వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : భూముల ధరలు ఆకాశాన్నంటుతుండ డంతో వాటిని సొంతం చేసుకునేందుకు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. భూములను సొంతం చేసుకునే క్రమంలో హత్యలు చేసేందుకు వెనుకాడడం లేదు. హైదరాబాద్, నల్గొండలో కొనసాగుతున్న తుపాకీ సంస్కృతి తాజా హత్యతో జిల్లాకు పాకినట్లయింది. ఇప్పటి వరకు జిల్లాలో తుపాకులతో రియల్ ఎస్టేల్ వ్యాపారులు బెదిరించిన సంఘటనలు మాత్రమే చోటుచేసుకోగా శుక్రవారం లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారు వడ్డెర కాలనీలో ఏకంగా తుపాకీతో ఓ రియల్టర్‌ను హత్యచేసిన సంఘటన సంచలనం సృష్టించింది. నగరంతోపాటు జిల్లాలో డివిజన్ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు విపరీతంగా పెరగడంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం పుం జుకుంది.
భూముల కోసం సంగెం మండలం పల్లారుగూడలో జరిగిన హత్య ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫ్యాక్షన్ తరహాలో జరిగిన ఈ హత్యలో సొంత తమ్ముడిని అన్న హత్యచేశాడు. వేటకొడవళ్లు, స్కోడా కారు ఉపయోగించి చేసిన ఈ హత్యలో కోట్లాది రూపాయల భూ ముల వ్యవహారం దాగి ఉంది. ఆరేళ్ల క్రితం హసన్‌పర్తిలో ఒక అడ్వకేట్ తన సొంత భూముల వ్యవహా రంలో హత్యకు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభం లో హన్మకొండ బ స్టాండు సమీపంలో భూపాల్‌పల్లి ఆర్‌డబ్ల్యూఎస్‌లోపనిచేస్తున్న డీఈ బొడ్డు రాజేందర్ భూ తగాదాల కారణంగా హత్యకు గురయ్యాడు.
పక్కరాష్ట్రాల నుంచి తుపాకులు..
అనధికారికంగా జిల్లాలో తుపాకులు వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లిక్కర్ వ్యాపారులు, గంజాయి వ్యాపారులు, చివరకు రౌడీషీటర్ల చేతుల్లో కూడా తుపాకులు ఉన్నట్లు గతంలో పోలీసు శాఖ గుర్తించింది. ఆ మేరకు చర్యలు చేపట్టినా ఈ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. బీహార్, పశ్చిమబెంగాల్(కలకత్తా), చత్తీస్‌గఢ్‌లోని ధన్‌బాగ్, రామ్‌గఢ్ నుంచి జిల్లాకు తుపాకులు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. కంట్రీమేడ్, మిషన్‌మేడ్ పేర్లతో రూ.15,000 నుంచి 35,000 వరకు ఖరీదు చేస్తున్నారు. నగరంలో గతంలో కొందరు రియల్టర్లు రివాల్వర్‌లను వాడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.
అయితే వారు కేవలం ఎదుటి వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి మాత్రమే వాడినట్లు సమాచారం ఉంది. ఇంటి పై కప్పును పిస్తొల్‌తో షూట్‌చేయడం, బహిరంగ ప్రదేశాల్లో తూటా పేల్చడం వంటి సంఘటనలు గతంలో నగరంలో జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఇలా తుపాకులను జిల్లాకు తరలిస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచ, ఆదిలాబాద్ జిల్లా వాంఖడే, వరంగల్ జిల్లా కేంద్రంలో తుపాకులతో పట్టుబడిన సంఘటనలు ఐదు వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో లేని తుపాకీ హత్యల సంస్కృతికి నెల్లుట్ల ఘటనతో తెరలేపినట్లయింది. పోలీసు వర్గాలు అప్రమత్తం కాకపోతే ఈ సంస్కృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది.
పేలుతున్న రియల్ గన్..
Published Sun, Aug 25 2013 3:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement