పాఠాలు నేర్వలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల ధరలు ఆకాశన్నంటుతుండడం.. శివార్లలో వలసలు పెరిగిపోవడంతో ఆక్రమణకు గురవుతున్న సర్కారు స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 2008లో 166 జీఓను జారీ చేసింది. చాలా ఏళ్ల తర్వాత క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించడంతో 90,677 దరఖాస్తులొచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు 79,549 దరఖాస్తులు తిరస్కరించగా, 7,683 దరఖాస్తులకు మాత్రమే జిల్లాస్థాయి కమిటీ ఆమోదముద్ర వేసింది.
80 గజాలవే ఎక్కువ..
క్రమబద్ధీకరించిన వాటిలో అధికం 80 చదరపు గజాల్లోపు స్థలాలే. ఈ కేటగిరీలో 32,927 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చిన జిల్లాస్థాయి కమిటీ 3,811 అర్జీలను ఓకే చే యడం ద్వారా 53.05 ఎకరాలను క్రమబద్ధీకరించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించడంతో ఖజానాకు నయాపైసా సమకూరలేదు.
ఇక 81-250 గజాలకు సంబంధించి 3,872 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన యంత్రాంగం 110.12 ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించింది. 251 నుంచి 500 చ.గజాల వరకు వచ్చినవాటిలో 1,064 దరఖాస్తులకు సీసీఎల్‌ఏ మోక్షం కలిగించింది. తద్వారా 72.18 ఎకరాలను క్రమబద్ధీకరించింది. ఆపై విస్తీర్ణం కలిగిన చాలావాటిని ప్రభుత్వం తిరస్కరించగా, 351 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయి.
లోపాల పుట్ట!
కమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 58,59 జీఓలు తప్పుల తడకగా ఉన్నాయి. మరి ముఖ్యంగా కనీస ధరల వర్తింపులో మార్కెట్ ధరలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా 2014 బేసిక్ వాల్యూ మేరకు స్థలాలను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం దరఖాస్తుదారులకు ఆశనిపాతంగా పరిణమించింది. శివార్లలో ఇప్పటికే కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్‌లో కంటే రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
ఉదాహరణకు మాదాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం కనీస ధర రూ.20వేలు పలుకుతుండగా, ఈ విలువను చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించాలనడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నవారికీ, ఇటీవల ఆక్రమించిన వారిని ఒకే గాటిన కట్టడాన్ని అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి.
యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణలోనూ ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్మాణాలుంటేనే స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని నిబంధన విధించింది. రెండు తప్పులు చేసిన వారిపట్ల కరుణ చూపి.. తెలిసో తెలియకో స్థలం కొన్నపాపానికి తమను శిక్షించడమేమిటనే వాదన వినిపిస్తోంది. సేల్‌డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ, నిర్మాణం లేదనే సాకుతో తమను విస్మరించడంపై అభ్యంతరం చెబుతున్నారు. క్రమబద్ధీకరించే స్థలంపై పరిమితి విధించకపోవడంతో భారీ విస్తీర్ణంలోని సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు కూడా ఈ ముసుగులో రెగ్యులరైజ్ అవుతాయనే ప్రచారమూ జరుగుతోంది. క్రమబద్ధీకరణ అధికారం ఆర్డీఓలకు కట్టబెట్టడాన్ని రెవెన్యూ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి.
గతంలో 80 గజాల్లోపు జాగాల క్రమబద్ధీకరణలో నామమాత్రపు ఫీజును వసూలు చేయడం ద్వారా స్థలంపై హక్కులను కల్పించారు. తాజాగా స్థల విస్తీర్ణం పెంచినప్పటికీ, స్థలంపై యాజమాన్య హక్కులు లేకపోవడం పేదలను నిరాశపరుస్తోంది.
-166 జీఓ కింద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, యూఎల్‌సీ కింద దరఖాస్తు చేసుకున్నవాటికీ, ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించినవారికీ ఇప్పటి ధరల తరుగుదలను వర్తింపజేస్తారా? లేదా అనే అంశంపై స్పష్టీకరించలేదు.