సీఎస్ఈ యమా క్రేజీ! | several career opportunities for Computer Science and engeering | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఈలో చేరితే అద్భుత అవకాశాలు!

Published Fri, Jul 29 2016 9:20 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

సీఎస్ఈ  యమా క్రేజీ! - Sakshi

సీఎస్ఈ యమా క్రేజీ!

ఐఐటీలు, నిట్‌లు, క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు.. సంస్థ ఏదైనా.. ఇంజనీరింగ్ ఔత్సాహికుల ఓటు సీఎస్‌ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)కే! నాలుగైదేళ్ల క్రితం ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ వంటి కోర్‌బ్రాంచ్‌ల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపేవారు. గత రెండేళ్లుగా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంతా సీఎస్‌ఈనే కావాలంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అడ్మిషన్లలో సీఎస్‌ఈపై క్రేజ్ మరింత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. సీఎస్‌ఈ.. విద్యార్థులను అమితంగా ఆకర్షించడానికి కారణాలేమిటో తెలుసుకుందాం..
 
గత రెండేళ్లుగా సీఎస్‌ఈ
జాతీయ స్థాయి ప్రభుత్వ (ఐఐటీలు, నిట్‌లు), ప్రైవేటు ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్లు, తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈసారి విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) బ్రాంచిలో చేరడానికి మొగ్గు చూపారు. గతంలో కోర్ సబ్జెక్టులపై ఎక్కువగా ఆసక్తి కనబర్చిన విద్యార్థులు.. గత రెండేళ్లుగా సీఎస్‌ఈలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు ద్వారా తెలుస్తోంది.
 
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్

ఐటీ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ కామర్స్ రంగంలో ఎన్నడూలేనంత వృద్ధి. దాంతో కంప్యూటర్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎస్‌ఈ విద్యార్థులకు ప్రముఖ కంపెనీలు అద్భుతమైన ప్యాకేజీలు అందిస్తున్నాయి. సీఎస్‌ఈ విద్యార్థుల సగటు ప్యాకేజీ ఇతర బ్రాంచ్‌లు గరిష్ట ప్యాకేజీతో సమానంగా ఉండటం గమనార్హం. ఐఐటీ ఢిల్లీ ప్లేస్‌మెంట్స్ రిపోర్ట్ 2015  ప్రకారం- సీఎస్‌ఈ విద్యార్థులు ఇద్దరికి పేస్‌బుక్ 1.42 కోట్ల వార్షిక ప్యాకేజీ ప్రకటించింది. ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వార్షిక ప్యాకేజీలు సగటున రూ.10లక్షలకు పైమాటే! ఉద్యోగంలో చేరాక ప్రతిభ, అనుభవంతో సంవత్సరానికి రూ.30 లక్షల వరకూ అందుకోవడం కష్టమేమీ కాదు. దాంతోపాటు విదేశాల్లో పని చేసే అవకాశం.. రెండు రోజులు సెలవు దినాలు తదితర సౌక్యరాలు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సీఎస్‌ఈ  బ్రాంచీని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మన ఐటీ నిపుణులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. అనేక ఎంఎన్‌సీలు మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు స్వాగతం పలుకుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్, అడోబ్, యాపిల్, ఇంటెల్  వంటి టాప్ కంపెనీలు సైతం మన కంప్యూటర్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇక గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు మన ఐఐటీ గ్రాడ్యుయేట్‌లకు లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్న వార్తలు సైతం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడి ఐటీ నిపుణులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా లాంటి దేశాలకు వలస వెళ్తున్నారు. వీరు ఆయా దేశాల ఆర్థిక వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, సింగపూర్‌ల్లో ఇండియన్ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ కోసం కొత్త వేదికలనూ  ఏర్పాటు చేస్తున్నారు.
 
ముందే సీఎస్‌ఈలో చేరితే..
బీటెక్‌లో ఏ బ్రాంచ్ చదివినా.. చివరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారాల్సిన పరిస్థితి. ఐటీలో విస్తృత అవకాశాలు ఉండటమే అందుకు కారణం. వేర్వేరు బ్రాంచ్‌లు చదివి చివరికి సాఫ్ట్‌వేర్ రంగంలోనే రాణిస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువే అయినా.. మొదటి నుంచే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరితే కెరీర్‌లో మరింత మెరుగ్గా పని చేయడానికి ఆస్కారం ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. వీటికి తోడు కొన్ని టాప్ మల్టీ నేషనల్ కంపెనీలు సీఎస్‌ఈ విద్యార్థులను మాత్రమే నియమించుకుంటాయి.  దాంతో విద్యార్థులు సీఎస్‌ఈ వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. ఐఐటీల్లో బయో టెక్నాలజీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు సైతం కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉదంతాలు అనేకం. కాబట్టి ముందే సీఎస్‌ఈలో చేరితే పోలా..! అనే ఆలోచన ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రుల్లోనూ పెరుగుతుండటమే సీఎస్‌ఈ పట్ల క్రేజ్‌కు కారణమంటున్నారు.
 
పరిశోధనలు... బిగ్ డేటా
సీఎస్‌ఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా, పరిశోధనలు చేసేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, న్యూరోసైన్స్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు ప్రతిభావంతులకు సవాళ్లతోపాటు అవకాశాలను అందిస్తున్నాయి. అమెరికా వంటి విదేశాల్లో ఎంఎస్ చేసేందుకు సీఎస్‌ఈ అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయముంది. అలాగే  రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి విభాగాల్లో లక్షల్లో నిపుణుల అవసరం ఉండనుందనే సమాచారం ఆధారంగా విద్యార్థులు సీఎస్‌ఈ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు.
 
 సర్కారీ కొలువులు సైతం
సీఎస్‌ఈలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఐటీ, ఐటీ ఆధారిత సేవల  విభాగాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడవచ్చు. వీటితో పాటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే, బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి అవకాశాలు పుష్కలం. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ ఉద్యోగాలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో సీఎస్‌ఈలో చేరితే అద్భుత అవకాశాలు అందుకోవచ్చని భావిస్తున్నారు.
 
కోర్సు కూడా సులభమే
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తిగా లాజిక్‌తో కూడుకొని ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లాజిక్ తెలిసి కోడింగ్ నైపుణ్యం అలవడితే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పదో తరగతి,  10+2 స్థాయిలోనే కంప్యూటర్ గురించి విద్యార్థులకు కొంత అవగాహన ఏర్పడుతోంది. దాంతో స్కూల్ స్థాయిలోనే ఎక్కువ మంది విద్యార్థులు కంప్యూటర్స్‌పై ఆసక్తి పెంచుకోవడం కూడా సీఎస్‌ఈకి పెరిగిన క్రేజ్‌కు ఒక కారణమంటున్నారు.
 
ఇంజనీరింగ్ తర్వాత అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎంఎస్ చేయడానికి సులువుగా ఉంటుంది. వేరే బ్రాంచ్ అభ్యర్థులతో పోల్చితే వీరికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. వేతనాలు కూడా ఆకర్షణీయం. భవిష్యత్తులోనూ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీల వల్ల ఐటీ రంగంలో విస్తృత ఉద్యోగాల సృష్టి జరగే అవకాశం ఉంది కాబట్టి సీఎస్‌ఈ అభ్యర్థులకు ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
 - డాక్టర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపల్,  సీబీఐటీ.
 
గత 20 ఏళ్లుగా ఐటీ రంగానికి బూమ్ ఉంది. ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్స్ మొదలైన విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారికి, ఎంబీఏ చదివిన అభ్యర్థులకూ ఐటీ రంగం ఉపాధి కల్పిస్తుంది. ఈ విధంగా చదివిన కోర్సు ఏదైనా చివరికి ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివించడానికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఐటీ రంగం వద్ధి కూడా స్థిరంగా ఉంది. రానున్న కాలంలో బిగ్‌డేటా అనలిటిక్స్ లాంటి అందుబాటులోకి వస్తే ఐటీ రంగానికి బూమ్ వచ్చే అవకాశం ఉంది.  - డా. పి.ప్రేమ్‌చంద్, ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఓయూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement