సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.
మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.
శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.
మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.
ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.
ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment