
రియల్ వ్యాపారులకు షాక్
‘వీజీటీఎం’లో ఇప్పటికే పంచాయతీల అనుమతితో వెలసిన వె ంచర్లు
పంచాయతీల అధికారాలకు కత్తెరతో అగమ్యగోచరంగా మారిన స్థితి
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తగ్గనున్న భూముల ధరలు
విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం వీజీటీఎం ఉడా పరిధిలో లేఔట్ల అనుమతులను నిలిపివేసిన ప్రభుత్వం.. బుధవారం ఉడా పరిధిలోని పంచాయతీలు సైతం లేఔట్లకు అనుమతులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ. 300 కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాల పరిస్థితి అగమ్య గోచరం కానుంది. రాజధాని నిర్మాణం పేరుతో మూడు నెలలుగా విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయి. అమెరికాలోని న్యూజెర్సీ పట్టణంలో ఎకరం భూమి రూ. 5.5 కోట్లు పలుకుతుంటే.. ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 12 కోట్లకు చేరుకుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడే ఆశ్చర్యం వ్యక్తంచేశారంటే భూముల ధరలు ఏమేరకు పెరిగాయో అర్థమవతుంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా లేఔట్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. అనేకమంది వ్యాపారులు భూమి కొనుగోలు ధరలో రైతులకు 20 శాతం చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. మూడు, నాలుగు నెలల్లో వీటిని లేఔట్లుగానో, ఏకమొత్తంగానో విక్రయించి సొమ్ము చేసుకునేలా రంగంలోకి దిగారు. ఉడా పరిధిలో ఇప్పటి దాకా 466 లేఔట్లకు అనుమతులు మంజూరు చేశారు. ఈ అనుమతుల కోసం మరో 40 దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయి.
ఇప్పటికే 400 ఎకరాల్లో 100 వెంచర్లు...
సాధారణంగా ఉడాకు లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అధికారిక ప్రక్రియ మొత్తం పూర్తయి అనుమతి రావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఈ కారణంతో తొలుత పంచాయతీల అనుమతులు తీసుకుని వెంచర్లు వేసి విక్రయించి ఆ తర్వాత ఉడాకు దరఖాస్తు చేసుకునే ఆలోచనతో దాదాపు 400 ఎకరాల్లో సుమారు 100 వెంచర్లు వెలిశాయి. రాజధాని వస్తే బ్రహ్మాండం జరిగిపోతుందనే ఆశతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఇక్కడకు వచ్చి లేఔట్లలో ఇంటి స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నదికి అటు, ఇటు రివర్ వ్యూ (నదీముఖ) రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో గత నెల రోజులుగా మంగళగిరి, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో లేఔట్లలోని ఇంటి స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉడా పరిధిలో లేఔట్లు, నూతన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు నిలిపివేయాలని మూడు రోజుల కిందట ప్రభుత్వం ఉడాకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామం రియల్టర్లకు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే బుధవారం వీజీటీఎం పరిధిలోని 52 మండలాల్లో ఉన్న 826 పంచాయతీల అధికారాలన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం రియల్టర్లకు శరాఘాతంగానే చెప్పవచ్చు. రియల్టర్లు కొనుగోలు చేసిన భూముల్లో వెంచర్లు వేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూముల కొనుగోలుకు కళ్లెం వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రైతులకూ ఇబ్బందులే...
రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో రైతులు అనివార్యంగా ప్రభుత్వానికే తమ భూములు అప్పగించేలా చేసే వ్యూహంతోనే వీజీటీఎం పరిధిలో లేఔట్లు, ఇతర నిర్మాణాల నిలిపివేత, పంచాయతీల అధికారాల రద్దు జీవోలు జారీ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రియల్టర్లు కొత్తగా భూములు కొనడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదనీ, ఇప్పటికే అగ్రిమెంట్ల మీద ఉన్న భూములను కూడా వ్యాపారులు రైతులకు వెనక్కు ఇచ్చే అవకాశాలు ఉంటాయని రియల్టర్లు చెప్తున్నారు. ఈ జీవోల వల్ల రియల్టర్లకే కాకుండా ఇప్పటి దాకా తమ భూములకు ఉన్న ధరలు తగ్గి రైతులు కూడా నష్టపోయే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.