిక్ వాల్యూ మేరకు స్థలాలను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం దరఖాస్తుదారులకు ఆశనిపాతంగా పరిణమించింది. శివార్లలో ఇప్పటికే కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్లో కంటే రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు మాదాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం కనీస ధర రూ.20వేలు పలుకుతుండగా, ఈ విలువను చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించాలనడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నవారికీ, ఇటీవల ఆక్రమించిన వారిని ఒకే గాటిన కట్టడాన్ని అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణలోనూ ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్మాణాలుంటేనే స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని నిబంధన విధించింది. రెండు తప్పులు చేసిన వారిపట్ల కరుణ చూపి.. తెలిసో తెలియకో స్థలం కొన్నపాపానికి తమను శిక్షించడమేమిటనే వాదన వినిపిస్తోంది. సేల్‌డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ, నిర్మాణం లేదనే సాకుతో తమను విస్మరించడంపై అభ్యంతరం చెబుతున్నారు. క్రమబద్ధీకరించే స్థలంపై పరిమితి విధించకపోవడంతో భారీ విస్తీర్ణంలోని సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు కూడా ఈ ముసుగులో రెగ్యులరైజ్ అవుతాయనే ప్రచారమూ జరుగుతోంది. క్రమబద్ధీకరణ అధికారం ఆర్డీఓలకు కట్టబెట్టడాన్ని రెవెన్యూ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి. గతంలో 80 గజాల్లోపు జాగాల క్రమబద్ధీకరణలో నామమాత్రపు ఫీజును వసూలు చేయడం ద్వారా స్థలంపై హక్కులను కల్పించారు. తాజాగా స్థల విస్తీర్ణం పెంచినప్పటికీ, స్థలంపై యాజమాన్య హక్కులు లేకపోవడం పేదలను నిరాశపరుస్తోంది. -166 జీఓ కింద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, యూఎల్సీ కింద దరఖాస్తు చేసుకున్నవాటికీ, ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించినవారికీ ఇప్పటి ధరల తరుగుదలను వర్తింపజేస్తారా? లేదా అనే అంశంపై స్పష్టీకరించలేదు. -
దొనకొండలో అనకొండలు
ఆక్రమణలిలా.. చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలకల ఫ్యాక్టరీ నుంచి కొండ క్యారీలకు వెళ్లే దారిలో సుమారు 100 ఎకరాల భూమి అన్యాక్రాంతైమైంది. రాత్రికి రాత్రే ఫెన్సింగ్ రాళ్లు పాతి భూమిని ఆక్రమించారు. పొలాలకు ఉన్న నీటి కుంటలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో అదే గ్రామ పంచాయతీ పరిధిలో బందిళ్లపాయి కొండ దగ్గర సుమారు వంద ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిని లక్షలాది రూపాయలకు కబ్జాదారులు ఇతరులకు విక్రయించారు. దర్శి పట్టణ నడిబొడ్డులోనే 246, 247, 248 సర్వే నంబర్లలో సుమారు పది ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి టీడీపీ ముఖ్యనేత కబంద హస్తాల్లో ఉండటంతో అధికారులు చ ర్యలు తీసుకోలేకపోతున్నారు. లంకోజనపల్లి గ్రామ పంచాయతీలో 80 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామ టీడీపీ నాయకులు కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచి జిల్లా అధికారులతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ భూమిని మాత్రం కబ్జాదారుల చేతుల నుంచి కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. చెక్ డ్యామ్‌నూ ఈ అనకొండలు వదల్లేదు. గతంలో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ నీటి నిల్వలతో చుట్టు పక్కల 50 ఎకరాలకు నీరందించేది. వందలాది మంది రైతుల పంటలు పండించుకునే వారు. ప్రస్తుతం అదికాస్తా ఆక్రమణలకు గురవడంతో ఈ ప్రాంత రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునేదెవరు? దీంతో ఆ ప్రాంతంలోని రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దొనకొండ మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నకిలీ రికార్డులు సృష్టించి ఈ భూములను దర్శి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కబ్జాదారులు రిజిస్టర్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పగా ప్రకటించిన మంత్రి కళ్ల ముందే ఆక్రమణలు సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్ఐని పంపిస్తా: తహశీల్దారు మస్తాన్ ఈ విషయమై డిప్యూటీ తహ శీల్దార్ మస్తాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆక్రమణలు జరుగుతున్నాయా...వెంటనే ఆర్ఐను పంపి అక్కడ ప్రభుత్వ భూములు పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. నాలుగు నెలలుగా ఈ తంతు సాగుతున్నా పట్టించుకోకుండా సాక్షి ప్రశ్నించగానే ఇప్పుడే తెలిసినట్టు ... ఆర్ఐని పంపించి పరిశీలిస్తాననడం గమనార్హం. దర్శి : రాష్ట్ర ప్రభుత్వం దొనకొండను పారిశ్రామిక హబ్‌గా ప్రకటించడంతో దర్శి నియోజకవర్గంలోని భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నోరుమెదపకపోవడం పట్ల విమర్శలకు తావి స్తోంది. దర్శి నియోజకవర్గ పరిధిలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలున్నాయి. వీటి పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు పరిశ్రమల స్థాపనకు అనువు గా ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రాంతం పై దృష్టిసారించింది. దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. మంత్రి నియోజకవర్గం కావడంతో ఆయన పేరు చెప్పుకుంటూ ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. పొక్లెయిన్ల సాయంతో రాత్రికి రాత్రే చదును చేయడమే కాకుండా ఫెన్సింగ్ రాళ్లు పాతి మరీ ఆక్రమిస్తున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఖాళీ జాగా.. వేసై పాగా
మండలంలోని బొల్లారం జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండడం, దీనికి తోడు పారిశ్రామికంగా బొల్లారం అభివృద్ధి చెందుతుండడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎకరా స్థలం విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. బొల్లారం ప్రాంతంలో సుమారు వె య్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూములుంటాయి. ఇందులో 172 ఎకరాల స్థలాన్ని నాలుగేళ్ల క్రితం అధికారులు హుడాకు కేటాయించారు. ఇలా హుడాకు కేటాయించిన స్థలంతో పాటు, బొల్లారం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అందులో భాగంగానే వైఎస్సార్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు నాయకులు సిద్ధపడ్డారు. స్థలం చుట్టుపక్కల ఇప్పటికే కొన్ని నిర్మాణాలు చేపట్టగా, మరికొంత కబ్జా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని విలువ సుమారు రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. స్థానికంగా ఉన్న చెరువులను కూడా ఇక్కడి అధికార పార్టీ నేతలు కబ్జాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘గూడు’కట్టుకున్న ఆశలు
అప్పన్న భూవివాద పరిష్కారానికి కసరత్తు 1998 నుంచి నేటి వరకు ధరల మార్పులపై ప్రభుత్వం ఆరా దేవస్థానం భూముల ధరలపై నివేదిక {పభుత్వానికి సమర్పించిన కలెక్టర్ గోపాలపట్నం : సింహాచల దేవస్థానం భూవివాద పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూముల ధరల నివేదిక కోరడంతో జిల్లా అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో దేవస్థానం భూ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దేవస్థాన భూముల పరిధిలో ఉన్న వెంకటాపురం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం, అడివివరం గ్రామాల్లో వేలాది ఇళ్లు, స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి. 1999లో దేవస్థానం భూముల్లో నివాసాలుంటున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు నాటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందుకోసం 578 జీఓ విడుదల చేసింది. కానీ అప్పట్లో ఆ భూముల ధరలు భారంగా ఉన్నాయంటూ ఇళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసి ధరలు మార్పు చేయాలని ఉద్యమాలు చేశారు. అదే సమయంలో దేవస్థానం భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ పీఠాధిపదులు రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏకంగా లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ గ్రామాలు, గోపాలపట్నంతో పాటు నగరమంతటా ఉన్న కొండప్రాంతం సర్వే నంబరు 275 వివాదంలో ఉంది. ఈ భూములు కూడా దేవస్థానానివేనని, వీటి నిర్మాణాలను, క్రయ విక్రయాలను అధికారులు అడ్డుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వం ఏటా పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతోంది. మరో వైపు సొంతిళ్లు ఉన్నా అవి తమ భూముల్లోనే ఉన్నాయని దేవస్థానం అధికారులు పెత్తనం చేస్తుండడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండుమూడు నెలల్లో దేవస్థానం భూ సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దేవస్థానం భూముల ధర రికార్డు సమర్పించాలని కలెక్టర్ యువరాజ్ నుంచి గోపాలపట్నం సబ్‌రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణకు ఆదేశాలు వచ్చాయి. దీంతో 1998 నుంచి ఇప్పటి వరకు పెరిగిన భూముల ధరల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం కోరడంతో పీఠాధిపతులు సానుకూలంగా ఉన్నందున న్యాయస్థానం నుంచి ప్రజలకు అనుకూల తీర్పు వెలువడుతుందని... 578 జీవో ప్రకారమే ధరల నిర్ణయం ఉంటుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడున్న భూముల ధరలు గోపాలపట్నం మెయిన్‌రోడ్డు కమర్షియల్ చదరపు గజం రూ25 వేలు ...గోపాలపట్నాన్ని అనుకొని ఉన్న కాలనీల్లో చదరపు గజం రూ. 6 వేల నుంచి రూ.16వేలు బుచ్చిరాజుపాలెం మెయిన్‌రోడ్డు కమర్షియల్ రూ. 28వేలు, ఆనుకొని వున్న కాలనీల్లో చదరపుగజం రూ.12 వేల నుంచి రూ.16 వేలు వేపగుంట మెయిన్‌రోడ్డు చదరపు గజం రూ.12 వేలు... ఆనుకొని ఉన్న కాలనీల్లో రూ.5800 నుంచి రూ.12 వేలు వరకూ {పహ్లాదపురం ఏరియా రూ.11వేలు అడవివరం ఏరియా రూ.11వేలు పురుషోత్తపురం ఏరియా రూ.6 వేల నుంచి రూ.11 వేలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం దేవస్థానం భూ సమస్య పరిష్కారం కోసమే మేమూ ఎదురు చూస్తున్నాం. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి భూముల ధరలు నివేదించాం. భూ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇది జరిగితే ప్రజలకు మేలు జరగడంతో పాటు రిజిస్ట్రేషన్ల రూపేణా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం వస్తుంది. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక లక్ష్యాలూ నెరవేర్చగలం. - లక్ష్మీనారాయణ, సబ్‌రిజిస్ట్రార్, గోపాలపట్నం గడిచిన ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల తీరిదీ సంవత్సరం {పభుత్వ టార్గెట్ వచ్చింది 2009-2010 రూ.14 కోట్లు రూ.9.23 కోట్లు 2010-11 రూ.15.63 కోట్లు రూ.22.70 కోట్లు 2011-12 రూ.27.24 కోట్లు రూ.16.6 కోట్లు 2012-13 రూ.27.25 కోటు రూ.19.92 కోట్లు 2013-14 రూ.24.85 కోట్లు రూ.12.36 కోట్లు 2014-15 రూ27 కోట్లు రూ.10 కోట్లు(ఇప్పటి వరకు) -
రియల్ వ్యాపారులకు షాక్
‘వీజీటీఎం’లో ఇప్పటికే పంచాయతీల అనుమతితో వెలసిన వె ంచర్లు పంచాయతీల అధికారాలకు కత్తెరతో అగమ్యగోచరంగా మారిన స్థితి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తగ్గనున్న భూముల ధరలు విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం వీజీటీఎం ఉడా పరిధిలో లేఔట్ల అనుమతులను నిలిపివేసిన ప్రభుత్వం.. బుధవారం ఉడా పరిధిలోని పంచాయతీలు సైతం లేఔట్లకు అనుమతులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ. 300 కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాల పరిస్థితి అగమ్య గోచరం కానుంది. రాజధాని నిర్మాణం పేరుతో మూడు నెలలుగా విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయి. అమెరికాలోని న్యూజెర్సీ పట్టణంలో ఎకరం భూమి రూ. 5.5 కోట్లు పలుకుతుంటే.. ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 12 కోట్లకు చేరుకుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడే ఆశ్చర్యం వ్యక్తంచేశారంటే భూముల ధరలు ఏమేరకు పెరిగాయో అర్థమవతుంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా లేఔట్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. అనేకమంది వ్యాపారులు భూమి కొనుగోలు ధరలో రైతులకు 20 శాతం చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. మూడు, నాలుగు నెలల్లో వీటిని లేఔట్లుగానో, ఏకమొత్తంగానో విక్రయించి సొమ్ము చేసుకునేలా రంగంలోకి దిగారు. ఉడా పరిధిలో ఇప్పటి దాకా 466 లేఔట్లకు అనుమతులు మంజూరు చేశారు. ఈ అనుమతుల కోసం మరో 40 దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయి. ఇప్పటికే 400 ఎకరాల్లో 100 వెంచర్లు... సాధారణంగా ఉడాకు లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అధికారిక ప్రక్రియ మొత్తం పూర్తయి అనుమతి రావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఈ కారణంతో తొలుత పంచాయతీల అనుమతులు తీసుకుని వెంచర్లు వేసి విక్రయించి ఆ తర్వాత ఉడాకు దరఖాస్తు చేసుకునే ఆలోచనతో దాదాపు 400 ఎకరాల్లో సుమారు 100 వెంచర్లు వెలిశాయి. రాజధాని వస్తే బ్రహ్మాండం జరిగిపోతుందనే ఆశతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఇక్కడకు వచ్చి లేఔట్లలో ఇంటి స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నదికి అటు, ఇటు రివర్ వ్యూ (నదీముఖ) రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో గత నెల రోజులుగా మంగళగిరి, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో లేఔట్లలోని ఇంటి స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉడా పరిధిలో లేఔట్లు, నూతన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు నిలిపివేయాలని మూడు రోజుల కిందట ప్రభుత్వం ఉడాకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామం రియల్టర్లకు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే బుధవారం వీజీటీఎం పరిధిలోని 52 మండలాల్లో ఉన్న 826 పంచాయతీల అధికారాలన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం రియల్టర్లకు శరాఘాతంగానే చెప్పవచ్చు. రియల్టర్లు కొనుగోలు చేసిన భూముల్లో వెంచర్లు వేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూముల కొనుగోలుకు కళ్లెం వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. రైతులకూ ఇబ్బందులే... రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో రైతులు అనివార్యంగా ప్రభుత్వానికే తమ భూములు అప్పగించేలా చేసే వ్యూహంతోనే వీజీటీఎం పరిధిలో లేఔట్లు, ఇతర నిర్మాణాల నిలిపివేత, పంచాయతీల అధికారాల రద్దు జీవోలు జారీ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రియల్టర్లు కొత్తగా భూములు కొనడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదనీ, ఇప్పటికే అగ్రిమెంట్ల మీద ఉన్న భూములను కూడా వ్యాపారులు రైతులకు వెనక్కు ఇచ్చే అవకాశాలు ఉంటాయని రియల్టర్లు చెప్తున్నారు. ఈ జీవోల వల్ల రియల్టర్లకే కాకుండా ఇప్పటి దాకా తమ భూములకు ఉన్న ధరలు తగ్గి రైతులు కూడా నష్టపోయే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
జిల్లా కేంద్రం కానున్నవికారాబాద్
వికారాబాద్: వికారాబాద్ ప్రాంతానికి ప్రస్తుతం మహర్దశ మొదలైంది. ఇప్పటికే కాసుల వర్షం ప్రారంభమైంది. రానున్నకాలం మరింత దేదీప్యమానం కానుందని ఈ ప్రాంతీయులు ఆకాంక్షిస్తున్నారు. వికారాబాద్ పట్టణం జిల్లాకేంద్రం కావడం దాదాపుగా ఖరారవడంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ముఖ్యంగా భూముల ధరలు అమాంతం ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో ధరలతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలు రెండుమూడు రెట్లు పెరిగిపోయాయి. పట్టణానికి 15 కిలోమీటర్ల వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్ల స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలాచోట్ల సాగుభూముల్ని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 కిలో మీటర్ల వరకు పట్టణం విస్తరించింది.ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని అనంతగిరి గుట్ట మొదలు కొని హైదరాబాద్ వైపు,కొత్తగడి మొదలుకొని పరిగి వైపు వెళ్ళే దారి వెంట లే అవుట్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. పలువురు వ్యాపారులు,ఉద్యోగులు,ధనవంతులు,మధ్యతరగతి వర్గాలు ఇళ్ల స్థలాలు, ఫాంహౌజ్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఈ ప్రాంతంలో పట్టాభూములు దొరకని పరిస్థితి నెలకొంది. శాటిలైట్‌టౌన్ ఊతం... నెల కిందట శాటిలైట్టౌన్కు సంబంధించిన పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించడంతో పాటు మంజీరానీరు వికారాబాద్‌కు ఇటీవల రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు అనంతగిరి పర్యాటక కేంద్రం అభివృద్ధి జరగడం, జాతీయ ప్రిజన్ అకాడమీ, జిల్లా జైలు, ఆల్ట్రామోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం, జిల్లా కోర్టు, రూర ల్ చిన్న తరహా పరిశ్రమల యువకుల వృత్తి విద్యా శిక్షణ కే ంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వికారాబాద్‌కు మంజూరవడం వల్ల కూడా ఇక్కడ సందడి పెరిగింది. జిల్లాకేంద్రంగా మారను న్న వికారాబాద్‌లో కొన్ని పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే మూడేళ్ల క్రితం ఎకరానికి రూ.5 నుంచి 10 లక్షల ధర ఉండగా ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి 90 లక్షలకు చేరింది. రాన్రాను భూముల ధరలు అందుబాటులో లేకుండా పోవడంతో రియల్టర్లు సైతం గ్రూపులుగా ఏర్పడి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. స్థానికులతో పాటు హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, తాండూర్, జహీరాబాద్, సంగారెడ్డి, చేవెళ్ల తదితర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్టర్లు ఇక్కడ భూముల్ని కొనుగోలు చేస్తున్నారు. క్రమంగా పట్టణంలో ప్రధాన దారుల వెంట ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్విమింగ్‌పూల్స్, కళాశాలలు, కల్యాణ మండపాలు ఏర్పాటవుతున్నాయి. పనికిరాని పోరంబోకు భూమి సైతం ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది. -
రియల్ రాజధాని
► ఎవరి కోసం ఇది? ► భవిష్యత్ తరాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసమన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనుమానాలు ► భూసేకరణ సహా అన్నిటిపైనా కొరవడిన స్పష్టత.. ప్రాంతాల పేర్లు మారుస్తూ లీకులు; ప్రకటనలు ► ధరలకు రెక్కలతో ఇప్పటికే రైతుల చేతుల్లోంచి జారిపోయిన భూమి ► కనీసం 30వేల ఎకరాలుంటే ప్రణాళికాబద్ధ రాజధాని ► చుక్కల్లో ధరలతో ఆ స్థాయి సేకరణ అసాధ్యం ► భూముల లభ్యత సులభమైతేనే నయమంటున్న నిపుణులు.. ► అలాగైతేనే బతకడానికొచ్చే సామాన్యులకు చోటు సాక్షి, హైదరాబాద్: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే ఇపుడు ఆంధ్రప్రదేశ్ యావత్తూ రాబోయే రాజధాని చుట్టూరా తిరుగుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే ప్రభుత్వమే అలా తిప్పుతోంది. రాజధాని అనేది ప్రజలకోసమని, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా, వారి భవిష్యత్ నివాసానికి అనువైనదిగా ఉండాలన్న ధ్యాసే విస్మరించి... రాజధానిని భూముల ధరలు పెంచుకోవడానికి పనికివచ్చే సాధనంలా చూస్తోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ముందే భారీగా భూములు కొనిపెట్టుకున్న రాజకీయ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోంది. విజయవాడ- గుంటూరు మధ్యనంటూ ఒకసారి... అమరావతి దగ్గరంటూ మరోసారి... వీజీటీఎం పరిధిలోనంటూ ఇంకోసారి... నూజివీడు, వినుకొండ ప్రాంతాల్లోనంటూ ఇప్పుడు... ఇలా రకరకాలుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ప్రభుత్వ పెద్దలే పలు లీకులు ఇచ్చారు. ‘విజయవాడ-గుంటూరు మధ్య అయితేనే రాష్ట్రం మధ్యలో ఉన్నట్టు. అక్కడైతేనే అన్ని ప్రాం తాల వారికీ అందుబాటులో ఉంటుంది’ అని శివరామకృష్ణన్ కమిటీ పర్యటనకు ముందే చంద్రబాబు ప్రకటించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు సైతం తరచూ రాజధానిపై ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ప్రకటనలిచ్చిన ప్రతిసారీ అక్కడ భారీ ఎత్తున భూములు చేతులు మారుతూ అగ్రిమెంట్లు చేసుకోవటం తెలియనిదేమీ కాదు. నిజానికి ఇలా ప్రభుత్వం లీకులిచ్చిన ప్రాంతాలన్నిటా భూమి ఇప్పటికే రైతుల చేతుల్లోంచి నేతలు, వ్యాపారులు, దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇపుడు ధర పెరిగినా... ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి 40 శాతమో, 50 శాతమో భూ యజమానులకిచ్చినా బాగుపడేది ఈ దళారులు, రియల్ వ్యాపారులే తప్ప రైతులు కారన్నది వాస్తవం. భూ సేకరణ సాధ్యమయ్యేనా? ఇపుడున్న ధరవరల్లో భూ సేకరణ సాధ్యం కాదని, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరువగా ఉండే ప్రాంతమైతేనే రాజధానికి బాగుంటుందని శివరామకృష్ణన్ కమిటీ సైతం పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆ స్థాయిలో లేవు. ప్రయివేటు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసి అందులో రెతులకు భాగస్వామ్యం కల్పిస్తామని, ‘ల్యాండ్ పూలింగ్ చేస్తామ’ని ప్రభుత్వం చెబుతోంది. 60:40, 70:30లో రైతులకు వాటాలిస్తామంటోంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటే 60 నుంచి 65 శాతం భూమిని రోడ్లు, గ్రీనరీ తదతరాలకు వదిలిపెట్టాలి. ఇలాచేస్తే మిగిలే 35 శాతంలో భూ యజమానులకు దక్కేదెంతన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ వారి చేతికి కొంత భూమి వచ్చినా... ఇప్పటికే భారీ ధరల వద్ద కొనుగోలు చేసి... దాన్లో ప్రభుత్వానికి 60 శాతమో, 70 శాతమో ఇచ్చేయగా మిగిలిన భూమిని వారేం చేస్తారు? అందులో వారు కట్టే భవనాలు గానీ, ఇళ్లు గానీ ఎవరికి అందుబాటులో ఉంటాయి? వాటి ధరలు ఏ స్థాయిలో ఉంటాయి? రాజధానిలో బతుకుదామనో, ఉద్యోగాల కోసమో వచ్చినవారు వీటిని భరించగలరా? ప్రభుత్వం ఈ ఆలోచనలన్నీ మానేసి కేవలం కొందరు వ్యాపారులు, నాయకులకు ప్రయోజనం చేకూర్చడానికే తానున్నట్టు వ్యవహరిస్తుంటే ఏమనుకోవాలి? అసలు ప్రభుత్వ భూములో, డీ నోటిఫై చేసేందుకు వీలుగా అటవీ భూములో భారీగా ఉన్న ప్రాంతం వైపు ప్రభుత్వం ఎందుకు చూడటం లేదు? అక్కడైతే భూములపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది కనక భవిష్యత్‌లో పేదలకు సైతం ప్రభుత్వమే అందుబాటు ధరల్లో ఇళ్లు అందించే అవకాశం ఉంటుందిగా? రాజధాని ఎక్కడనేది ఇక్కడ ప్రశ్నే కాదు. కానీ అందరికీ చేరువలో ఉండటంతో పాటు అందరికీ బతకడానికి అందుబాటులో ఉండటం కూడా ముఖ్యమన్న సంగతి మన ప్రభుత్వం ఎందుకు మరిచిపోతోంది? ఇదే అంశంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ‘రియల్’ రాజధాని? రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల కమిటీని వేసింది. అది దేశవిదేశాల్లోని పలు ప్రాంతాలను సందర్శించనుంది. అహ్మదాబాద్ (గుజరాత్), నయా రాయపూర్ (చత్తీస్‌ఘర్), భువనేశ్వర్ (ఒరిస్సా) ఛండీఘడ్లతో పాటు విదేశాల్లోనూ పర్యటించనుంది. మరి ఆయా రాజధానులు మనలా రియల్ ఎస్టేట్ నీడలో నిర్మితమయ్యాయో, ప్రభుత్వ భూము ల్లో ప్రణాళికాబద్ధంగా నిర్మితమయ్యాయో చూద్దాం.... రాష్ట్రాన్ని సింగపూర్‌ను చేస్తానంటోంది ప్రభుత్వం. కానీ సింగపూర్ 714.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమైంది. 1960లలో 581 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ఈ పట్టణం ఇపుడు 723.2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. 2033 నాటికి మరో 100 చదరపుకిలోమీటర్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాక ఛత్తీస్‌గఢ్ తన కొత్త రాజధానిని నయా రాయపూర్ పేరిట నిర్మించుకుంది. చత్తీస్ఘడ్ రాజధానిగా నయా రాయపూర్ 8 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాజధాని నిర్మాణం కోసం 41 గ్రామాల ప్రజలను అక్కడినుంచి తరలించారు. మొత్తం భూమి లో సగం రోడ్లు, పార్కులు, ప్రజోపయోగం, నీటి సదుపాయాల ఏర్పాటు, గ్రీన్‌బెల్టుల కోసం వినియోగించారు. 23 శాతం భూమిని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆడిటోరియంలకు కేటాయించారు. 30 శాతం భూమిని గృహోపయోగం, వాణిజ్యావసరాలకు కేటాయిం చారు. ఒరిస్సాల్లో ఎన్ని వెనకబడిన జిల్లాలున్నా రాజధాని భువనేశ్వర్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, పంజాబ్-హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగ ఢ్ కూడా ప్రత్యేకమైనవే...భువనేశ్వర్ 393.57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 1948లోనే ఈ నగరానికి ప్రణాళికలు వేశారు. విద్యాసంస్థలు, షాపింగ్ కాంపెక్సులు, వైద్యశాలలు, ఆటస్థలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, అసెంబ్లీ, రాజభవన్, సచివాలయంతోపాటు ప్రయివేటు గృహోపయోగానికి కూడా వేర్వేరుగా భూమిని కేటాయించారు. ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. గుజరాత్ రాజధాని నగరంగా ఉన్న గాంధీనగర్‌లో 205 చదరపు కిలోమీటర్ల మేర ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. భూమిని వివిధ భవిష్యత్తు అవసరాలకోసం పలు విభాగాలుగా కేటాయింపులు చేశారు. గాంధీనగర్ చుట్టూ భారీ భూభాగాన్ని రాజధాని టెరిటోరియల్ ప్రాంతంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఛండీఘర్: పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధాని నగరంగా ఉన్న ఛండీఘర్ నగరం 114 చరదపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. రాజధానికేం కావాలి? రాజధానికి తక్షణావసరాలైన పరిపాలన భవనాలే కాదు. భవిష్యత్తు అవసరాలూ ఉంటాయి. అసెంబ్లీ, సచివాల యం, హైకోర్టు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు, ప్రభుత్వ డెరైక్టరేట్లు, కమిషనరేట్లు, కార్పొరేషన్ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు, అమ్యూజ్మెంటు పార్కులు, ధియేటర్లు, సమావేశ మందిరాలు, శిక్షణ కేం ద్రాలు, పరిశోధన కేంద్రాలు, విశాలమైన రోడ్లు, పచ్చదనం కోసం ఉద్యానవనాలు, చక్కని డ్రెయినేజి వ్యవస్థ ఇలా అనేకం ఉండాలి. పాలన భవనాలు మధ్యలో కేంద్రీకృతమైతే రాకపోకలు సాగించేందుకు విశాలమైన రహదారులుండాలి. 960 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన హైదరాబాద్‌లో ఉదాహరణకు బేగంపేట మెయిన్ రోడ్నే చూస్తే నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయి నరకం కనిపిస్తోంది. అం దుకని ప్రణాళికా బద్ధంగా నిర్మించే కొత్త రాజధానిలోనైనా ఇలాంటివన్నీ ముందే ఊహించి... రోడ్డుకిరువైపులా పదేసి లేన్లుండేలా రహదారుల నిర్మాణం జరగాలి. అలాగైతేనే కార్లకు 5 లేన్లు, బస్సులకు 2 లేన్లు, బైక్‌లకు మరో లేను... పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సైకిళ్లకు మరో లేను కేటాయించడానికి వీలవుతుంది. ఈ రోడ్లపై గ్రీన్ జోన్లు ఇతరత్రా అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే పాలన భవనాలకు అటు 6, ఇటు 6 కిలోమీటర్ల మేర... అంటే 12 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. పొడవు / వెడల్పు చూస్తే 12/12 మొత్తం 144 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. 144 చదరపు కిలోమీటర్లలో విస్తరించడానికి నిపుణుల అంచనాల మేరకు కనీసం 30 వేల ఎకరాలు అవసరం. మరి ప్రభుత్వ పెద్దలు అధికారిక లీకులిస్తున్న ప్రాంతాల్లో ఇంత స్థాయిలో భూమి అందుబాటులో ఉందా? ఆ ప్రాంతాల్లో సేకరణ సాధ్యమా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రావటం అసాధ్యం. -
రిజిస్ట్రేషన్ల రాబడి ఢమాల్
- పెరిగిన భూముల ధరలు - తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య - భారీగా పడిపోయిన ఆదాయం - రాజధాని ప్రకటన కోసం ఎదురు చూపులు ఏలూరు : రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినప్పటి నుంచి జిల్లాలో భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన పూర్తి కావటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. దానికి తోడు జిల్లాకు సమీపంలో రాజధాని ఏర్పాటు కానుందనే ఊహాగానాలు భూముల ధరల బూమ్‌కు కారణమయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచే వ్యవసాయ, ఇతర భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. జిల్లా సరిహద్దులోని హనుమాన్ జంక్షన్లో ఎకరం భూమి విలువ రూ. కోటి పై మాటే. వట్లూర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గ్రామాల్లోను ఎకరం రూ.75 లక్షలు పలుకుతోంది. ధరలు విపరీతంగా పెరగటంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. జిల్లాలో భూములకు సంబంధించి నెలకు సగటున 12 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ సంఖ్య ఏడు వేలు కూడా దాటటం లేదు. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్, మే, జూన్ నెలలు)కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ భీమవరం జిల్లా పరిధిలో రూ.42 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.27 కోట్లే సమకూరింది. ఏలూరు జిల్లా కార్యాలయం పరిధిలో రూ.27 కోట్లు లక్ష్యం కాగా రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది లక్ష్యంలో 57 శాతమే ఆదాయం 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం సుమారు 1.20 లక్షల భూముల క్రయవిక్రయాల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయని అంచనా కాగా 80 వేలు మాత్రం జరిగాయి. మొత్తం రూ.333 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.190 కోట్లు సమకూరాయి. లక్ష్యంలో 57 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ పరిస్థితికి రాష్ట్ర విభజనే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. వారంలో భూముల ప్రభుత్వ విలువ పెంపు వచ్చే నెలలో పట్టణాల్లో భూముల ప్రభుత్వ విలువను రిజిస్ట్రేషన్‌శాఖ సవరించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విలువ , బహిరంగ మార్కెట్ల్లో వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని భూముల విలువను 30 శాతం పెంచనున్నారు. దీనిపై రిజిస్ట్రేషన్‌శాఖ సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపింది. వారం రోజుల్లో విలువ పెంపు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాజధాని వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయని రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. -
రూ.కోట్ల భూములు హాంఫట్
యాచారం, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండడంతో మండలంలోని పలు గ్రామాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే అదనుగా గ్రామ కంఠం, గైరాన్ భూములను అక్రమార్కులు ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా భూములకు సర్వే చేయకపోవడం, హద్దులు గుర్తించకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. అధికారులతో రాజకీయ నాయకులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విలువచేసే భూములను అందినకాడికి అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అడిగే అధికారులే లేకుండాపోయారు. మండలంలోని చాలా గ్రామాల్లో గ్రామ కంఠం, గైరాన్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వీటికి సర్వేలు చేసి హద్దులు గుర్తించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు అధికారులతో మొర పెట్టుకున్నా స్పందించని దుస్థితి నెలకొంది. దీంతో కబ్జాదారులు వాటిని తోచిన కాడికి అమ్ముకుంటున్నారు. భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుజువులివిగో.. నెలరోజుల క్రితం తాడిపర్తిలో రూ.లక్షల విలువచేసే భూమి కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ నారాయణరెడ్డి సమక్షంలో ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ గ్రామస్తుల్ని సమావేశపర్చారు. పంచాయతీకి రూ.60 వేల ఆదాయం వచ్చేలా చేశారు. మల్కీజ్‌గూడలో సర్వే నంబరు 167లో కబ్జాకు గురైన గైరాన్ భూమిని గ్రామ సర్పంచ్ మల్లేష్ పరిరక్షించారు. ప్రస్తుతం ఈ భూమిలో కృష్ణాజలాల సంపును నిర్మిస్తున్నారు. పైన పేర్కొన్న రెండు గ్రామాల్లోనే కాకుండా మిగతా 18 గ్రామాల్లోనూ రూ.కోట్ల విలువైన గ్రామకంఠం, గైరాన్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి విలువైన భూములను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అన్యాక్రాంత మైన భూముల వివరాలివీ.. మాల్ గ్రామంలోని సర్వే నంబరు 640లో దాదాపు రూ. 15 కోట్లు విలువ చేసే 20 ఎకరాల భూములున్నాయి. చుట్టూ హద్దులు లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. నక్కర్తమేడిపల్లి- తక్కళ్లపల్లి దారిలో అర ఎకరం గ్రామకంఠం భూమి ఉంది. కానీ సర్వే చేసి హద్దులు గుర్తించలేదు. కుర్మిద్దలో ఎకరానికిపైగా గ్రామకంఠం భూమి ఉంది. సర్వే చేసి గుర్తించకపోవడంతో గ్రామస్తు ల మధ్య తరచూ ఘర్ణణలు జరుగుతున్నాయి. కేసులు నమోదైనా అధికారుల్లో చలనం లేదు. భూముల పరిరక్షణకు కృషి చేయడం లేదు. చింతుల్లలో ఎకరానికిపైగా గ్రామకంఠం భూమితో పాటు సర్వే నంబర్ 1, 2లలో రెండు ఎకరాల గైరాన్ భూములున్నాయి. గ్రామ పడమటి దిక్కున పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని పంపిణీ చేయకపోవడంతో అన్యాక్రాంతమవుతోంది. మల్కీజ్‌గూడలో సర్వే నంబర్ 167లో సర్వే చేస్తే మరింత గైరాన్ భూమి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు సర్వే చేయకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. నల్లవెల్లిలో రెండెకరాలకుపైగా గ్రామకంఠం భూమి ఉంది. వీటికి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకుండాపోయింది. నందివనపర్తి, చింతపట్ల, గునుగల్, గడ్డమల్లయ్యగూడ తదితర గ్రామాల్లోనూ విలువైన గ్రామ కంఠం, గైరాన్ భూములున్నాయి. వాటిని గుర్తించి, హద్దులు ఏర్పాటు చేసి రక్షించే చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. -
‘ఈ-సిటీ’లో భూమి ధరపై పీటముడి!
ప్లాంట్ల ఏర్పాటుకు 63 కంపెనీల ప్రతిపాదన రెండు దశల్లో రూ.1,365 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన ఎకరా రూ.35 లక్షలు చెబుతున్న ఏపీఐఐసీ రూ.20 లక్షలకు ఇవ్వకుంటే కష్టమంటున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షరాలా అరవై మూడు కంపెనీలు 248 ఎకరాలు కావాలంటున్నాయి. ఇస్తే రెండు దశల్లో రూ.1,365 కోట్లు పెట్టుబడి పెడతామంటూ ప్రతిపాదిస్తున్నాయి. అయితే భూమి ధరపై ఏపీఐఐసీకి- ఈ కంపెనీలకు మధ్య అవగాహన కుదిరేలా కనిపించటం లేదు. అదే జరిగితే.. మహేశ్వరంలో ప్రతిపాదించిన ఈ-సిటీలోకి ఇప్పుడిప్పుడే కంపెనీలు రావటమూ కష్టమే!! రాష్ట్రంలో అనిశ్చితి దృష్ట్యా కంపెనీలు రావటమే కష్టమవుతున్న తరుణంలో ఏపీఐఐసీ ఇలా మంకుపట్టు పట్టి కూర్చోవటం సరికాదనే వాదనలు వినిపిస్తుండగా... పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని కంపెనీలు ఈ రకమైన బేరాలకు దిగటం కూడా సరికాదని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కథేంటో మీరూ చూడండి... మహేశ్వరం దగ్గరి ఫ్యాబ్ సిటీలోని 602 ఎకరాల్లో ‘ఈ-సిటీ’ పేరిట ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ఏఏ ప్రోత్సాహకాలిస్తారో చెబుతూ ఏపీఐఐసీ కొన్ని సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమల సంఘానికి (ఎలియాప్) చెందిన 63 కంపెనీలు ఏపీఐఐసీకి ప్రతిపాదనలు పంపాయి. కనిష్టంగా రూ. కోటి, గరిష్టంగా రూ.350 కోట్ల వరకూ పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఈ కంపెనీలు... రెండుదశల్లో మొత్తం రూ.1,326 కోట్లు పెట్టుబడి పెడతామన్నాయి. వీటివల్ల ప్రత్యక్షంగా 34,200 మందికి ఉపాధి కలుగుతుందని కూడా పేర్కొన్నాయి. పరిశ్రమలన్నీ ఒకేచోట వస్తాయని, పెపైచ్చు ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్, శంషాబాద్ విమానాశ్రయం వంటివి అదనపు సౌలభ్యాన్నిస్తాయని భావించటంతో కంపెనీలు ఈ-సిటీపై మొగ్గు చూపుతున్నాయి. కాకుంటే గతంలో ఇక్కడ ఎకరాకు రూ. 15 లక్షల ధర నిర్ణయించిన ఏపీఐఐసీ.. ఇప్పుడు ధరలు పెరిగాయంటూ ఎకరానికి రూ.35 లక్షలు చెబుతోంది. ఎలియాప్ మాత్రం ఎకరాకు రూ.20 లక్షలకు మించి చెల్లించలేమంటోంది. ఏపీఐఐసీ దిగిరాని పక్షంలో తమకు వేరే రాష్ట్రాలకు వెళ్లటం తప్ప మార్గాంతరం లేదంటోంది. ఇతర రాష్ట్రాల్లో ధరలెంత? ఇతర రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీలకు రాయితీలతో పాటు తక్కువ ధరకే స్థలాన్నిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘‘దేవనహళ్లిలో 3 వేల ఎకరాల్లో కర్ణాటక ప్రభుత్వం ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎకరా ధర రూ. 5 లక్షలు. హిమాచల్‌ప్రదేశ్‌లో సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ లేదు. సేల్స్ టాక్స్ ఒక్క శాతం మాత్రమే. మన రాష్ట్రంలోనైతే ఎక్సయిజ్ సుంకం 12.5 శాతం, సీఎస్టీ 2 శాతం, వ్యాట్ 5 శాతం చెల్లించాలి. వీటన్నిటికీ తోడు ఈ-సిటీ డెవలప్మెంట్ ఖర్చుల్లో 20 శాతాన్ని కంపెనీలే భరించాలంటున్నారు. ఇవన్నీ తలకుమించిన భారంగా మారుతున్నాయి’’ అని ఎలియాప్ ఎండీ ఎన్.శివప్రసాద్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. గతంలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు శామ్సంగ్, డెల్, నోకియా ముందుకొచ్చినా... స్థల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో అవి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ప్రతిపాదన లిచ్చిన కంపెనీల్లో కొన్ని... ల్యాంపెక్స్ ఎలక్ట్రానిక్స్: 2 దశల్లో రూ.350 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఎల్సీడీ మాడ్యూళ్లు, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌ను తయారీ. లింక్‌వెల్ టెలీసిస్టమ్స్: రూ.175 కోట్లు పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇది కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్, ఎనర్జీ మీటర్లు తయారు చేస్తుంది. సులక్షణ సర్క్యూట్: రూ.87.5 కోట్లతో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ప్లాంట్ ఎలికో: రూ.43.75 కోట్లతో టెస్టింగ్ పరికరాలను తయారు చేస్తుంది. ఈసీఐఎల్ రాపిస్కన్: రూ.43.75 కోట్లతో ఎక్స్-రే, బ్యాగేజ్ స్కానర్స్ ప్లాంటును ఏర్పాటు చేస్తానంటోంది. -
పేలుతున్న రియల్ గన్..
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : భూముల ధరలు ఆకాశాన్నంటుతుండ డంతో వాటిని సొంతం చేసుకునేందుకు రియల్ఎస్టేట్ వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. భూములను సొంతం చేసుకునే క్రమంలో హత్యలు చేసేందుకు వెనుకాడడం లేదు. హైదరాబాద్, నల్గొండలో కొనసాగుతున్న తుపాకీ సంస్కృతి తాజా హత్యతో జిల్లాకు పాకినట్లయింది. ఇప్పటి వరకు జిల్లాలో తుపాకులతో రియల్ ఎస్టేల్ వ్యాపారులు బెదిరించిన సంఘటనలు మాత్రమే చోటుచేసుకోగా శుక్రవారం లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీలో ఏకంగా తుపాకీతో ఓ రియల్టర్‌ను హత్యచేసిన సంఘటన సంచలనం సృష్టించింది. నగరంతోపాటు జిల్లాలో డివిజన్ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం పుం జుకుంది. భూముల కోసం సంగెం మండలం పల్లారుగూడలో జరిగిన హత్య ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ తరహాలో జరిగిన ఈ హత్యలో సొంత తమ్ముడిని అన్న హత్యచేశాడు. వేటకొడవళ్లు, స్కోడా కారు ఉపయోగించి చేసిన ఈ హత్యలో కోట్లాది రూపాయల భూ ముల వ్యవహారం దాగి ఉంది. ఆరేళ్ల క్రితం హసన్‌పర్తిలో ఒక అడ్వకేట్ తన సొంత భూముల వ్యవహా రంలో హత్యకు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభం లో హన్మకొండ బ స్టాండు సమీపంలో భూపాల్పల్లి ఆర్డబ్ల్యూఎస్లోపనిచేస్తున్న డీఈ బొడ్డు రాజేందర్ భూ తగాదాల కారణంగా హత్యకు గురయ్యాడు. పక్కరాష్ట్రాల నుంచి తుపాకులు.. అనధికారికంగా జిల్లాలో తుపాకులు వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లిక్కర్ వ్యాపారులు, గంజాయి వ్యాపారులు, చివరకు రౌడీషీటర్ల చేతుల్లో కూడా తుపాకులు ఉన్నట్లు గతంలో పోలీసు శాఖ గుర్తించింది. ఆ మేరకు చర్యలు చేపట్టినా ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. బీహార్, పశ్చిమబెంగాల్(కలకత్తా), చత్తీస్‌గఢ్‌లోని ధన్‌బాగ్, రామ్‌గఢ్ నుంచి జిల్లాకు తుపాకులు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. కంట్రీమేడ్, మిషన్మేడ్ పేర్లతో రూ.15,000 నుంచి 35,000 వరకు ఖరీదు చేస్తున్నారు. నగరంలో గతంలో కొందరు రియల్టర్లు రివాల్వర్లను వాడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే వారు కేవలం ఎదుటి వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి మాత్రమే వాడినట్లు సమాచారం ఉంది. ఇంటి పై కప్పును పిస్తొల్‌తో షూట్చేయడం, బహిరంగ ప్రదేశాల్లో తూటా పేల్చడం వంటి సంఘటనలు గతంలో నగరంలో జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఇలా తుపాకులను జిల్లాకు తరలిస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచ, ఆదిలాబాద్ జిల్లా వాంఖడే, వరంగల్ జిల్లా కేంద్రంలో తుపాకులతో పట్టుబడిన సంఘటనలు ఐదు వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో లేని తుపాకీ హత్యల సంస్కృతికి నెల్లుట్ల ఘటనతో తెరలేపినట్లయింది. పోలీసు వర్గాలు అప్రమత్తం కాకపోతే ఈ సంస్కృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది. -
భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో భూముల ధరలు సోమవారం నుంచి భారీగా పెరగనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శక విలువలు ఆ రోజు నుంచి అమలులోకి రానున్నాయి. నగరంలో భూములకు భారీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్గదర్శక విలువ వంద శాతం పెరిగింది. తక్కువ డిమాండ్ ఉన్న చోట్ల 30 నుంచి 40 శాతం ఎక్కువైంది. మురికివాడల్లో పెరుగుదల 11 శాతం వరకు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలు, కొత్త లేఔట్లు ఏర్పడిన చోట్ల పెరుగుదల ఏమేరకు ఉంటుందో అంతుబట్టకుండా ఉంది. నగరంలో ప్రముఖ వాణిజ్య ప్రాంతాలైన ఇన్ఫాంట్రీ రోడ్డులో నివేశనం చదరపు అడుగు ధరను రూ.18 వేలుగా నిర్ణయించారు. కమర్షియల్ స్ట్రీట్‌లో రూ.16,500, కేజీ రోడ్డులో రూ.15,400, సదాశివ న గరలో రూ.14 వేలు కానుంది. నగరంలో అత్యధిక ధరలు పలుకుతున్న ప్రాంతాలివే. ఈ నేపథ్యంలో గత గురువారం రాత్రి పది గంటల వరకు నగరంలోనిపలు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. శుక్రవారం రంజాన్, తర్వాత రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆఖరు రోజు రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ రద్దీగా మారాయి. సోమవారం ఈ ఛార్జీలు రెండింతలు కావచ్చనే సందేహంతో అనేక మంది రిజిస్ట్రేషన్లను ఆలోగానే పూర్తి చేసేశారు. ఈ నెల ఐదో తేదీ వరకు ఆషాఢం కావడంతో చాలా మంది భూముల రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకున్నారు. తర్వాత మంగళవారం పోను రెండు రోజులే మిగిలి ఉండడంతో పోటా పోటీగా పని కానిచ్చారు. దీని వల్ల రాత్రుల్లో కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేశాయి. మొత్తం మీద భూముల మార్గదర్శక విలువ 11 శాతం నుంచి వంద శాతం వ రకు పెరిగాయి. గత నెల 20న బెంగళూరు నగర, గ్రామీణ, రామనగర జిల్లాల్లో భూముల తాత్కాలిక మార్గదర్శక విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించడం ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలను కోరింది. అనంతరం స్వల్ప మార్పులతో తుది మార్గదర్శక విలువలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. సోమవారం తుది జాబితా విడుదలవుతుంది.