వచ్చే జూన్ కల్లా వెళ్లాల్సిందే...
♦ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ
♦ సిబ్బందిని అమరావతికి తరలించే పనిలో సీఎస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం జూన్ కల్లా హైదరాబాద్ నుంచి అన్ని శాఖల ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటివరకు సచి వాలయంలోని శాఖల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమంది అమరావతికి వెళ్లారు? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అనే వివరాలను రాబట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నమూనా ప త్రంలో మంగళవారం సాయంత్రంలోగా సాధారణ పరిపాలన శాఖకు వివరాలు అందజేయాల్సిందిగా సీఎస్ సోమవారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడు వెళ్ళేదీ, పూర్తి స్థాయిలో ఎప్పటికి అమరావతికి వెళతారు? తేదీలను తెలియజేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ తేదీన నిర్వహించే అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో ఆయా అంశాలు, వివరాలపై సమీక్ష ఉంటుందని తెలిపారు.
భూముల ధరలు పెంచేందుకేనా..?
హైదరాబాద్ నుంచి అధికారులు, ఉద్యోగులను వీలైనంత త్వరగా అమరావతికి తరలించడం వల్ల అక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తద్వారా ప్రభుత్వ పెద్దలకు అక్కడ ఉన్న భూముల ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వం హడావుడి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి ధరలు రాగానే ఆ భూములను విక్రయించుకోవచ్చనేది ప్రభుత్వ పెద్దల యోచనగా చెబుతున్నారు.