జీవో 111 ప్రాంతంలోని ఓ గ్రామం
జీవో 111 ఎత్తివేత స్థిరాస్తి వ్యాపారంపై మిశ్రమ ప్రభావం చూపిస్తోంది. ఓవైపు 111 పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఊపందుకొని మరింతగా ధరలు పెరగొచ్చని రైతులు, భూ యజమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పశ్చిమ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి ఇంకోలా ఉంది. కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ఈ ఏరియాల్లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనేవారు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ధరలు తగ్గొచ్చని అనుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారంలో ఓ రైతు తన నాలుగెకరాల పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. 2 నెలల క్రితం ఎకరాకు రూ.2 కోట్లు వచ్చినా అమ్మాలని భావించాడు. అంతలోనే జీవో 111 ఎత్తివేతపై అసెంబ్లీలో ప్రకటన చేయడం.. తర్వాత ఉత్తర్వులు రావడంతో భూమి ధరను అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఎకరాకు రూ.5 కోట్లకు బేరం పెట్టాడు... ఇది ఈ ఒక్క గ్రామంలోనే కాదు.
111 జీవో పరిధిలోని 84 పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. నిన్నమొన్నటి వరకు జీవో 111ను సవరిస్తారో లేదోనని సందిగ్ధంలో ఉన్న భూ యజమానులు, రైతులు.. తాజాగా ప్రభుత్వం జీవోను రద్దు చేయడంతో ధరలు ఒక్కసారిగా పెంచేశారు. 111 జీవో పరిధిలో లేని ప్రాంతాలతో సమాంతరంగా ఇక్కడ రేట్లు పెరిగాయి.
విధివిధానాలపైనే అందరి దృష్టి
ఆ 84 గ్రామాల పరిధిలోని మాస్టర్‌ప్లాన్‌పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే గానీ గ్రీన్ జోన్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రిక్రియేషన్ జోన్లపై సందిగ్ధత తొలగనుంది. మాస్టర్‌ప్లాన్ అభివృద్ధిపై తొలిసారి భేటీ అయిన కమిటీ.. నెల రోజుల్లో దీనికి తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. ప్లాన్ కొలిక్కి వస్తే భూ విలువలపై స్పష్టత వస్తుందని, అప్పటివరకు ఆగాలని రియల్టర్లు, కొనుగోలుదారులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
రాత్రికి రాత్రే మారిన సీను!
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణకు 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. తద్వారా జీవో పరిధిలోని 84 గ్రామాల్లో నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులపై ఆంక్షలు పెట్టింది. అయితే జీవో 111 జీవో ఎత్తివేతకు సంబంధించి గత నెల 15న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడమే తరువాయి ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
వారం రోజుల క్రితం జీవో 111ను ఎత్తేస్తూ కొత్తగా జీవో 69ను ఇవ్వడంతో ధరలు చుక్కలను తాకాయి. నిన్న మొన్నటివరకు ఎకరా రూ.1 కోటి నుంచి రూ. 2 కోట్లు పలికిన భూములు తాజాగా రూ.3 కోట్ల నుంచి 5 కోట్లకు చేరాయి. ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఉండటంతో రియల్టీ సంస్థలు కూడా భూ నిధి సేకరణలో తలమునకలయ్యాయి. రైతులు మాత్రం భూ విక్రయాలపై ఆచితూచి అడుగులేస్తున్నారు. అమ్మకాలపై తొందరపడకుండా కొన్నాళ్లు వేచిచూడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment