- పెరిగిన భూముల ధరలు
- తగ్గిన రిజిస్ట్రేషన్ల సంఖ్య
- భారీగా పడిపోయిన ఆదాయం
- రాజధాని ప్రకటన కోసం ఎదురు చూపులు
ఏలూరు : రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినప్పటి నుంచి జిల్లాలో భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన పూర్తి కావటంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. దానికి తోడు జిల్లాకు సమీపంలో రాజధాని ఏర్పాటు కానుందనే ఊహాగానాలు భూముల ధరల బూమ్‌కు కారణమయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచే వ్యవసాయ, ఇతర భూముల ధరలు పెరుగుతూ వచ్చాయి.
జిల్లా సరిహద్దులోని హనుమాన్ జంక్షన్‌లో ఎకరం భూమి విలువ రూ. కోటి పై మాటే. వట్లూర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గ్రామాల్లోను ఎకరం రూ.75 లక్షలు పలుకుతోంది. ధరలు విపరీతంగా పెరగటంతో భూములు కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. జిల్లాలో భూములకు సంబంధించి నెలకు సగటున 12 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ సంఖ్య ఏడు వేలు కూడా దాటటం లేదు. రిజిస్ట్రేషన్‌ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(ఏప్రిల్, మే, జూన్ నెలలు)కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ భీమవరం జిల్లా పరిధిలో రూ.42 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.27 కోట్లే సమకూరింది. ఏలూరు జిల్లా కార్యాలయం పరిధిలో రూ.27 కోట్లు లక్ష్యం కాగా రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది.
గత ఏడాది లక్ష్యంలో 57 శాతమే ఆదాయం
2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం సుమారు 1.20 లక్షల భూముల క్రయవిక్రయాల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయని అంచనా కాగా 80 వేలు మాత్రం జరిగాయి. మొత్తం రూ.333 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా కేవలం రూ.190 కోట్లు సమకూరాయి. లక్ష్యంలో 57 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. ఈ పరిస్థితికి రాష్ట్ర విభజనే కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
వారంలో భూముల ప్రభుత్వ విలువ పెంపు
వచ్చే నెలలో పట్టణాల్లో భూముల ప్రభుత్వ విలువను రిజిస్ట్రేషన్‌శాఖ సవరించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విలువ , బహిరంగ మార్కెట్‌ల్లో వాస్తవ విలువను పరిగణనలోకి తీసుకుని భూముల విలువను 30 శాతం పెంచనున్నారు. దీనిపై రిజిస్ట్రేషన్‌శాఖ సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపింది. వారం రోజుల్లో విలువ పెంపు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాజధాని వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటాయని రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.
రిజిస్ట్రేషన్లరాబడి ఢమాల్
Published Fri, Jul 4 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement