లక్ష కోట్లు ఒకచోటే వెచ్చిస్తే..  మిగతా ప్రాంతాల సంగతేంటి? | AP Govt Arguments Beginning In AP Capital Cases | Sakshi
Sakshi News home page

లక్ష కోట్లు ఒకచోటే వెచ్చిస్తే..  మిగతా ప్రాంతాల సంగతేంటి?

Published Wed, Dec 9 2020 4:41 AM | Last Updated on Wed, Dec 9 2020 6:21 AM

AP Govt Arguments Beginning In AP Capital Cases - Sakshi

సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంత భారీ మొత్తాన్ని కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. కేవలం ఒక ప్రాంతం కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని చెప్పారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తన వాదనలను ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. 

శానసవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదు
‘మూడు రాజధానులు ఏర్పాటు విషయంలో చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంది. ప్రజల సంక్షేమం కోసమే శాసనవ్యవస్థ పనిచేస్తుంటుంది. అందువల్ల శానసవ్యవస్థకు ఎలాంటి దురుద్దేశాలను ఆపాదించడానికి వీల్లేదు. శాసన వ్యవస్థ పరిధిలోని వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదు. రాజ్యాంగ మౌలిక çసూత్రాలకు విరుద్ధంగా న్యాయస్థానాలు వ్యవహరించరాదు. మూడు రాజధానుల ఏర్పాటు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని వ్యవహారం. కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధించజాలరు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే, వాటిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పాలన వికేంద్రీకరణ ద్వారా అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది.’ అని దవే హైకోర్టుకు నివేదించారు. 

నిజమైన రైతులకు ఎక్కడా అన్యాయం చేయడం లేదు
‘రాజధానిని మారిస్తే, తమ ఆస్తుల విలువ తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్న వ్యక్తులే న్యాయస్థానాలను ఆశ్రయించారు. నిజమైన రైతులకు ప్రభుత్వం ఎక్కడా అన్యాయం చేయడం లేదు. గత చట్టాల కంటే ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాల వల్ల వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. నామమాత్రపు ధరలకు భూములు కొని, కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చునని ఆశపడ్డ వారే ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ అయినప్పటికీ, అది ఇప్పటికీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రజలంతా అహ్మదాబాద్‌ వైపే మొగ్గు చూపుతారు. గాంధీనగర్‌ అభివృద్ధికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఒక ప్రాంతం రాజధాని అయినంత మాత్రాన అది అభివృద్ధి చెందుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదనేందుకు గాంధీనగర్‌ ప్రత్యక్ష ఉదాహరణ..’ అని దవే వివరించారు.

మూడు రాజధానులు ఆషామాషీ నిర్ణయం కాదు
‘కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని భూములు దేశంలోనే అత్యంత సారవంతమైన భూములు. ఇలాంటి భూములను రాజధాని కోసం తీసుకోవడం వివేకవంతమైన చర్య కాదు. అలా తీసుకోవడం ద్వారా గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది. లక్ష కోట్ల రూపాయలను ఓ రాజధానిపై పెట్టడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంది. ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ బకాయిలను చెల్లించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంది. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చాలా హడావుడిగా నిర్ణయం తీసుకుంది. కానీ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. విభిన్న రంగాల నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి, ఆ కమిటీల సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకుంది..’ అని దవే వివరించారు. సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement