IT boom
-
మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది, ఎగబడుతున్న జనం!
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. కండ్లకోయలో ఐటీ పార్క్ స్థల కేటాయింపుతో మొదలైన ఈ ప్రాంతం అభివృద్ధి.. సమీప భవిష్యత్తులోనే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అభివృద్ధి చెందుతుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌హెచ్–44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ కనెక్టివిటీలతో పాటూ పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థలాల ధరలు చౌకగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలాలు. సాక్షి, హైదరాబాద్: ఐటీ, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన మాదాపూర్ ప్రాంతం క్రమంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు విస్తరించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఖరీదైన పెట్టుబడి మార్కెట్‌గా మారడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు క్రమంగా ఉత్తర హైదరాబాద్ వైపు మళ్లుతున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే ఉత్తరాదిలో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉంటాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతంలో భూములు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లలో చ.అ. ధర రూ.4,500–5,000, గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు. కనెక్టివిటీ బాగుంది.. హైదరాబాద్ – నాగ్‌పూర్ జాతీయ రహదారి–44 ఉత్తర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ సదుపాయం కూడా ఉంది. సుచిత్ర నుంచి డెయిర్ ఫాం జంక్షన్, సినీ ప్లానెట్ నుంచి జీడిమెట్ల జంక్షన్, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్‌వ్యాలీ, నల్సార్‌తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. 30 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ప్రధాన నగరానికి చేరుకోవచ్చు. కండ్లకోయలో సైబర్ టవర్స్‌ను మించి.. పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది సైబర్ టవర్స్ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్థిరాస్తి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్ జాతీయ రహదారిలో భారీ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: అదిరే లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ -
టీహబ్–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్–2లో సుమారు 200 అంకుర సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలతోపాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. జూన్ నెలలో ఐటీ శాఖ ఈ హబ్‌ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబరు తొలి వారం నుంచి పలు సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించినట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా సుమారు రెండు వేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. టీహబ్–2 ప్రత్యేకతలివే.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతం కావడంతో టీహబ్–2 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ► ఈ కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని..ప్రపంచంలోనే రెండవదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ► కాగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీహబ్ మొదటిదశను ఐఐఐటీ–హైదరాబాద్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్,నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నెలకొల్పారు. ► స్టారప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు,ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకేచోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. ► అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ స్ఫూర్తితో.. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టీహబ్ మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. తొలిదశ టీహబ్‌లో ఏడేళ్లుగా ఇందులో 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడుపోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ,విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతికసహకారం అందిస్తున్నాయి. ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమో డే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. (క్లిక్: బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’) ఐటీ భూమ్..హైహై టీహబ్ ఒకటి, రెండోదశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత పురోగమించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. (క్లిక్ చేయండి: పండక్కి కొత్త బండి కష్టమే!) -
సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు భారతీయులు గుడ్‌బై, దేశంలో 'ది గ్రేట్ రిజిగ్నేషన్' సునామీ!
కరోనా తెచ్చిన సరికొత్త విప్లవంతో ఐటీ ఉద్యోగులు వినూత్న రీతిలో తమకు నచ్చిన జాబ్‌కు జైకొడుతున్నారు. నచ్చలేదంటే లక్షల ప్యాకేజీ ఇస్తామన్నా లైట్ తీసుకుంటున్నారు. మరికొందరు నేను ఉద్యోగం చేసేదేంది. సొంత కంపెనీ పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలనే ధోరణితో చేస్తున్న ఉద్యోగాలకు రిజైన్ చేయడం, లేదంటే చేస్తున్న ఉద్యోగం వదిలేసి కొత్త రంగంపై అడుగులు వేస్తున్నారు. దీంతో భారత్‌లో దిగ్రేట్ రిజిగ్నేషన్ కొనసాగుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ డిజిటల్ ఓషన్ ప్రకారం.. మహమ్మారి సమయంలో ఉద్యోగాల్ని అంటిపెట్టుకొని ఉన్న 42 శాతం సాఫ్ట్వేర్ డెవలపర్లు ఈ సంవత్సరం చేస్తున్న జాబులకు రిజైన్ చేయాలని, లేదంటే మరో జాబ్‌కు షిప్ట్ అయ్యే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు, వన్ ఇయర్పైగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్లలో నాలుగింట ఒక వంతు మంది గత సంవత్సరంలో కొత్త ఉద్యోగాల్ని ఎంపిక చేసుకున్నట్లు 'కరెంట్ సర్వే' పేరుతో నివేదిక పేర్కొంది. "సంవత్సరం కంటే ఎక్కువ అనుభవం ఉన్న డెవలపర్లలో 27 శాతం మంది గత సంవత్సరంలో కొత్త ఉద్యోగం చేసేందుకు మొగ్గు చూపారు.15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న ఐదుగురు డెవలపర్లలో ఒకరు గత సంవత్సరంలో కొత్త ఉద్యోగం చేయడం ప్రారంభించినట్లు తేలింది. డెవలపర్లు ఉద్యోగాలు మారడానికి పనితగ్గ వేతనం, రిమోట్ లేదా సౌకర్యంగా ఉండే వర్క్ ప్లేస్‌లో పనిచేసేందుకు ఇష్టపడడమే ప్రధాన కారణమని విడుదలైన డిజిటల్ ఓషన్ నివేదిక పేర్కొంది. డెవలపర్లలో ఉద్యోగ సంతృప్తి తక్కువగా ఉండవచ్చని, అయితే ఆంట్రప్రెన్యూర్‌గా ఎదగాలనే కోరిక వారిలో ఎక్కువగా ఉందని ఉదహరించింది. "ఇక చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసిన వారిలో 8 శాతం మంది తమ సొంత కంపెనీ ప్రారంభించి ఉపాధి కల్పించే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించినట్లు ది ఓషన్ ప్రతినిధులు తెలిపారు. కాగా, బ్లాక్‌చెయిన్, వెబ్ 3 టెక్నాలజీల చుట్టూ సంచలనం ఉన్నప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలపర్లలో 67 శాతం మంది ఇంకా బ్లాక్‌చెయిన్/ వెబ్ 3ని ఉపయోగించడం లేదని పునరుద్ఘాటించారు. -
హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్
సాక్షి, హైదరాబాద్: హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొలువుల కల్పనలో ఐటీ రంగం అగ్రభాగాన నిలిచింది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగు బంగారంగా నిలిచిన మహానగరం ఏటా ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, నైపుణ్యం గల పట్టభద్రులకు నూతన కొలువులు సృష్టించడంలో ముందున్నట్లు.. టీంలీజ్ సంస్థ పలు మెట్రో నగరాలపై వివిధ రంగాలపై జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ► ప్రధానంగా ఐటీ, అనుంబంధరంగాల్లో సుమారు 31 శాతం ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేసింది. ► ఇక దేశంలో బల్క్‌డ్రగ్ క్యాపిటల్‌గా పేరొందిన మన నగరంలో రెండోస్థానంలో నిలిచిన ఫార్మారంగంలో సుమారు 25 శాతం కొలువుల సృష్టి జరుగుతోందట. ► ఇక మూడోస్థానంలో ఉన్న టెలీ కమ్యూనికేషన్స్రంగంలో 23 శాతం, తయారీ రంగం 21 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. బల్క్‌డ్రగ్ రంగంలోనూ... మహానగరాన్ని ఆనుకొని సుమారు వెయ్యికి పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలున్నాయి. ఇక్కడి నుంచి దేశ,విదేశాలకు ప్రాణాధార ఔషధాలు, వ్యాక్సీన్లు ఎగుమతి అవుతున్నాయి. ఏటా బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రంగం ఆర్జిస్తోంది. నూతన ఔషధాలపై పరిశోధన, కొత్త మందుల సృష్టి,ఎగుమతుల విషయంలో ఖండాతరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పేరు మార్మోగుతూనే ఉంది. ఈ రంగంలోనూ ఏటా సుమారు 25 శాతం నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతోందని తాజా అధ్యయనం అంచనా వేయడం విశేషం. ప్రధానంగా సైన్స్ గ్రాడ్యుయేట్లతోపాటు పది,ఇంటర్ చదివిన వారికి హెల్పర్లు,నైపుణ్య కార్మికులకు ఈ రంగం భారీగా ఉపాధి కల్పిస్తుండడం విశేషం. నూతన పాలసీతో జోష్ రాష్ట్ర సర్కారు ఐటీ, హార్డ్‌వేర్ రంగాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ రాకతో ఈ రంగాలు జెట్స్పీడ్తో దూసుకుపోనున్నాయి. రాబోయే ఐదేళ్లలో నూతనంగా మరో నాలుగు లక్షల కొలువుల సృష్టితో పాటు.. ఏటా ఐటీ ఎగుమతులు మూడు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశాలున్నట్లు ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తుండడం విశేషం. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2021–26 మధ్య కాలానికి ప్రకటించిన నూతన పాలసీతో ఐటీ భూమ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.25 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు వెల్లువలా సిటీకి తరలివస్తున్న విషయం విదితమే. (చదవండి: ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు) -
సీఎస్ఈ యమా క్రేజీ!
ఐఐటీలు, నిట్లు, క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు.. సంస్థ ఏదైనా.. ఇంజనీరింగ్ ఔత్సాహికుల ఓటు సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)కే! నాలుగైదేళ్ల క్రితం ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ వంటి కోర్బ్రాంచ్ల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపేవారు. గత రెండేళ్లుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతా సీఎస్‌ఈనే కావాలంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్లలో సీఎస్‌ఈపై క్రేజ్ మరింత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. సీఎస్ఈ.. విద్యార్థులను అమితంగా ఆకర్షించడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.. గత రెండేళ్లుగా సీఎస్ఈ జాతీయ స్థాయి ప్రభుత్వ (ఐఐటీలు, నిట్లు), ప్రైవేటు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు, తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈసారి విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బ్రాంచిలో చేరడానికి మొగ్గు చూపారు. గతంలో కోర్ సబ్జెక్టులపై ఎక్కువగా ఆసక్తి కనబర్చిన విద్యార్థులు.. గత రెండేళ్లుగా సీఎస్ఈలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు ద్వారా తెలుస్తోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఐటీ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో ఎన్నడూలేనంత వృద్ధి. దాంతో కంప్యూటర్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎస్ఈ విద్యార్థులకు ప్రముఖ కంపెనీలు అద్భుతమైన ప్యాకేజీలు అందిస్తున్నాయి. సీఎస్ఈ విద్యార్థుల సగటు ప్యాకేజీ ఇతర బ్రాంచ్‌లు గరిష్ట ప్యాకేజీతో సమానంగా ఉండటం గమనార్హం. ఐఐటీ ఢిల్లీ ప్లేస్‌మెంట్స్ రిపోర్ట్ 2015 ప్రకారం- సీఎస్ఈ విద్యార్థులు ఇద్దరికి పేస్బుక్ 1.42 కోట్ల వార్షిక ప్యాకేజీ ప్రకటించింది. ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వార్షిక ప్యాకేజీలు సగటున రూ.10లక్షలకు పైమాటే! ఉద్యోగంలో చేరాక ప్రతిభ, అనుభవంతో సంవత్సరానికి రూ.30 లక్షల వరకూ అందుకోవడం కష్టమేమీ కాదు. దాంతోపాటు విదేశాల్లో పని చేసే అవకాశం.. రెండు రోజులు సెలవు దినాలు తదితర సౌక్యరాలు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సీఎస్ఈ బ్రాంచీని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మన ఐటీ నిపుణులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. అనేక ఎంఎన్‌సీలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్వాగతం పలుకుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్, అడోబ్, యాపిల్, ఇంటెల్ వంటి టాప్ కంపెనీలు సైతం మన కంప్యూటర్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక గూగుల్, ఫేస్బుక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు మన ఐఐటీ గ్రాడ్యుయేట్లకు లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్న వార్తలు సైతం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడి ఐటీ నిపుణులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా లాంటి దేశాలకు వలస వెళ్తున్నారు. వీరు ఆయా దేశాల ఆర్థిక వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, సింగపూర్‌ల్లో ఇండియన్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కోసం కొత్త వేదికలనూ ఏర్పాటు చేస్తున్నారు. ముందే సీఎస్ఈలో చేరితే.. బీటెక్‌లో ఏ బ్రాంచ్ చదివినా.. చివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారాల్సిన పరిస్థితి. ఐటీలో విస్తృత అవకాశాలు ఉండటమే అందుకు కారణం. వేర్వేరు బ్రాంచ్‌లు చదివి చివరికి సాఫ్ట్వేర్ రంగంలోనే రాణిస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువే అయినా.. మొదటి నుంచే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరితే కెరీర్లో మరింత మెరుగ్గా పని చేయడానికి ఆస్కారం ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. వీటికి తోడు కొన్ని టాప్ మల్టీ నేషనల్ కంపెనీలు సీఎస్ఈ విద్యార్థులను మాత్రమే నియమించుకుంటాయి. దాంతో విద్యార్థులు సీఎస్ఈ వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. ఐఐటీల్లో బయో టెక్నాలజీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు సైతం కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉదంతాలు అనేకం. కాబట్టి ముందే సీఎస్ఈలో చేరితే పోలా..! అనే ఆలోచన ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రుల్లోనూ పెరుగుతుండటమే సీఎస్ఈ పట్ల క్రేజ్‌కు కారణమంటున్నారు. పరిశోధనలు... బిగ్ డేటా సీఎస్ఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా, పరిశోధనలు చేసేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, న్యూరోసైన్స్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు ప్రతిభావంతులకు సవాళ్లతోపాటు అవకాశాలను అందిస్తున్నాయి. అమెరికా వంటి విదేశాల్లో ఎంఎస్ చేసేందుకు సీఎస్ఈ అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయముంది. అలాగే రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి విభాగాల్లో లక్షల్లో నిపుణుల అవసరం ఉండనుందనే సమాచారం ఆధారంగా విద్యార్థులు సీఎస్ఈ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. సర్కారీ కొలువులు సైతం సీఎస్ఈలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఐటీ, ఐటీ ఆధారిత సేవల విభాగాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడవచ్చు. వీటితో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే, బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి అవకాశాలు పుష్కలం. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ ఉద్యోగాలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో సీఎస్ఈలో చేరితే అద్భుత అవకాశాలు అందుకోవచ్చని భావిస్తున్నారు. కోర్సు కూడా సులభమే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిగా లాజిక్‌తో కూడుకొని ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లాజిక్ తెలిసి కోడింగ్ నైపుణ్యం అలవడితే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పదో తరగతి, 10+2 స్థాయిలోనే కంప్యూటర్ గురించి విద్యార్థులకు కొంత అవగాహన ఏర్పడుతోంది. దాంతో స్కూల్ స్థాయిలోనే ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్స్‌పై ఆసక్తి పెంచుకోవడం కూడా సీఎస్ఈకి పెరిగిన క్రేజ్‌కు ఒక కారణమంటున్నారు. ఇంజనీరింగ్ తర్వాత అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎంఎస్ చేయడానికి సులువుగా ఉంటుంది. వేరే బ్రాంచ్ అభ్యర్థులతో పోల్చితే వీరికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. వేతనాలు కూడా ఆకర్షణీయం. భవిష్యత్తులోనూ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీల వల్ల ఐటీ రంగంలో విస్తృత ఉద్యోగాల సృష్టి జరగే అవకాశం ఉంది కాబట్టి సీఎస్ఈ అభ్యర్థులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. - డాక్టర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపల్, సీబీఐటీ. గత 20 ఏళ్లుగా ఐటీ రంగానికి బూమ్ ఉంది. ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్స్ మొదలైన విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారికి, ఎంబీఏ చదివిన అభ్యర్థులకూ ఐటీ రంగం ఉపాధి కల్పిస్తుంది. ఈ విధంగా చదివిన కోర్సు ఏదైనా చివరికి ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివించడానికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఐటీ రంగం వద్ధి కూడా స్థిరంగా ఉంది. రానున్న కాలంలో బిగ్‌డేటా అనలిటిక్స్ లాంటి అందుబాటులోకి వస్తే ఐటీ రంగానికి బూమ్ వచ్చే అవకాశం ఉంది. - డా. పి.ప్రేమ్‌చంద్, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఓయూ.