కబ్జా చెరలో చెరువులు
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
లక్షలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు
ఉన్న చెరువులను సైతం రికార్డుల్లో చూపని వైనం
చోడవరం: భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. చెరువులు.. గెడ్డలు.. వేటినీ వదలడం లేదు. సాగునీటి వనరులు కుదించుకుపోయి రై తులు అల్లాడుతున్నారు. వీటిని పరిరక్షిం చాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీటి వెతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల బడా రైతులు చెరువులను ఆక్రమించి తమ సాగులోకి తెచ్చుకుంటుండగా, మరికొన్ని చోట్ల కబ్జాచేసిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా వేసి దర్జాగా అమ్మేసుకుంటున్నారు. మేజర్
చెరువులు ఆక్రమించుకొని తోటలు
కేపీఅగ్రహారంలో 4 చెరువులున్నాయి. సుమారు 800 ఎకరాల ఆయక ట్టు ఉంది. చెరువులు ఆక్రమించుకొని సరుగుడు, చెరకు తోటలు వేసుకొని అనుభవిస్తున్నారు. నీలం చెరువు కింద నాకు 2ఎకరాలు భూమి ఉంది. పూర్తిస్థాయిలో నీరందడంలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -యన్నంశెట్టి గోపి, రైతు, కేపీఅగ్రహారం ఇరిగేషన్‌లో ఉన్న చెరువుల కంటే మైనర్ ఇరిగేషన్‌లో ఉన్న సాగునీటి చెరువులు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉన్న చెరువుల ఆక్రమణ మరీ ఎక్కువగా ఉంది. మైదాన జిల్లాలో సుమారు 1500 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చోడవరం నియోజకవర్గంలోనే సుమారు 246 చెరువులు ఉండగా వీటిలో 180 చెరువుల వరకు కబ్జాలో ఉన్నాయి. ఆక్రమణల వల్ల చెరువులు కుదించుకుపోయి సాగునీరు నిల్వ ఉండే విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఎక్కువ రోజులు పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కొన్ని చెరువుల్లో ఆక్రమణలకు ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలే ఇచ్చేశారంటే ఆయా శాఖల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థమౌతుంది. చోడవరం మండలంలో అడ్డూరు చెరువు ఆక్రమణకు అడ్డులేకుండాపోయింది.
ఖండిపల్లిలో చెరువును కొందరు రైతులు ఆక్రమించుకోవడంతో అక్కడ చెరువు గర్భమే కనిపించడంలేదు. వెంకన్నపాలెం చెరువును ఎకరా వరకు రియల్టర్లు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేస్తుండగా లక్కవరం, బెన్నవోలు, గంధవరం, దుడ్డుపాలెం, గవరవరం, లక్ష్మీపురం, నర్సయ్యపేట, గాంధీగ్రామం చెరువులు కొందరి ఆధీనంలో ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, ఎర్రవాయు ప్రాంతంలో ఉన్న చెరువులు, రావికమతం, రోలుగుంట మండలాల్లో పెద్దచెరువులు కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నాయి. మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయన్న వివరాలు ఇరిగేషన్ శాఖ వద్దే లేకపోవడం ఆ శాఖ అసలత్వాన్ని ఎత్తిచూపుతోంది. వీరి నిర్లక్ష్యం రియల్టర్లు, కబ్జాదారులకు వరంగా మరింది. చోడవరం మండలంలో మైచర్లపాలెంలో-3, జీజేపురంలో-2 చెరువులతోపాటు మరో 11 చెరువులు ఇరిగేషన్ జాబితాలో లేకపోవడం అందర్నీ అవాక్కుచేసింది. ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోకుండా ఉపాధి పనుల్లో గట్లు వేయడం కబ్జాదారులకు మరింత లాభదాయకంగా మారింది. జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాల సాగుభూమికి పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది.
నీలకంఠపురంలో 3 చెరువులున్నాయి. ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. వర్షాధారంపైనే ఆధారపడి సాగుచేస్తున్నాం. ఆక్రమణలు వల్ల చెరువు గర్భం కుదించుకుపోయింది. పెదకట్టు చెరువు కింద నాకు 2ఎకరాల భూమి ఉంది. నీరులేక ఇబ్బంది పడుతున్నారు. చెరువల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
-జి.సత్యనారాయణ, రైతు, నీలకంఠపురం.