సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి వీల్లేదని రాజధాని రైతులు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని మురికివాడగా చేసి, తద్వారా రాజధానిని అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చెప్పారు.
ఇళ్లస్థలాలు ఇస్తే తమప్రాంత ప్రజలకే ఇవ్వాలన్నారు. ల్యాండ్‌పూలింగ్ కింద రైతులిచ్చిన భూముల్లో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారం రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను ప్లాట్లుగా అభివృద్ధి చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ఆ ప్లాట్లను తిరిగి రైతులకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రైతుల భూములను రాజధాని అభివృద్ధి కోసమే ఉపయోగించాలి తప్ప ఇతర అవసరాలకు వినియోగించరాదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఇతరులకు ఇళ్లస్థలాలు ఇవ్వడమంటే మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా వ్యవహరించడమేనని, ఇలా చేసే అధికారం సీఆర్‌డీఏకు, ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. రైతుల తరఫున ఆదినారాయణరావు వాదనలను పూర్తిచేయడంతో ప్రభుత్వ వాదనల నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించ డాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతుపరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం విచారించింది.
ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం..
రాజధాని ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లస్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీచేసిన జీవో 107ను సవాలు చేస్తూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం సవరణ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో జీవో 107ను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయంటూ ప్రభుత్వం ఓ మెమో దాఖలు చేసింది.
ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు ఈ మెమోను వ్యతిరేకించారు. తమ వ్యాజ్యాలు నిరర్థకం కావని, అవి మనుగడలోనే ఉంటాయని తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఆ వ్యాజ్యాలు ఏ విధంగా మనుగడలో ఉంటాయో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment