అవని.. ఆకాశమే హద్దని
జిల్లాలో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సామాన్య, మధ్య తరగతి జనం సెంటు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తూ రియల్టర్లు భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు.
నరసాపురం అర్బన్ : జిల్లాలో భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. జిల్లాలో మారుమూల ఉన్న నరసాపురంలో మార్కెట్ ప్రాంతంలో గజం స్థలం రూ. 2 లక్షలు పైనే పలుకుతోంది. ఏలూరు నగరంతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. ఈ పట్టణాల్లోని మారుమూల కూడా గజం రూ.15 వేలకు చేరింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పాలకులు అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తుండడం, ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భూమ్ తీసుకొచ్చి ధరలు పెంచేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు ముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ మంది. ఒకానొక దశలో భూములను కొనుగోలు చేసేవారు కరువయ్యారు.
అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, అనేక రకాల పరిశ్రమలు స్థాపిస్తామనే ప్రకటనలు గుప్పించడంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రధాన పట్టణాల్లో భూముల ధరలు రివ్వున ఆకాశాన్ని తాకాయి. జిల్లాకు శివారున ఉండే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సైతం పంట భూములు ఎకరం రూ.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన అపార్ట్‌మెంట్ల సంస్కృతి పల్లెలకూ పాకుతోంది.
ఏలూరు కార్పొరేషన్‌తో సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు సంబంధించి 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం కూడా పేదలకు నివాస గృహాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. భూముల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మారింది.