రియల్ రాజధాని
► ఎవరి కోసం ఇది?
► భవిష్యత్ తరాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసమన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అనుమానాలు
► భూసేకరణ సహా అన్నిటిపైనా కొరవడిన స్పష్టత.. ప్రాంతాల పేర్లు మారుస్తూ లీకులు; ప్రకటనలు
► ధరలకు రెక్కలతో ఇప్పటికే రైతుల చేతుల్లోంచి జారిపోయిన భూమి
► కనీసం 30వేల ఎకరాలుంటే ప్రణాళికాబద్ధ రాజధాని
► చుక్కల్లో ధరలతో ఆ స్థాయి సేకరణ అసాధ్యం
► భూముల లభ్యత సులభమైతేనే నయమంటున్న నిపుణులు..
► అలాగైతేనే బతకడానికొచ్చే సామాన్యులకు చోటు
సాక్షి, హైదరాబాద్: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే ఇపుడు ఆంధ్రప్రదేశ్ యావత్తూ రాబోయే రాజధాని చుట్టూరా తిరుగుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే ప్రభుత్వమే అలా తిప్పుతోంది. రాజధాని అనేది ప్రజలకోసమని, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా, వారి భవిష్యత్ నివాసానికి అనువైనదిగా ఉండాలన్న ధ్యాసే విస్మరించి... రాజధానిని భూముల ధరలు పెంచుకోవడానికి పనికివచ్చే సాధనంలా చూస్తోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ముందే భారీగా భూములు కొనిపెట్టుకున్న రాజకీయ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోంది. విజయవాడ- గుంటూరు మధ్యనంటూ ఒకసారి... అమరావతి దగ్గరంటూ మరోసారి... వీజీటీఎం పరిధిలోనంటూ ఇంకోసారి... నూజివీడు, వినుకొండ ప్రాంతాల్లోనంటూ ఇప్పుడు... ఇలా రకరకాలుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ప్రభుత్వ పెద్దలే పలు లీకులు ఇచ్చారు.
‘విజయవాడ-గుంటూరు మధ్య అయితేనే రాష్ట్రం మధ్యలో ఉన్నట్టు. అక్కడైతేనే అన్ని ప్రాం తాల వారికీ అందుబాటులో ఉంటుంది’ అని శివరామకృష్ణన్ కమిటీ పర్యటనకు ముందే చంద్రబాబు ప్రకటించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు సైతం తరచూ రాజధానిపై ప్రకటనలు చేస్తున్నారు. ఇలా ప్రకటనలిచ్చిన ప్రతిసారీ అక్కడ భారీ ఎత్తున భూములు చేతులు మారుతూ అగ్రిమెంట్లు చేసుకోవటం తెలియనిదేమీ కాదు. నిజానికి ఇలా ప్రభుత్వం లీకులిచ్చిన ప్రాంతాలన్నిటా భూమి ఇప్పటికే రైతుల చేతుల్లోంచి నేతలు, వ్యాపారులు, దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇపుడు ధర పెరిగినా... ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి 40 శాతమో, 50 శాతమో భూ యజమానులకిచ్చినా బాగుపడేది ఈ దళారులు, రియల్ వ్యాపారులే తప్ప రైతులు కారన్నది వాస్తవం.
భూ సేకరణ సాధ్యమయ్యేనా?
ఇపుడున్న ధరవరల్లో భూ సేకరణ సాధ్యం కాదని, ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరువగా ఉండే ప్రాంతమైతేనే రాజధానికి బాగుంటుందని శివరామకృష్ణన్ కమిటీ సైతం పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆ స్థాయిలో లేవు. ప్రయివేటు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసి అందులో రెతులకు భాగస్వామ్యం కల్పిస్తామని, ‘ల్యాండ్ పూలింగ్ చేస్తామ’ని ప్రభుత్వం చెబుతోంది. 60:40, 70:30లో రైతులకు వాటాలిస్తామంటోంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటే 60 నుంచి 65 శాతం భూమిని రోడ్లు, గ్రీనరీ తదతరాలకు వదిలిపెట్టాలి.
ఇలాచేస్తే మిగిలే 35 శాతంలో భూ యజమానులకు దక్కేదెంతన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ వారి చేతికి కొంత భూమి వచ్చినా... ఇప్పటికే భారీ ధరల వద్ద కొనుగోలు చేసి... దాన్లో ప్రభుత్వానికి 60 శాతమో, 70 శాతమో ఇచ్చేయగా మిగిలిన భూమిని వారేం చేస్తారు? అందులో వారు కట్టే భవనాలు గానీ, ఇళ్లు గానీ ఎవరికి అందుబాటులో ఉంటాయి? వాటి ధరలు ఏ స్థాయిలో ఉంటాయి? రాజధానిలో బతుకుదామనో, ఉద్యోగాల కోసమో వచ్చినవారు వీటిని భరించగలరా? ప్రభుత్వం ఈ ఆలోచనలన్నీ మానేసి కేవలం కొందరు వ్యాపారులు, నాయకులకు ప్రయోజనం చేకూర్చడానికే తానున్నట్టు వ్యవహరిస్తుంటే ఏమనుకోవాలి? అసలు ప్రభుత్వ భూములో, డీ నోటిఫై చేసేందుకు వీలుగా అటవీ భూములో భారీగా ఉన్న ప్రాంతం వైపు ప్రభుత్వం ఎందుకు చూడటం లేదు? అక్కడైతే భూములపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది కనక భవిష్యత్‌లో పేదలకు సైతం ప్రభుత్వమే అందుబాటు ధరల్లో ఇళ్లు అందించే అవకాశం ఉంటుందిగా? రాజధాని ఎక్కడనేది ఇక్కడ ప్రశ్నే కాదు. కానీ అందరికీ చేరువలో ఉండటంతో పాటు అందరికీ బతకడానికి అందుబాటులో ఉండటం కూడా ముఖ్యమన్న సంగతి మన ప్రభుత్వం ఎందుకు మరిచిపోతోంది? ఇదే అంశంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏది ‘రియల్’ రాజధాని?
రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యుల కమిటీని వేసింది. అది దేశవిదేశాల్లోని పలు ప్రాంతాలను సందర్శించనుంది. అహ్మదాబాద్ (గుజరాత్), నయా రాయపూర్ (చత్తీస్‌ఘర్), భువనేశ్వర్ (ఒరిస్సా) ఛండీఘడ్‌లతో పాటు విదేశాల్లోనూ పర్యటించనుంది. మరి ఆయా రాజధానులు మనలా రియల్ ఎస్టేట్ నీడలో నిర్మితమయ్యాయో, ప్రభుత్వ భూము ల్లో ప్రణాళికాబద్ధంగా నిర్మితమయ్యాయో చూద్దాం....
రాష్ట్రాన్ని సింగపూర్‌ను చేస్తానంటోంది ప్రభుత్వం. కానీ సింగపూర్ 714.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమైంది. 1960లలో 581 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ఈ పట్టణం ఇపుడు 723.2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. 2033 నాటికి మరో 100 చదరపుకిలోమీటర్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాక ఛత్తీస్‌గఢ్ తన కొత్త రాజధానిని నయా రాయపూర్ పేరిట నిర్మించుకుంది. చత్తీస్‌ఘడ్ రాజధానిగా నయా రాయపూర్ 8 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమైంది. రాజధాని నిర్మాణం కోసం 41 గ్రామాల ప్రజలను అక్కడినుంచి తరలించారు. మొత్తం భూమి లో సగం రోడ్లు, పార్కులు, ప్రజోపయోగం, నీటి సదుపాయాల ఏర్పాటు, గ్రీన్‌బెల్టుల కోసం వినియోగించారు. 23 శాతం భూమిని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆడిటోరియంలకు కేటాయించారు. 30 శాతం భూమిని గృహోపయోగం, వాణిజ్యావసరాలకు కేటాయిం చారు.
ఒరిస్సాల్లో ఎన్ని వెనకబడిన జిల్లాలున్నా రాజధాని భువనేశ్వర్ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్, పంజాబ్-హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగ ఢ్ కూడా ప్రత్యేకమైనవే...భువనేశ్వర్ 393.57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 1948లోనే ఈ నగరానికి ప్రణాళికలు వేశారు. విద్యాసంస్థలు, షాపింగ్ కాంపెక్సులు, వైద్యశాలలు, ఆటస్థలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, అసెంబ్లీ, రాజభవన్, సచివాలయంతోపాటు ప్రయివేటు గృహోపయోగానికి కూడా వేర్వేరుగా భూమిని కేటాయించారు. ఆ మేరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు.
గుజరాత్ రాజధాని నగరంగా ఉన్న గాంధీనగర్లో 205 చదరపు కిలోమీటర్ల మేర ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. భూమిని వివిధ భవిష్యత్తు అవసరాలకోసం పలు విభాగాలుగా కేటాయింపులు చేశారు. గాంధీనగర్ చుట్టూ భారీ భూభాగాన్ని రాజధాని టెరిటోరియల్ ప్రాంతంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఛండీఘర్: పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధాని నగరంగా ఉన్న ఛండీఘర్ నగరం 114 చరదపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
రాజధానికేం కావాలి?
రాజధానికి తక్షణావసరాలైన పరిపాలన భవనాలే కాదు. భవిష్యత్తు అవసరాలూ ఉంటాయి. అసెంబ్లీ, సచివాల యం, హైకోర్టు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు, ప్రభుత్వ డెరైక్టరేట్లు, కమిషనరేట్లు, కార్పొరేషన్ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు, అమ్యూజ్‌మెంటు పార్కులు, ధియేటర్లు, సమావేశ మందిరాలు, శిక్షణ కేం ద్రాలు, పరిశోధన కేంద్రాలు, విశాలమైన రోడ్లు, పచ్చదనం కోసం ఉద్యానవనాలు, చక్కని డ్రెయినేజి వ్యవస్థ ఇలా అనేకం ఉండాలి. పాలన భవనాలు మధ్యలో కేంద్రీకృతమైతే రాకపోకలు సాగించేందుకు విశాలమైన రహదారులుండాలి. 960 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన హైదరాబాద్‌లో ఉదాహరణకు బేగంపేట మెయిన్ రోడ్‌నే చూస్తే నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయి నరకం కనిపిస్తోంది. అం దుకని ప్రణాళికా బద్ధంగా నిర్మించే కొత్త రాజధానిలోనైనా ఇలాంటివన్నీ ముందే ఊహించి... రోడ్డుకిరువైపులా పదేసి లేన్లుండేలా రహదారుల నిర్మాణం జరగాలి.
అలాగైతేనే కార్లకు 5 లేన్లు, బస్సులకు 2 లేన్లు, బైక్‌లకు మరో లేను... పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సైకిళ్లకు మరో లేను కేటాయించడానికి వీలవుతుంది. ఈ రోడ్లపై గ్రీన్ జోన్లు ఇతరత్రా అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే పాలన భవనాలకు అటు 6, ఇటు 6 కిలోమీటర్ల మేర... అంటే 12 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. పొడవు / వెడల్పు చూస్తే 12/12 మొత్తం 144 చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. 144 చదరపు కిలోమీటర్లలో విస్తరించడానికి నిపుణుల అంచనాల మేరకు కనీసం 30 వేల ఎకరాలు అవసరం. మరి ప్రభుత్వ పెద్దలు అధికారిక లీకులిస్తున్న ప్రాంతాల్లో ఇంత స్థాయిలో భూమి అందుబాటులో ఉందా? ఆ ప్రాంతాల్లో సేకరణ సాధ్యమా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రావటం అసాధ్యం.