భూమి విలువ పెంచండి | Revanth Reddy: Revise Market Value of Lands in Telangana | Sakshi
Sakshi News home page

భూమి విలువ పెంచండి

Published Fri, May 17 2024 3:20 AM | Last Updated on Fri, May 17 2024 3:20 AM

Revanth Reddy: Revise Market Value of Lands in Telangana

రాష్ట్రంలో భూముల ధరల పెంపునకు చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్‌ 

రిజిస్ట్రేషన్‌ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని వెల్లడి

నిబంధనల ప్రకారం ఏడాదికోసారి పెంచాలి 

రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు,  స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి 

ఆ స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదు 

ఏయే ప్రాంతాల్లో ధరలు సవరించాలి.. వేటికి ఎంత సవరించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలి 

రాబడి పెంపుతో పాటు  స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా సవరణ ఉండాలి 

ఆదాయం పెంపు మార్గాలపై ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్‌ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్‌ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్‌ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.

నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్‌ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని   ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.   

స్టాంప్‌ డ్యూటీపై అధ్యయనం చేయండి 
‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి.   రిజిస్ట్రేషన్‌ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా    పాటించాలి. రాష్ట్ర రాబడి  పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్‌ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్‌ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి 
‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి.  

తనిఖీలు, ఆడిటింగ్‌ పక్కాగా జరగాలి 
బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్‌ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్‌ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు 

ఆదాయం ఎందుకు పెరగలేదు? 
గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్‌ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్‌రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement