‘ఈ-సిటీ’లో భూమి ధరపై పీటముడి!
ప్లాంట్ల ఏర్పాటుకు 63 కంపెనీల ప్రతిపాదన
రెండు దశల్లో రూ.1,365 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన
ఎకరా రూ.35 లక్షలు చెబుతున్న ఏపీఐఐసీ
రూ.20 లక్షలకు ఇవ్వకుంటే కష్టమంటున్న కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షరాలా అరవై మూడు కంపెనీలు 248 ఎకరాలు కావాలంటున్నాయి. ఇస్తే రెండు దశల్లో రూ.1,365 కోట్లు పెట్టుబడి పెడతామంటూ ప్రతిపాదిస్తున్నాయి. అయితే భూమి ధరపై ఏపీఐఐసీకి- ఈ కంపెనీలకు మధ్య అవగాహన కుదిరేలా కనిపించటం లేదు. అదే జరిగితే.. మహేశ్వరంలో ప్రతిపాదించిన ఈ-సిటీలోకి ఇప్పుడిప్పుడే కంపెనీలు రావటమూ కష్టమే!! రాష్ట్రంలో అనిశ్చితి దృష్ట్యా కంపెనీలు రావటమే కష్టమవుతున్న తరుణంలో ఏపీఐఐసీ ఇలా మంకుపట్టు పట్టి కూర్చోవటం సరికాదనే వాదనలు వినిపిస్తుండగా... పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని కంపెనీలు ఈ రకమైన బేరాలకు దిగటం కూడా సరికాదని ఏపీఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కథేంటో మీరూ చూడండి...
మహేశ్వరం దగ్గరి ఫ్యాబ్ సిటీలోని 602 ఎకరాల్లో ‘ఈ-సిటీ’ పేరిట ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ఏఏ ప్రోత్సాహకాలిస్తారో చెబుతూ ఏపీఐఐసీ కొన్ని సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ పరిశ్రమల సంఘానికి (ఎలియాప్) చెందిన 63 కంపెనీలు ఏపీఐఐసీకి ప్రతిపాదనలు పంపాయి. కనిష్టంగా రూ. కోటి, గరిష్టంగా రూ.350 కోట్ల వరకూ పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఈ కంపెనీలు... రెండుదశల్లో మొత్తం రూ.1,326 కోట్లు పెట్టుబడి పెడతామన్నాయి. వీటివల్ల ప్రత్యక్షంగా 34,200 మందికి ఉపాధి కలుగుతుందని కూడా పేర్కొన్నాయి. పరిశ్రమలన్నీ ఒకేచోట వస్తాయని, పెపైచ్చు ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్, శంషాబాద్ విమానాశ్రయం వంటివి అదనపు సౌలభ్యాన్నిస్తాయని భావించటంతో కంపెనీలు ఈ-సిటీపై మొగ్గు చూపుతున్నాయి. కాకుంటే గతంలో ఇక్కడ ఎకరాకు రూ. 15 లక్షల ధర నిర్ణయించిన ఏపీఐఐసీ.. ఇప్పుడు ధరలు పెరిగాయంటూ ఎకరానికి రూ.35 లక్షలు చెబుతోంది. ఎలియాప్ మాత్రం ఎకరాకు రూ.20 లక్షలకు మించి చెల్లించలేమంటోంది. ఏపీఐఐసీ దిగిరాని పక్షంలో తమకు వేరే రాష్ట్రాలకు వెళ్లటం తప్ప మార్గాంతరం లేదంటోంది.
ఇతర రాష్ట్రాల్లో ధరలెంత?
ఇతర రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీలకు రాయితీలతో పాటు తక్కువ ధరకే స్థలాన్నిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘‘దేవనహళ్లిలో 3 వేల ఎకరాల్లో కర్ణాటక ప్రభుత్వం ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఎకరా ధర రూ. 5 లక్షలు. హిమాచల్‌ప్రదేశ్‌లో సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ లేదు. సేల్స్ టాక్స్ ఒక్క శాతం మాత్రమే. మన రాష్ట్రంలోనైతే ఎక్సయిజ్ సుంకం 12.5 శాతం, సీఎస్‌టీ 2 శాతం, వ్యాట్ 5 శాతం చెల్లించాలి. వీటన్నిటికీ తోడు ఈ-సిటీ డెవలప్‌మెంట్ ఖర్చుల్లో 20 శాతాన్ని కంపెనీలే భరించాలంటున్నారు. ఇవన్నీ తలకుమించిన భారంగా మారుతున్నాయి’’ అని ఎలియాప్ ఎండీ ఎన్.శివప్రసాద్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. గతంలో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు శామ్‌సంగ్, డెల్, నోకియా ముందుకొచ్చినా... స్థల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో అవి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.
ప్రతిపాదన లిచ్చిన కంపెనీల్లో కొన్ని...
ల్యాంపెక్స్ ఎలక్ట్రానిక్స్: 2 దశల్లో రూ.350 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఎల్‌సీడీ మాడ్యూళ్లు, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌ను తయారీ.
లింక్‌వెల్ టెలీసిస్టమ్స్: రూ.175 కోట్లు పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇది కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్, ఎనర్జీ మీటర్లు తయారు చేస్తుంది.
సులక్షణ సర్క్యూట్: రూ.87.5 కోట్లతో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ప్లాంట్
ఎలికో: రూ.43.75 కోట్లతో టెస్టింగ్ పరికరాలను తయారు చేస్తుంది.
ఈసీఐఎల్ రాపిస్కన్: రూ.43.75 కోట్లతో ఎక్స్-రే, బ్యాగేజ్ స్కానర్స్ ప్లాంటును ఏర్పాటు చేస్తానంటోంది.