తిరుపతి రూరల్ మండలంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులపై దాడులు
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం పేరూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంచుమోహన్‌యాదవ్ తన అనుచరులతో కలసి ఆక్రమణలను అడ్డుకోవడానికి వచ్చిన ఆర్‌ఐ శంకరయ్య, వీఆర్‌వోలు భాస్కర్, నాగరాజు, వెంకటరమణ, ఈశ్వరయ్య, నూతన్‌కుమార్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు.
బూతులు తిడుతూ ఆర్‌ఐపై భౌతిక దాడులకు యత్నించారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా భౌతిక దాడులకు యత్నించిన టీడీపీ నాయకుడు చెంచుమోహన్‌యాదవ్, అతని అనుచరులపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని ఆర్‌ఐ శంకరయ్య తహశీల్దార్ యుగంధర్‌ను కోరారు. దీనిపై మూడు రోజులుగా తహశీల్దార్ స్పందించలేదు. ఈ వ్యవహారంలో తహశీల్దార్‌పై కాసుల ప్రభావంతో పాటు మాజీ మంత్రి ఒత్తిడి ఉందని రెవెన్యూ వర్గాలు ఆరోపించాయి.
ఆర్‌ఐ శంకరయ్యను ఫ్యాక్టరీకి పిలిపించి ‘ఏం నీకు పోస్టింగ్ ఇచ్చింది కేసులు పెట్టడానికా!’ అంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు అండగా నిలవాల్సిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ఒకరు ఆర్‌ఐని తీసుకుని వెళ్లి మరీ తిట్టించినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండంతో ఎట్టకేలకు టీడీపీ నేతలపై పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు.