
ఉడాలో నిపుణులు లేరు
అతి కొద్దిమందే సీఆర్‌డీఏలోకి..
నోటిఫికేషన్ తర్వాత భూసమీకరణ
‘సాక్షి’తో సీఆర్‌డీఏ {పత్యేక కమిషనర్ శ్రీకాంత్
విజయవాడ బ్యూరో : వీజీటీఎం ఉడాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో నైపుణ్యం ఉన్నవారు కనిపించడంలేదని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్‌డీఏ) ప్రత్యేక కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెప్పారు. అయినా ఉన్నవారిలో బాగా పనిచేసే కొందరిని సీఆర్‌డీఏలోకి తీసుకుంటామని తెలిపారు. సీఆర్‌డీఏ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించిన తర్వాత ఉడాకు వచ్చిన ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, ఇందుకు అనుగుణంగా అత్యంత నైపుణ్యం గలవారి అవసరం ఉందని తెలిపారు. ఆ స్థాయిలో పనిచేసే వారిని గుర్తిస్తున్నామని, త్వరలో ఆ బృందం తయారవుతుందన్నారు. ఉడాలో పనిచేస్తున్న వారిలో అవినీతి ఆరోపణలు, రాజకీయ పలుకుబడి లేనివారి గురించి తెలుసుకుంటున్నామని, అందరితో చర్చించి సీఆర్‌డీఏలోకి తీసుకుంటామన్నారు.
మిగిలిన వారి విషయంలో నిర్ణయం ప్రభుత్వానిదే..
సీఆర్‌డీఏకు తీసుకోగా, మిగిలిన వారిని ఎక్కడ పని చేయించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని శ్రీకాంత్ చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన వారికి, సీఆర్‌డీఏ ఏర్పాటు తర్వాత వేరేచోటకు వెళ్లే వారికి పెన్షన్, ఇతర సౌకర్యాలు ఇక్కడి నుంచి లభిస్తాయని తెలిపారు. కొత్త రాజ ధానిలో సీఆర్‌డీఏ కార్యాలయం ఏర్పాటుకు చాలా సమయం పడుతుందని, అప్పటివరకూ ఉడా కార్యాలయాన్నే సీఆర్‌డీఏ కార్యాలయంగా వినియోగిస్తామని చెప్పారు. భూసమీకరణ సిబ్బంది, అధికారులంతా గుంటూరు కేంద్రంగా పనిచేస్తారని తెలి పారు. ఎంపికైన సిబ్బందికి, వచ్చే నెల 19 నుంచి సీఆర్‌డీఏ సిబ్బంది 30 మందికి వారం రోజులపాటు సింగపూర్ ప్రభుత్వ సంస్థ ద్వారా శిక్షణ ఉంటుందన్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగానే భూ సమీకరణ ఉంటుందని, వారి కోసమే ఇంత కష్టపడుతున్నామని చెప్పారు. సీఆర్‌డీఏ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి పని ప్రారంభిస్తామని, ఇప్పటికే ఉన్న వారికి సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాల పనులు అప్పగించామని చెప్పారు. అందరి సలహాలు, సూచనలతో ముందుకువెళతామని, అత్యుత్తమ రాజధాని నిర్మాణమే అందరి లక్ష్యమని ఆయన వివరించారు.