VGTM UDA
-
ఉడాలో నిపుణులు లేరు
అతి కొద్దిమందే సీఆర్డీఏలోకి.. నోటిఫికేషన్ తర్వాత భూసమీకరణ ‘సాక్షి’తో సీఆర్డీఏ {పత్యేక కమిషనర్ శ్రీకాంత్ విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో నైపుణ్యం ఉన్నవారు కనిపించడంలేదని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) ప్రత్యేక కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెప్పారు. అయినా ఉన్నవారిలో బాగా పనిచేసే కొందరిని సీఆర్డీఏలోకి తీసుకుంటామని తెలిపారు. సీఆర్డీఏ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించిన తర్వాత ఉడాకు వచ్చిన ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, ఇందుకు అనుగుణంగా అత్యంత నైపుణ్యం గలవారి అవసరం ఉందని తెలిపారు. ఆ స్థాయిలో పనిచేసే వారిని గుర్తిస్తున్నామని, త్వరలో ఆ బృందం తయారవుతుందన్నారు. ఉడాలో పనిచేస్తున్న వారిలో అవినీతి ఆరోపణలు, రాజకీయ పలుకుబడి లేనివారి గురించి తెలుసుకుంటున్నామని, అందరితో చర్చించి సీఆర్డీఏలోకి తీసుకుంటామన్నారు. మిగిలిన వారి విషయంలో నిర్ణయం ప్రభుత్వానిదే.. సీఆర్డీఏకు తీసుకోగా, మిగిలిన వారిని ఎక్కడ పని చేయించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని శ్రీకాంత్ చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారికి, సీఆర్డీఏ ఏర్పాటు తర్వాత వేరేచోటకు వెళ్లే వారికి పెన్షన్, ఇతర సౌకర్యాలు ఇక్కడి నుంచి లభిస్తాయని తెలిపారు. కొత్త రాజ ధానిలో సీఆర్డీఏ కార్యాలయం ఏర్పాటుకు చాలా సమయం పడుతుందని, అప్పటివరకూ ఉడా కార్యాలయాన్నే సీఆర్డీఏ కార్యాలయంగా వినియోగిస్తామని చెప్పారు. భూసమీకరణ సిబ్బంది, అధికారులంతా గుంటూరు కేంద్రంగా పనిచేస్తారని తెలి పారు. ఎంపికైన సిబ్బందికి, వచ్చే నెల 19 నుంచి సీఆర్డీఏ సిబ్బంది 30 మందికి వారం రోజులపాటు సింగపూర్ ప్రభుత్వ సంస్థ ద్వారా శిక్షణ ఉంటుందన్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగానే భూ సమీకరణ ఉంటుందని, వారి కోసమే ఇంత కష్టపడుతున్నామని చెప్పారు. సీఆర్డీఏ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి పని ప్రారంభిస్తామని, ఇప్పటికే ఉన్న వారికి సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాల పనులు అప్పగించామని చెప్పారు. అందరి సలహాలు, సూచనలతో ముందుకువెళతామని, అత్యుత్తమ రాజధాని నిర్మాణమే అందరి లక్ష్యమని ఆయన వివరించారు. -
ఉడా రద్దంటారు.. పనులు ముద్దంటారు
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా అభివృద్ధి పనులు మళ్లీ మొదలు కానున్నాయి. కొద్ది రోజుల్లో ఉడా రద్దు కానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ఖరారు చేస్తూ టెండర్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ పనులన్నీ గత ఏడాది జూన్‌లో ఖరారు చేసినవే. విజయవాడ, గుంటూరు నగరాల్లో కొన్ని ప్రధాన రోడ్లకు అనుసంధానంగా బీటీ రోడ్లు నిర్మించటానికి గతంలో ఉడా రూ.6.5 కోట్లతో కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను గత సెప్టెంబర్‌లో జరిగిన ఉడా పాలకవర్గ సమావేశం ఆమోదించింది. వెంటనే ఆ ప్రతిపాదనలను ఉడా చైర్మన్, వైస్‌చైర్మన్ పరిశీలించి ఖరారు చేశారు. మున్సిపల్ శాఖలోని టెండర్ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ శాఖ కూడా వారంరోజుల కిందట పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి 13 నెలలకుపైగా పట్టడం గమనార్హం. చర్చనీయాంశం : రాజధాని నిర్మాణం కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్(సీఆర్డీఏ) అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. దీన్ని ఉడా స్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వీజీటీఎం ఉడా గతంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలు కొన్ని ఖరారైనా నిలిచిపోయాయి. ఇలాంటి తరుణంలో పెండింగ్ పనులకు ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశమైంది. పనులివీ : విజయవాడ నగరంలో ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు నుంచి నవతా ట్రాన్స్పోర్ట్ కార్యాలయం మీదుగా కానూరు వరకు బీటీ రోడ్డును రూ.77.96 లక్షలతో నిర్మించనున్నారు. గుంటూరు నగరంలో ఏటి అగ్రహారం జీరో లైన్ సమీపంలోని ఆర్.యు.బి. నుంచి శ్యామల్నగర్ వరకు రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణానికి రూ.1.77 కోట్లు, సుద్దపల్లి డొంక నుంచి ఎన్‌హెచ్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.87 కోట్లు, అలాగే నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో కనెక్టివిటి రోడ్డు నిర్మాణానికి రూ.1.13 కోట్లు, జేకేసీ కళాశాల నుంచి విద్యానగర్ వరకు ఉన్న డొంక రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు రూ.99.70 లక్షలు కేటాయించారు. దీనిపై ఉడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.ఎస్. శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పనులను టెండర్ కమిటీ ఖరారు చేసిన తర్వాత జీవో వచ్చిందని, వారం రోజుల్లో ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు అందజేస్తామని చెప్పారు. -
రియల్ వ్యాపారులకు షాక్
‘వీజీటీఎం’లో ఇప్పటికే పంచాయతీల అనుమతితో వెలసిన వె ంచర్లు పంచాయతీల అధికారాలకు కత్తెరతో అగమ్యగోచరంగా మారిన స్థితి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తగ్గనున్న భూముల ధరలు విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం వీజీటీఎం ఉడా పరిధిలో లేఔట్ల అనుమతులను నిలిపివేసిన ప్రభుత్వం.. బుధవారం ఉడా పరిధిలోని పంచాయతీలు సైతం లేఔట్లకు అనుమతులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ. 300 కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాల పరిస్థితి అగమ్య గోచరం కానుంది. రాజధాని నిర్మాణం పేరుతో మూడు నెలలుగా విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయి. అమెరికాలోని న్యూజెర్సీ పట్టణంలో ఎకరం భూమి రూ. 5.5 కోట్లు పలుకుతుంటే.. ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 12 కోట్లకు చేరుకుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడే ఆశ్చర్యం వ్యక్తంచేశారంటే భూముల ధరలు ఏమేరకు పెరిగాయో అర్థమవతుంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చుట్టుపక్కల 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా లేఔట్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. అనేకమంది వ్యాపారులు భూమి కొనుగోలు ధరలో రైతులకు 20 శాతం చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. మూడు, నాలుగు నెలల్లో వీటిని లేఔట్లుగానో, ఏకమొత్తంగానో విక్రయించి సొమ్ము చేసుకునేలా రంగంలోకి దిగారు. ఉడా పరిధిలో ఇప్పటి దాకా 466 లేఔట్లకు అనుమతులు మంజూరు చేశారు. ఈ అనుమతుల కోసం మరో 40 దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయి. ఇప్పటికే 400 ఎకరాల్లో 100 వెంచర్లు... సాధారణంగా ఉడాకు లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అధికారిక ప్రక్రియ మొత్తం పూర్తయి అనుమతి రావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. ఈ కారణంతో తొలుత పంచాయతీల అనుమతులు తీసుకుని వెంచర్లు వేసి విక్రయించి ఆ తర్వాత ఉడాకు దరఖాస్తు చేసుకునే ఆలోచనతో దాదాపు 400 ఎకరాల్లో సుమారు 100 వెంచర్లు వెలిశాయి. రాజధాని వస్తే బ్రహ్మాండం జరిగిపోతుందనే ఆశతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాలకు చెందిన అనేక మంది ఇక్కడకు వచ్చి లేఔట్లలో ఇంటి స్థలాలు, ఎకరాల కొద్దీ భూములు కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణా నదికి అటు, ఇటు రివర్ వ్యూ (నదీముఖ) రాజధాని ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడంతో గత నెల రోజులుగా మంగళగిరి, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతంలో లేఔట్లలోని ఇంటి స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉడా పరిధిలో లేఔట్లు, నూతన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు నిలిపివేయాలని మూడు రోజుల కిందట ప్రభుత్వం ఉడాకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామం రియల్టర్లకు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే బుధవారం వీజీటీఎం పరిధిలోని 52 మండలాల్లో ఉన్న 826 పంచాయతీల అధికారాలన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం రియల్టర్లకు శరాఘాతంగానే చెప్పవచ్చు. రియల్టర్లు కొనుగోలు చేసిన భూముల్లో వెంచర్లు వేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూముల కొనుగోలుకు కళ్లెం వేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. రైతులకూ ఇబ్బందులే... రాజధాని నిర్మాణం చేయాలనుకుంటున్న ప్రాంతాల్లో రైతులు అనివార్యంగా ప్రభుత్వానికే తమ భూములు అప్పగించేలా చేసే వ్యూహంతోనే వీజీటీఎం పరిధిలో లేఔట్లు, ఇతర నిర్మాణాల నిలిపివేత, పంచాయతీల అధికారాల రద్దు జీవోలు జారీ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రియల్టర్లు కొత్తగా భూములు కొనడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదనీ, ఇప్పటికే అగ్రిమెంట్ల మీద ఉన్న భూములను కూడా వ్యాపారులు రైతులకు వెనక్కు ఇచ్చే అవకాశాలు ఉంటాయని రియల్టర్లు చెప్తున్నారు. ఈ జీవోల వల్ల రియల్టర్లకే కాకుండా ఇప్పటి దాకా తమ భూములకు ఉన్న ధరలు తగ్గి రైతులు కూడా నష్టపోయే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రెండుగా చీలనున్న వీజీటీఎం ఉడా
గుంటూరు: కృష్ణా, గుంటూరు జిల్లాలకు సేవలు అందిస్తున్న వీజీటీఎం ఉడాను రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొత్త పదవులను సృష్టించేందుకు, కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టేందుకు రెండు జిల్లాలకు వేర్వేరుగా అర్బన్ డెవలప్మెంట్ అథార్టీలను ఏర్పాటు చేయవచ్చంటూ కొందరు పదవీ విరమణ చేసిన మున్సిపల్ ఉన్నతాధికారులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనలను తెరపైకి తీసుకువచ్చారు. వీజీటీఎం ఉడాను కృష్ణా జిల్లాలో విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథార్టీగా, గుంటూరులో అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథార్టీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. అమరావతిలోని బుద్ధుని విగ్రహాన్ని ఇందులో చిహ్నంగా ఏర్పాటు చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఈ ప్రతిపాదనలను ఇవ్వడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని చెబుతున్న హామీలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ మరో కొత్త పదవి సృష్టించడానికేనని స్వపక్షంలోనే విమర్శలు వినపడుతున్నాయి. చైర్మన్ పదవి కృష్ణాకు పోతుందనే... వీజీటీఎం పరిధిలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలు ఉన్నాయి. వీటి పరిధిని పెంచుతూ నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీజీటీఎం చైర్మన్‌తో పాటు డెరైక్టర్లను నామినేట్ చేసింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాయకుల దృష్టి ఈ పదవిపై పడింది. అయితే విజయవాడకు చెందిన నాయకులకు పదవి దక్కే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు వీజీటీఎంను రెండుగా చీల్చి గుంటూరు జిల్లాలోని ముఖ్య పట్టణాలను విస్తరించి అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథార్టీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను తీసుకువస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, పెదకూరపాడు, అమరావతి, గురజాల పట్టణాలను కలిపి అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథార్టీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకువస్తున్నారు. వెంకయ్య ప్రకటనతో పెరిగిన ప్రాధాన్యం మరోవైపు విజయవాడ-గుంటూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనకు తోడు ఇక్కడే రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రజాతినిధులు చెబుతుండటంతో పట్టణాభివృద్ధి సంస్థ ప్రాధాన్యం పెరిగింది. రాజధాని నిర్మాణంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం అధికంగా విడుదల చేయనున్న నిధులను ప్రారంభంలో ఉడానే వినియోగించాల్సి ఉంటుంది. ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభంలో ప్రత్యేకంగా కొన్ని సర్కిల్స్ ఏర్పాటు చేసినట్టుగానే ఉడాలోని ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎస్టేట్ వంటి విభాగాలను విస్తరించే అవకాశం ఉంది. వీటన్నింటిని టీడీపీ నాయకులు వారి ప్రతిపాదనల్లో పొందుపరుస్తున్నారు. పదవుల కోసమా.... అభివృద్ధి కోసమా.. టీడీపీ నాయకులు కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ ఏర్పాటు అంశం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. నిన్నటి వరకు వీజీటీఎం ద్వారానే అభివృద్ధి పనులు నిర్వహించాలని భావించిన ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హఠాత్తుగా ఉడాను రెండుగా ఎందుకు విడదీయాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అభివృద్ధికి నిధులు రాబట్టడం ఒక ఎత్తయితే పదవుల కోసం నూతన ఉడాను ఏర్పాటు చేయడం మరో ఎత్తుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.