ప్రాజెక్టుల కింద ‘భూ’సేకరణ సులభతరం!
- పెద్ద నోట్ల రద్దుతో దిగిరానున్న రియల్ భూముల ధరలు
- భూసేకరణ, పెద్ద నోట్ల ప్రభావంపై నీటిపారుదల శాఖ సమీక్ష
- నిర్వాసితులకు ప్రత్యామ్నాయ భూలభ్యత పెరుగుతుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తమకు మేలు చేయబోతోందని నీటి పారుదల శాఖ ఆశిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో రియల్ భూముల ధరలు దిగివస్తాయని, భూ లభ్యత పెరుగుతుందని, నిర్వాసితులు తిరిగి భూకొనుగోళ్లు చేసేందుకు ఉపకరిస్తాయని లెక్కలేస్తోంది. అదే జరిగితే సాగునీటి ప్రాజెక్టుల కింద మొత్తం భూసేకరణ సులభతరం అవుతుందనే నమ్మకంతో ఉంది. ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న సానుకూలత తదితర అంశాలపై తాజాగా నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నత స్థారుు సమీక్ష నిర్వహించారు.
కలిసొస్తున్న నోట్ల రద్దు..
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద మొత్తం గా 3.20లక్షల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఇందులో 2.12లక్షల ఎకరాల సేకరణ పూర్తరుుంది. మరో 1.08లక్షల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ప్రభుత్వం జీవో 123 కింద భూములు సేకరిస్తోంది. భూ రకాన్నిబట్టి ఎకరా రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు చెల్లిస్తోంది. చాలా చోట్ల నిర్వాసితులకు కొత్తగా భూములు కొందామంటే మాత్రం ధరలు అందుబాటులో లేవు. గ్రామీణప్రాంతాల్లోని భూముల రిజిస్టర్ విలువ తక్కువగా ఉండటంతో నల్లధనం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూములపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులకు కొత్తగా భూమి కొనుగోలు చేద్దామంటే ధరలు భారీగా ఉండేవి.
ప్రత్యామ్నాయ భూమి దొరకకపోవడంతో ప్రాజెక్టులకు భూములు ఇచ్చేందుకు చాలా చోట్ల నిర్వాసితులు ముందుకు రావడం లేదు. దీంతో ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పెద్దనోట్ల రద్దుతో ఈ లావాదేవీలు చాలావరకు స్తంభిం చారుు. నల్ల ధనానికి కళ్లెం పడటంతో అమ్మేవాళ్లు ఉన్నా కొనేవాళ్లు కరువు కానున్నారు. ఈ పరిస్థితుల్లో భూ లభ్యత పెరగడంతోపాటు ధరలు తగ్గుముఖం పట్టనున్నారుు. ఇదే సమయంలో వైట్‌మనీ ఉన్నవాళ్లకు డిమాండ్ పెరగనుంది. ఇది ప్రభుత్వం నుంచి అధికారికంగా పరిహారం పొందుతున్న నిర్వాసితులకు వరంగా మారుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. భవన నిర్మాణరంగంలో సైతం ధరలు దిగివచ్చే నేపథ్యంలో..నిర్వాసితులకు చెల్లిస్తున్న పరిహార డబ్బుతో వారికి అనుకూలమైన గృహాల కొనుగోలుకు అవకాశం ఉంటుందని, ప్రస్తుత పరిణామాలతో భూసేకరణ వేగిరం అవుతుందని భావిస్తోంది.