‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్‌మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్ స్థల కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌హెచ్–44, ఓఆర్‌ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటూ పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు.
సాక్షి, హైదరాబాద్: ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్‌గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు మళ్లుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి.
దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు.
కనెక్టివిటీ బాగుంది..
హైదరాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్‌వ్యాలీ, నల్సార్‌తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు.
కండ్లకోయలో సైబర్ టవర్స్‌ను మించి..
పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్..
ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది.
చదవండి: అదిరే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ
Comments
Please login to add a commentAdd a comment