Chandrababu Taken Lands From Farmers Were Used For Real Estate, 30 ఏళ్ల బాబు సినిమా 6 నెలల్లో ఎలా సాధ్యం? - Sakshi
Sakshi News home page

30 ఏళ్ల బాబు సినిమా 6 నెలల్లో ఎలా సాధ్యం?

Published Fri, Mar 4 2022 2:58 AM | Last Updated on Fri, Mar 4 2022 10:32 AM

Chandrababu taken Lands from farmers were used for real estate - Sakshi

గత చంద్రబాబు ప్రభుత్వం ఒక్క జోన్‌ను కూడా మోడల్‌గా అభివృద్ధి చేయలేదు. కనీసం రోడ్లు కూడా వేయక పోవడంతో మెజారిటీ రైతులు విసిగిపోయి, తమకు తిరిగి ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ముందుకు రాలేదు. 63 వేల ప్లాట్లను 28 వేల మంది రైతులు రిజిçస్టర్‌ చేయించుకోవాల్సి ఉండగా, చంద్రబాబు దిగిపోయే నాటికి 28 వేల ప్లాట్లను మాత్రమే సంబంధిత రైతులు రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇప్పటికీ 20 వేలకుపైగా ప్లాట్లను రైతులు రిజిçస్టర్‌ చేయించుకోలేదు.  

సాక్షి, అమరావతి: ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజలకు ‘సినిమా గ్రాఫిక్స్‌’ చూపించడం మినహా ఏమీ చేయలేదు. రాజధాని భూ సమీకరణ ఒప్పందం ప్రకారం రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక సార్లు హామీలు ఇవ్వడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. 2019లో తాను అధికారం కోల్పోయేనాటికి ఒక్క ప్లాటును కూడా అభివృద్ధి చేయలేదు. భూములు సేకరించిన తర్వాత మూడేళ్లు రాజధాని రైతులను గాలికి వదిలేశారు. వాటిని అభివృద్ధి చేయడానికి దశాబ్దాలు పడుతుందని, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయని పార్టీ సమావేశాల్లో చెప్పేవారు. ఇప్పుడు అవే ప్లాట్లను మూడు నెలల్లో అభివృద్ధి చేసి, రైతులకు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చంద్రబాబు ప్రభుత్వం చేయలేక చేతులెత్తేసిన పనిని ఇప్పుడు ఆగమేఘాల మీద చేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో వందల ఎకరాలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టిన గత చంద్రబాబు ప్రభుత్వం.. ఒప్పందం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు. భూములిచ్చిన రైతులు త్యాగమూర్తులని కీర్తించడమే తప్ప వారి లేఅవుట్లను మాత్రం గాలికి వదిలేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే భూములు తీసుకున్న మూడున్నరేళ్ల తర్వాత కూడా రైతులకు భౌతికంగా ప్లాట్లు అప్పగించలేదు. కేవలం కాగితాల్లోనే పంపిణీ చేశారు.  


రైతుల ప్లాట్లతో ‘రియల్‌’ వ్యాపారం 
రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆ భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. తమకిస్తామని చెప్పిన ప్లాట్లలో పిచ్చిమొక్కలు మొలిపించి, బీళ్లుగా మార్చిన ప్రభుత్వం.. వాటి పక్కనే అపార్టుమెంట్లు నిర్మించి వేరే వాళ్లకి అమ్మకం ఎంత వరకు సమంజసమని అప్పట్లో రైతులు నెత్తీనోరూ కొట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. 29 గ్రామాల్లో రైతుల వాటాగా 28 వేల మంది రైతులకు 63 వేల వరకు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం ఆ గ్రామాలను 13 ఎల్పీఎస్‌ (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌) జోన్లుగా విభజించి లేఅవుట్లు వేయాలని డిజైన్లు తయారు చేశారు.

వాటిలో రోడ్లు, డ్రెయిన్లు, మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ, చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే ప్లాంట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని సీఆర్‌డీఏ ప్రకటించింది. ఇందుకోసం రూ.18,800 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనాలు రూపొందించారు. కానీ మూడున్నరేళ్లలో ఒక్క జోన్లో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులు మొదలు పెట్టలేదు. పీపీపీ, హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో ఈ లేఅవుట్ల అభివృద్ధికి పలుమార్లు టెండర్లు పిలిచి వాటిని రద్దు చేశారు. కనీసం ఒక్క జోన్‌ను అయినా మోడల్‌గా అభివృద్ధి చేయాలని రైతులు కోరినా, నిధుల సమీకరణ జరుగుతోందంటూ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.   

ప్రణాళికల పేరుతో నాడు కాలయాపన 
రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఆయా గ్రామాలకు దూరంగా లేఅవుట్లు వేసి, హద్దుల ప్రకారం రాళ్లు పాతారు. అవన్నీ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి దారీతెన్ను లేకుండా ఉన్నాయని రైతులు అప్పట్లో వాపోయారు. మ్యాపులు, కాగితాల్లో మాత్రం అద్భుతమైన చిత్రాల్లో ప్లాట్లను ఇస్తున్నట్లు చూపి వాటిని సంబంధిత రైతులకు కేటాయించారు. కానీ లేఅవుట్లలో మాత్రం రైతులిచ్చిన పొలాల్లోనే రాళ్లు పాతి ప్లాట్లుగా విడగొట్టి వదిలేశారు.

లేఅవుట్లకు వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలకు సైతం చంద్రబాబు చివరి వరకు ప్రణాళికలు రూపొందిస్తూనే గడిపారు. మరోవైపు కార్పొరేట్‌ సంస్థలు, తమకు నచ్చిన వారికి కట్టబెట్టిన భూములను మాత్రం సుందరంగా తీర్చిదిద్దారు. సీఆర్‌డీఏ సొంత ఖర్చులతో పలు కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన భూముల వరకు గత ప్రభుత్వం రోడ్లు వేసింది. రైతుల వద్దకొచ్చేసరికి మొండి చేయి చూపారు.   

ఇప్పట్లో వేల కోట్లతో అభివృద్ధి సాధ్యమేనా? 
తన కలల రాజధానిగా చెప్పుకున్న చంద్రబాబే రైతులకివ్వాల్సిన ప్లాట్ల గురించి పట్టించుకోకుండా అధికారంలో ఉన్నన్ని రోజులు కాలయాపన చేశారు. అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ.. రైతుల లేఅవుట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబే రాజధాని నిర్మాణానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పేవారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లు కావాలని చెప్పేవారు.

ఎంతో హడావుడి చేసి రైతుల నుంచి తీసుకున్న భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఉపయోగించారు. అప్పట్లో రైతుల నోట్లో మట్టి కొట్టి ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాజధాని కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేయాలనడం ఎలా సాధ్యమని రాజకీయ, సామాజిక రంగ మేధావులు, సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement