
రెండుగా చీలనున్న వీజీటీఎం ఉడా
గుంటూరు: కృష్ణా, గుంటూరు జిల్లాలకు సేవలు అందిస్తున్న వీజీటీఎం ఉడాను రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొత్త పదవులను సృష్టించేందుకు, కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టేందుకు రెండు జిల్లాలకు వేర్వేరుగా అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీలను ఏర్పాటు చేయవచ్చంటూ కొందరు పదవీ విరమణ చేసిన మున్సిపల్ ఉన్నతాధికారులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనలను తెరపైకి తీసుకువచ్చారు. వీజీటీఎం ఉడాను కృష్ణా జిల్లాలో విజయవాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీగా, గుంటూరులో అమరావతి అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.
అమరావతిలోని బుద్ధుని విగ్రహాన్ని ఇందులో చిహ్నంగా ఏర్పాటు చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఈ ప్రతిపాదనలను ఇవ్వడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని చెబుతున్న హామీలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ మరో కొత్త పదవి సృష్టించడానికేనని స్వపక్షంలోనే విమర్శలు వినపడుతున్నాయి.
చైర్మన్ పదవి కృష్ణాకు పోతుందనే...
వీజీటీఎం పరిధిలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలు ఉన్నాయి. వీటి పరిధిని పెంచుతూ నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీజీటీఎం చైర్మన్‌తో పాటు డెరైక్టర్లను నామినేట్ చేసింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాయకుల దృష్టి ఈ పదవిపై పడింది. అయితే విజయవాడకు చెందిన నాయకులకు పదవి దక్కే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
దీంతో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు వీజీటీఎంను రెండుగా చీల్చి గుంటూరు జిల్లాలోని ముఖ్య పట్టణాలను విస్తరించి అమరావతి అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను తీసుకువస్తున్నారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, పెదకూరపాడు, అమరావతి, గురజాల పట్టణాలను కలిపి అమరావతి అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకువస్తున్నారు.
వెంకయ్య ప్రకటనతో పెరిగిన ప్రాధాన్యం
మరోవైపు విజయవాడ-గుంటూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర పట్టణాభివద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనకు తోడు ఇక్కడే రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రజాతినిధులు చెబుతుండటంతో పట్టణాభివృద్ధి సంస్థ ప్రాధాన్యం పెరిగింది. రాజధాని నిర్మాణంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం అధికంగా విడుదల చేయనున్న నిధులను ప్రారంభంలో ఉడానే వినియోగించాల్సి ఉంటుంది. ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభంలో ప్రత్యేకంగా కొన్ని సర్కిల్స్ ఏర్పాటు చేసినట్టుగానే ఉడాలోని ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎస్టేట్ వంటి విభాగాలను విస్తరించే అవకాశం ఉంది. వీటన్నింటిని టీడీపీ నాయకులు వారి ప్రతిపాదనల్లో పొందుపరుస్తున్నారు.
పదవుల కోసమా.... అభివృద్ధి కోసమా..
టీడీపీ నాయకులు కొత్తగా తెరపైకి తీసుకువచ్చిన అమరావతి అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ ఏర్పాటు అంశం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. నిన్నటి వరకు వీజీటీఎం ద్వారానే అభివృద్ధి పనులు నిర్వహించాలని భావించిన ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హఠాత్తుగా ఉడాను రెండుగా ఎందుకు విడదీయాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అభివృద్ధికి నిధులు రాబట్టడం ఒక ఎత్తయితే పదవుల కోసం నూతన ఉడాను ఏర్పాటు చేయడం మరో ఎత్తుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.