వికారాబాద్: వికారాబాద్ ప్రాంతానికి ప్రస్తుతం మహర్దశ మొదలైంది. ఇప్పటికే కాసుల వర్షం ప్రారంభమైంది. రానున్నకాలం మరింత దేదీప్యమానం కానుందని ఈ ప్రాంతీయులు ఆకాంక్షిస్తున్నారు. వికారాబాద్ పట్టణం జిల్లాకేంద్రం కావడం దాదాపుగా ఖరారవడంతో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ముఖ్యంగా భూముల ధరలు అమాంతం ఆకాశానికి అంటుతున్నాయి.
గతంలో ధరలతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలు రెండుమూడు రెట్లు పెరిగిపోయాయి. పట్టణానికి 15 కిలోమీటర్ల వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇళ్ల స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలాచోట్ల సాగుభూముల్ని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 కిలో మీటర్ల వరకు పట్టణం విస్తరించింది.ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని అనంతగిరి గుట్ట మొదలు కొని హైదరాబాద్ వైపు,కొత్తగడి మొదలుకొని పరిగి వైపు వెళ్ళే దారి వెంట లే అవుట్‌లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. పలువురు వ్యాపారులు,ఉద్యోగులు,ధనవంతులు,మధ్యతరగతి వర్గాలు ఇళ్ల స్థలాలు, ఫాంహౌజ్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఈ ప్రాంతంలో పట్టాభూములు దొరకని పరిస్థితి నెలకొంది.
శాటిలైట్‌టౌన్ ఊతం...
నెల కిందట శాటిలైట్‌టౌన్‌కు సంబంధించిన పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించడంతో పాటు మంజీరానీరు వికారాబాద్‌కు ఇటీవల రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు అనంతగిరి పర్యాటక కేంద్రం అభివృద్ధి జరగడం, జాతీయ ప్రిజన్ అకాడమీ, జిల్లా జైలు, ఆల్ట్రామోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం, జిల్లా కోర్టు, రూర ల్ చిన్న తరహా పరిశ్రమల యువకుల వృత్తి విద్యా శిక్షణ కే ంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వికారాబాద్‌కు మంజూరవడం వల్ల కూడా ఇక్కడ సందడి పెరిగింది.
జిల్లాకేంద్రంగా మారను న్న వికారాబాద్‌లో కొన్ని పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే మూడేళ్ల క్రితం ఎకరానికి రూ.5 నుంచి 10 లక్షల ధర ఉండగా ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి 90 లక్షలకు చేరింది. రాన్రాను భూముల ధరలు అందుబాటులో లేకుండా పోవడంతో రియల్టర్లు సైతం గ్రూపులుగా ఏర్పడి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. స్థానికులతో పాటు హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, తాండూర్, జహీరాబాద్, సంగారెడ్డి, చేవెళ్ల తదితర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్టర్లు ఇక్కడ భూముల్ని కొనుగోలు చేస్తున్నారు. క్రమంగా పట్టణంలో ప్రధాన దారుల వెంట ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, స్విమింగ్‌పూల్స్, కళాశాలలు, కల్యాణ మండపాలు ఏర్పాటవుతున్నాయి. పనికిరాని పోరంబోకు భూమి సైతం ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోంది.
జిల్లా కేంద్రం కానున్నవికారాబాద్
Published Thu, Sep 18 2014 12:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement