హైకోర్టు ‘గడువుల’పై సుప్రీం స్టే  | Supreme Court Of India On Andhra Pradesh Capital Construction | Sakshi
Sakshi News home page

హైకోర్టు ‘గడువుల’పై సుప్రీం స్టే 

Published Tue, Nov 29 2022 1:39 AM | Last Updated on Tue, Nov 29 2022 5:19 PM

Supreme Court Of India On Andhra Pradesh Capital Construction - Sakshi

రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదు. అది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రజా ప్రతినిధులెందుకు? మంత్రి వర్గం ఎందుకున్నట్లు?  
– సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం 

సాక్షి, న్యూఢిల్లీ:  రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలన్న ఆదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేకాక అన్ని మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన భూ యజమానులకు అప్పగించాలన్న ఆదేశాన్ని సైతం సుప్రీంకోర్టు స్టే చేసింది.

ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అమరావతి రైతులకు, రైతు సంఘాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని చెప్పిన హైకోర్టు తీర్పుపై జనవరి 31న లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

‘‘ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త చట్టాన్ని తెస్తే, ప్రస్తుత వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి కదా! అందుకనే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేలుస్తాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బివీ.నాగరత్నంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు సందర్భాల్లో విస్మయం వ్యక్తం చేసింది. పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. 

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్‌ 
రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చింది. అలాగే హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏపీ సీఆర్‌డీఏ చట్టం, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటుకి మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

వీటితో పాటు రాజధాని నగర, రాజధాని ప్రాంత అభివృద్ధి, నిర్మాణం విషయంలో పలు కాల పరిమితులను నిర్ధేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలా చేయకపోవటం కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ కొందరు రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.  

మనుగడలోని లేని చట్టం ఆధారంగా హైకోర్టు తీర్పునిచ్చింది... 
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ, పాలన వికేంద్రీకరణ కోసం ఉద్దేశించిన చట్టం రద్దయిందని, అలా రద్దయిన తరవాత కూడా అది ఉన్నట్లుగా భావించి హైకోర్టు తీర్పునిచ్చిందని, అలా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకొని రైతులకు, రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందం కొంత మేరకు మనుగడలో ఉంటుంది కదా అని అభిప్రాయపడ్డారు.

ఒక నిర్దిష్ట పరిధిలో చట్టాన్ని ఆమోదించాలంటూ శాసనసభను హైకోర్టు ఆదేశించజాలదని, ఇదంతా అధికార విభజన పరిధిలోని వ్యవహారమని వేణుగోపాల్‌ తెలిపారు. ఒక చట్టం మనుగడలో లేనప్పుడు దాని శాసన యోగ్యతపై కోర్టు జోక్యం తగదన్నారు. ‘‘చట్టం రద్దు చేసినప్పుడు శాసనసభ తదుపరి ఏం చేస్తుందో న్యాయ వ్యవస్థ ఓపికతో చూడాలి. ఆపై శాసనసభ మరో చట్టాన్ని ఆమోదిస్తే దాని చెల్లుబాటును పరిగణించొచ్చు. కానీ చట్టమే లేనప్పుడు అది ఉన్నట్టే పరిగణనలోకి తీసుకున్నారు. ఇది చాలా చిత్రమైన అంశం. న్యాయస్థానాలు పూర్తిగా అకడమిక్‌ సమస్యల్లోకి వెళ్లజాలవవు’’ అని వేణుగోపాల్‌ తెలిపారు. 

రాజధాని నగరం అనే భావన రాజ్యాంగంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట ప్రదేశం లేదని, రాజధాని అంటే ప్రభుత్వం తన మూడు శాఖల్లో దేనిలోనైనా పని చేసే స్థానం మాత్రమేనన్నారు. కార్యనిర్వాహక వ్యవహారాలు పూర్తిగా అధికార యంత్రాంగానికి సంబంధించిన సమస్య అని విన్నవించారు.  

హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది... 
నెల లోపు ఇది చేయండి అని ఆదేశించడం సులభమని, కాని దానిని ఆచరణలో పెట్టడం అసాధ్యమైన పనిగా వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ, ‘అమరావతిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఉన్నారుగా..! హైకోర్టు భవనం కూడా కట్టారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అంటున్నారు. దీని సంగతి ఏమిటి? అని ప్రశ్నించారు. అదంతా అయిపోయిన అంశం అని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతుందని సహేతుకమైన భయాందోళనలున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు.

కానీ హైకోర్టు ఆదేశాలు అనుమానమే బేస్‌గా ఇచ్చినట్లున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో జస్టిస్‌ బీవీ నాగరత్న స్పందిస్తూ,. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక అధికారాలను నిర్విర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిది కదా..? దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రమే కదా? హైకోర్టు కాదు కదా!. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాక ఇరువురు న్యాయమూర్తులు కూడా, వేర్వేరు రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ గురించి న్యాయవాదులతో చర్చించారు.  

రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంది... 
ఈ సమయంలో భూములిచ్చిన రైతుల గురించి జస్టిస్‌ జోసెఫ్‌ ఆరా తీశారు. రైతుల హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి కోర్టుకు వివరించారు. చట్టంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఏర్పాట్లున్నాయన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయితే కాలపరిమితి అనేది ప్రధానమైన అడ్డంకి అని ఆయన వివరించారు. అమరావతిని రాజధానిగా తొలగించలేదని, మూడు అధికార కేంద్రాల్లో అమరావతి కూడా ఒకటి అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణ గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. హైకోర్టు గురించి చెప్పాలని జస్టిస్‌ జోసెఫ్‌ కోరగా.. అమరావతిలోనే నిర్వహణ సాగుతోందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైకోర్టుపై ఎంత ఖర్చుచేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు.

హైకోర్టులో క్యాంటీన్‌ లేదట కదా..! న్యాయమూర్తులు, న్యాయవాదులు మధ్యాహ్నా సమయంలో భోజనం నిమిత్తం బయటకి వెళ్తున్నారట కదా! అని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్యాంటీన్‌ పూర్తిస్థాయిలో ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. 

పూర్తిస్థాయి వాదనల తరువాత దీనిపై నిర్ణయం... 
వేణుగోపాల్‌ వాదనలు కొనసాగిస్తూ.. సమాఖ్య నిర్మాణంలో రాజధానిని మార్చుకొనే అధికారం రాష్ట్రానికి ఉండదా? ఆ అధికారాన్ని హైకోర్టు తన ఆదేశాలతో నియంత్రించొచ్చా? అని ప్రశ్నించారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యం చేసుకొని రెండు సమస్యలు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. శాసనసభ అధికారాలు, రైతుల సమస్య రెండింటినీ చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ఉందన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని వేణుగోపాల్‌ కోరారు. ఈ విషయంలో న్యాయాన్యాయాల జోలికి వెళ్లని సుప్రీంకోర్టు... పూర్తి స్థాయి వాదనల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. 

హైకోర్టు తప్పుగా పేర్కొంది... 
చట్టంలో ‘ఎ క్యాపిటల్‌’ అని ఉందని, అంటే ఒకే రాజధాని అని ఎలా భావిస్తారని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నిర్ణయించలేదని, కేంద్రం కేవలం నిపుణుల కమిటీని మాత్రమే వేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 4 ప్రకారం రాష్ట్ర రాజధానిని కేంద్రమే నిర్ణయిస్తుందని హైకోర్టు తప్పుగా పేర్కొందని వేణుగోపాల్‌ తెలిపారు. ఆర్టికల్‌ 4 ద్వారా సంక్రమించిన అధికారం కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగేదని వేణుగోపాల్‌ ధర్మాసనం దృష్టికికి తీసుకొచ్చారు.

శాసన అధికారాలకు మూలం ఏంటని జస్టిస్‌ జోసెఫ్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు.. కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో సహా విస్తృతమైనదని, ముందుగా శాసన అధికారం కలిగి ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్యాపిటల్‌ అనే భావన అసలు రాజ్యాంగంలో లేదని, సమాఖ్య రాష్ట్రంలో పాలనలో కొంత భాగాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిర్ణయించడానికి అనుమతి ఉంటుందని, కార్యనిర్వాహక అధికారాల నిర్వహణలో శాసన వ్యవస్థ ఎప్పుడైనా అడుగు పెట్టొచ్చని వేణుగోపాల్‌ తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో రాజ్యాంగపరమైన విషయాలపై నిర్ణయం తీసుకోవాలి.

కానీ రోజువారీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాంటూ రాష్ట్రం చేతులు కట్టుకుని న్యాయవ్యవస్థను అడగాలా? ఇది పూర్తిగా ఎగ్జిక్యూటివ్‌ అధికారాలకు విరుద్ధం కాదా?’’ అని వేణుగోపాల్‌ ప్రశ్నించారు. ఆర్టికల్‌ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిని పరిశీలిస్తుంది కదా అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించగా... కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో కలిసి ఉంటుందని మాత్రమే ఆర్టికల్‌ 162 చెప్పిందని వేణుగోపాల్‌ తెలిపారు.

అయితే, రాష్ట్రానికున్న శాసన అధికారాలతో విభజన చట్టాన్ని సవరించగలరా? అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. అలా చేయలేమని, విభజన చట్టం అనేది ఓ ప్రవేశిక అని వేణుగోపాల్‌ తెలిపారు. విభజన చట్టాన్ని సవరించడానికి పార్లమెంటుకు నిర్దిష్టమైన నిబంధనలున్నందున దాన్ని సవరించలేమని జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు.  

రాజధానిని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు... 
రైతుల తరఫు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఓసారి చూడాలన్న ఆయన... ఒకసారి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశాక దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. జస్టిస్‌ జోసెఫ్‌ జోక్యంచేసుకొని... చట్టంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పలేదుగా? అని ప్రశ్నించారు. తొలుత హైదరాబాద్‌ రాజధానిగా పేర్కొన్నారని, తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ  ప్రత్యామ్నాయ రాజధానిని నిర్ణయించాలని సూచించిందని నారిమన్‌ పేర్కొన్నారు.

అంటే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పలేదుగా? అని జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొంటూ...  రాజధాని ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కూడా చెప్పలేమన్నారు. పార్లమెంటు ఒక రాజధాని అని మాత్రమే చెప్పిందని, కానీ ఇక్కడ మూడు రాజధానులు అంటున్నారని నారీమన్‌ తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్రం నిర్ణయించగలదని జస్టిస్‌ జోసెఫ్‌ స్పష్టంచేశారు. దీనిపై పార్లమెంటు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంటందని నారీమన్‌ తెలిపారు. 

లబ్ది చేకూరుతుందనే భూములిచ్చారు... 
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, శ్రీరామ్‌ జోక్యం చేసుకొంటూ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 35, ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 20 ప్రకారం రాష్ట్రంలో పట్టణ, స్థానిక ప్రణాళికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి శాసనసభ సమర్థనీయమైందని తెలిపారు. రైతుల తరఫు మరో సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే ల్యాండ్‌ పూల్‌కి అంగీకరించారన్నారు. 2020 నాటికి భూములు అభివృద్ధిలోకి తెస్తామని హామీ ఇచ్చారని, కానీ 2019 నుంచే మౌలికసదుపాయాల కల్పన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని శ్యాం దివాన్‌ తెలిపారు.

మూడేళ్లుగా భూమిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కొన్ని ఫొటోలు చూపుతూ హైకోర్టు ఆవరణలో సౌకర్యాలు లేవని, సరైన రహదారులు లేవని, పాఠశాలలు లేవని, కానీ మిషన్‌ 2020 అని రైతులకు చెప్పారన్నారు. పరిపాలనలో భాగంగా పాలనపరమైన బ్లాకులను వేరే ప్రాంతాలకు మార్చే సామర్థ్యం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. పాలనపరమైన బ్లాకులను మార్చడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారన్నారు.

హైకోర్టు విధించిన కాలపరిమితి అసాధ్యమని భావిస్తే తిరిగి హైకోర్టుకు వెళ్తే తగిన సమయం ఇస్తుందన్నారు. 2019 మే నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎందుకు చేయలేదో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు చట్టంలో రాజధాని నగరం అంటే ఏంటని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించగా.. పరిపాలన ప్రాథమిక స్థానమని దివాన్‌ తెలిపారు.  

అలా అయితే మనకు ప్రజా ప్రతినిధులెందుకు..? 
ఇవన్నీ ఫలానా ప్రాంతంలో ఉండాలా? ఇవి చట్టానికి సంబంధించిన విషయాలా? అని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు.. జస్టిస్‌ బీవీ నాగరత్న స్పందిస్తూ.. అలా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం న్యాయస్థానానికి సంబంధించిన అంశం కాదు. అలాంటప్పుడు మనకు ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారు? మంత్రి వర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని కాకుండా వేరే ప్రదేశంలో సెక్రటేరియట్‌ లేదా దానిలో కొంత భాగం ఉండాలని ప్రభుత్వం భావిస్తుండొచ్చుగా? జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు.

అమరావతి నుంచి విశాఖపట్నం, కర్నూలు ఎంత దూరమని న్యాయవాదిని ప్రశ్నించారు. విశాఖపట్నం సుమారు 500 కిలోమీటర్లు, కర్నూలు సుమారు 800 కిలోమీటర్లు అని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇది  వికేంద్రీకరణలాగే ఉంది కదా! అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.  

అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశం పూర్తిగా అసంబద్ధం. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడమేంటి? అసలు మీ ఉద్దేశంలో రాజధాని నగరమంటే ఏంటి? 

అన్నీ మౌలిక వసతులతో రాజధాన్ని ప్రాంతం మొత్తాన్ని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలా? హైకోర్టు ఇలా ఎలా ఆదేశాలిస్తుంది. నగర నిర్మాణంలో హైకోర్టుకున్న నైపుణ్యమేంటి? హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా? లేక చీఫ్‌ ఇంజనీరా? ఇలాంటి వ్యవహారంలో కోర్టులకు ఎలాంటి నైపుణ్యం ఉండదు. అందువల్ల నగర నిర్మాణం విషయంలో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోబోం. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిదే కదా!!. ఈ విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప, హైకోర్టుది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు కార్య నిర్వాహక వ్యవస్థ ఎంత మాత్రం కాజాలదు. 
– సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ నాగరత్నం ధర్మాసనం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement