Irrigation resources
-
సాగునీటి వనరుల్లో మత్స్య సిరులు
సాక్షి, అమరావతి: సాగునీటి వనరుల్లో సహజ మత్స్య సంపద క్రమేపీ పెరుగుతోంది. ఏడేళ్లలో సహజ మత్స్య దిగుబడులు రెండున్నర రెట్లు పెరిగాయి. 2014–15లో సహజ మత్స్య దిగుబడి 12 లక్షల టన్నులు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2020–21 నాటికి 29.75 లక్షల టన్నులకు పెరిగింది. దీనిని మరింతగా పెంపొందించేందుకు మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అపారమైన వనరులు రాష్ట్రంలో ఉన్న మంచినీటి వనరుల్లో చేపల, రొయ్యల పెంపకం (ఆక్వా కల్చర్) 11 శాతం కాగా.. పంచాయతీ, మైనర్ ఇరిగేషన్ చెరువులు 11 శాతం, రిజర్వాయర్లు 9 శాతం, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పంచాయతీ చెరువులు మినహాయిస్తే 1,24,151 హెక్టార్లలో రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం 74,491 హెక్టార్లు (60%) విస్తీర్ణంలో మాత్రమే సహజ మత్స్య సిరులు లభ్యమవుతున్నాయి. హెక్టారుకు 100 కేజీల చొప్పున ఏటా 7,449 టన్నుల సహజ మత్స్య సిరులను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కేవలం 2,555 టన్నులు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఇక మధ్యస్థ, పెద్ద రిజర్వాయర్ల ప్రాంతం 1,60,907 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 161 హెక్టార్లలో మాత్రమే సహజ మత్స్య ఉత్పత్తి లభిస్తోంది. అందుబాటులో ఉన్న రిజర్వాయర్ విస్తీర్ణాన్ని బట్టి ఏటా మరో 1,93,088 టన్నుల ఉత్పత్తిని ఒడిసిపట్టే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. 1,771 సొసైటీలు.. 1.72 లక్షల మంది మత్స్యకారులు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పంచాయతీ చెరువులు, సాగునీటి చెరువులు, రిజర్వాయర్లలో మేత, మందులు వేయకుండా సహజ మత్స్య పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలుగా ఏర్పడిన స్థానిక యువతకు లీజు పద్ధతిన పంచాయతీల ద్వారా చెరువులను కేటాయిస్తారు. వీటిలో చేప పిల్లలను సహజసిద్ధంగా పెంచుకొని జీవనోపాధి పొందేలా అవకాశం కల్పిస్తారు. కాగా, జల వనరుల శాఖ అధీనంలో ఉన్న సాగు నీటి చెరువులను మత్స్య శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించి ఎంపిక చేసిన వారికి లీజు పద్ధతిలో కేటాయిస్తుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో 1,771 మత్స్యకార సహకార సంఘాల్లో 1,72,141 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. వీరిలో 601 మహిళా మత్స్యకార సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వాటి పరిధిలో 32,826 మంది సభ్యులున్నారు. ఆక్వా హబ్‌లతో సొసైటీలు బలోపేతం మత్స్యకార సొసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ గ్రామంలో ఎన్ని సొసైటీలున్నాయి, వాటి పరిధిలో ఎంతమంది మత్స్యకారులు, నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారో గుర్తిస్తున్నారు. ఆ వివరాలను మత్స్య శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తోంది. సొసైటీలకు అవసరమైన ఆర్థిక చేయూత ఇవ్వడంతో పాటు సాగులో మెళకువలపై మత్స్య సాగు బడిలో శిక్షణ ఇస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సొసైటీల్లో ఉండే మత్స్యకారులకు అవసరమైన వలలు, ఇతర పరికరాలను అందిస్తోంది. సహజ మత్స్య సంపదను ఆక్వాహబ్‌ల ద్వారా రిటైల్ అవుట్‌లెట్స్, కియోస్క్‌లకు సరఫరా చేసేందుకు మ్యాపింగ్ చేస్తోంది. గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సొసైటీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. వీరిలో ఆసక్తి చూపే వారికి మినీ ఫిష్ అవుట్ లెట్స్, కియోస్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయూత ఇస్తోంది. -
వరికి రుణ పరిమితి రూ.31 వేలు
2017–18 సంవత్సరంలో పంటలకు రుణ పరిమితి ఖరారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ పంటలు సాగు చేసే రైతులకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణపరిమితి ఖరారైంది. 2017–18 వ్యవసాయ సీజన్లో ఆ ప్రకారమే బ్యాంకులు రుణాలివ్వాలి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఈ రుణపరిమితిని ఖరారు చేసింది. రాష్ట్రంలో సగటు పంటల సాగు వ్యయం ఆధారంగా దీనిని రూపొందిం చింది. ఈ మేరకు నివేదికను నాబార్డుకు, వ్యవసాయశాఖకు పంపించింది. దీని ఆధారంగానే నాబార్డు వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయనుంది. సాగునీటి వనరులున్నచోట వరికి ఎకరానికి రూ. 29 వేల నుంచి రూ. 31 వేల వరకు రుణ పరిమితిని నిర్ధారించారు. 2016–17 కంటే ఇది రూ. వెయ్యి అదనం. పత్తికి సాగునీటి వనరులున్నచోట రూ. 33 వేల నుంచి రూ. 35 వేలకు ఖరారు చేశారు. 2016–17 కంటే ఇది రూ. 5 వేల వరకు అదనం. ఇదే పంటకు సాగునీటి వనరులు లేనిచోట రూ. 28 వేల నుంచి రూ. 30 వేలు ఖరారు చేశారు. ఇలా మొత్తం 70 పంటలకు రుణ పరిమితిని ఖరారు చేశారు. అయితే గ్రీన్హౌస్ పద్ధతిలో సాగు చేసే రైతులకు మాత్రం రుణపరిమితి ని నిర్ధారించలేదు. లక్షల్లో సాగు ఖర్చు ఉన్నందున దానికి కూడా రుణపరిమితి నిర్ధారిస్తే బాగుండేదన్న చర్చ జరుగుతోంది. రుణ పరిమితి లేకపోవడంతో గ్రీన్హౌస్ ద్వారా సాగు చేసే రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదన్న విమర్శలున్నాయి. -
కబ్జా చెరలో చెరువులు
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు ఉన్న చెరువులను సైతం రికార్డుల్లో చూపని వైనం చోడవరం: భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. చెరువులు.. గెడ్డలు.. వేటినీ వదలడం లేదు. సాగునీటి వనరులు కుదించుకుపోయి రై తులు అల్లాడుతున్నారు. వీటిని పరిరక్షిం చాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీటి వెతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల బడా రైతులు చెరువులను ఆక్రమించి తమ సాగులోకి తెచ్చుకుంటుండగా, మరికొన్ని చోట్ల కబ్జాచేసిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా వేసి దర్జాగా అమ్మేసుకుంటున్నారు. మేజర్ చెరువులు ఆక్రమించుకొని తోటలు కేపీఅగ్రహారంలో 4 చెరువులున్నాయి. సుమారు 800 ఎకరాల ఆయక ట్టు ఉంది. చెరువులు ఆక్రమించుకొని సరుగుడు, చెరకు తోటలు వేసుకొని అనుభవిస్తున్నారు. నీలం చెరువు కింద నాకు 2ఎకరాలు భూమి ఉంది. పూర్తిస్థాయిలో నీరందడంలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -యన్నంశెట్టి గోపి, రైతు, కేపీఅగ్రహారం ఇరిగేషన్లో ఉన్న చెరువుల కంటే మైనర్ ఇరిగేషన్లో ఉన్న సాగునీటి చెరువులు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉన్న చెరువుల ఆక్రమణ మరీ ఎక్కువగా ఉంది. మైదాన జిల్లాలో సుమారు 1500 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చోడవరం నియోజకవర్గంలోనే సుమారు 246 చెరువులు ఉండగా వీటిలో 180 చెరువుల వరకు కబ్జాలో ఉన్నాయి. ఆక్రమణల వల్ల చెరువులు కుదించుకుపోయి సాగునీరు నిల్వ ఉండే విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఎక్కువ రోజులు పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కొన్ని చెరువుల్లో ఆక్రమణలకు ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలే ఇచ్చేశారంటే ఆయా శాఖల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థమౌతుంది. చోడవరం మండలంలో అడ్డూరు చెరువు ఆక్రమణకు అడ్డులేకుండాపోయింది. ఖండిపల్లిలో చెరువును కొందరు రైతులు ఆక్రమించుకోవడంతో అక్కడ చెరువు గర్భమే కనిపించడంలేదు. వెంకన్నపాలెం చెరువును ఎకరా వరకు రియల్టర్లు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేస్తుండగా లక్కవరం, బెన్నవోలు, గంధవరం, దుడ్డుపాలెం, గవరవరం, లక్ష్మీపురం, నర్సయ్యపేట, గాంధీగ్రామం చెరువులు కొందరి ఆధీనంలో ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, ఎర్రవాయు ప్రాంతంలో ఉన్న చెరువులు, రావికమతం, రోలుగుంట మండలాల్లో పెద్దచెరువులు కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నాయి. మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయన్న వివరాలు ఇరిగేషన్ శాఖ వద్దే లేకపోవడం ఆ శాఖ అసలత్వాన్ని ఎత్తిచూపుతోంది. వీరి నిర్లక్ష్యం రియల్టర్లు, కబ్జాదారులకు వరంగా మరింది. చోడవరం మండలంలో మైచర్లపాలెంలో-3, జీజేపురంలో-2 చెరువులతోపాటు మరో 11 చెరువులు ఇరిగేషన్ జాబితాలో లేకపోవడం అందర్నీ అవాక్కుచేసింది. ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోకుండా ఉపాధి పనుల్లో గట్లు వేయడం కబ్జాదారులకు మరింత లాభదాయకంగా మారింది. జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాల సాగుభూమికి పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. నీలకంఠపురంలో 3 చెరువులున్నాయి. ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. వర్షాధారంపైనే ఆధారపడి సాగుచేస్తున్నాం. ఆక్రమణలు వల్ల చెరువు గర్భం కుదించుకుపోయింది. పెదకట్టు చెరువు కింద నాకు 2ఎకరాల భూమి ఉంది. నీరులేక ఇబ్బంది పడుతున్నారు. చెరువల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలి. -జి.సత్యనారాయణ, రైతు, నీలకంఠపురం. -
ఎమ్మెల్యేలతో బాబు ముఖాముఖి
విద్యుత్ ఆదాపై ప్రజల్లో చైతన్యం తేవాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. విద్యుత్ ఆదా ద్వారా విద్యుత్ సంస్థలు ఆదాయం పెంచుకోవటం, సాగునీటి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, సామాజిక పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయటం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలతో మసలుకోవాల్సిన విధానంపై చర్చించారు. శనివారం జరిగిన ముఖాముఖిలో మంత్రి కె.అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విప్ చైతన్యరాజు, ఎంపీ అవంతి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌ను ఒక శాతం ఆదా చేస్తే ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయాన్ని విద్యుత్ సంస్థలు పొందవచ్చని, ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తేవటంతోపాటు అధికారులూ కృషి చేయాలన్నారు. రక్షణ మంత్రి పారికర్ భేటీ:ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ శనివారం ఆయన నివాసంలో భేటీఅయ్యారు. ఏపీకి మరిన్ని రక్షణరంగ ప్రాజెక్టులను కేటాయించాలని కోరిన చంద్రబాబు రాష్ట్రానికి మరింత ఆర్థికసాయం చేయాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. నేడు ఢిల్లీకి సీఎం :కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మరలా ఆయన ఈ నెల 10న ఢిల్లీ వెళతారు. అక్కడ జరిగే రాయబారుల సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశానంతరం ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. మంగళవారం జరిపే ఢిల్లీ పర్యటనలోనూ కేంద్రమంత్రులను కలవనున్నారు. -
భవిష్యత్ తరాల కోసమే తపన
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులపైనే తమ బాధ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాం ధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తుడా సర్కిల్లోని వైఎస్ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఇత్తడి పాత్రలకు రిపేర్లు చేసి, కళాయి పనులతో నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు ప్రకృతి, సాగునీటి వనరుల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన నేపథ్యంలో రాష్ట్ర విభజన అంత సులభం కాదని అన్నారు. ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై విభిన్న ప్రకటనలు చేస్తూ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. 60 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతుంటే ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా ప్రజలను మోసగించే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మొండి వైఖరి వల్ల రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని కోట్లాది మంది విద్యార్థులు చేతివృత్తులు చేసుకుని బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దుస్థితి కలగకూడదనే ఏకైక లక్ష్యంతో తమ పార్టీ పోరాడుతోందని వెల్లడిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లే విభజన ప్రక్రియకు కాంగ్రెస్ పెద్దలు ధైర్యం చేశారని తెలిపారు. జగన్ ఫోబియాతోనే సీఎం సమైక్య నినాదం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ, అభిమానాన్ని చూసి సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్య నినాదం ఆలపిస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చేసిన రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు రాజీనామాను ప్రయోగించకుండా ప్రజ లను మోసం చేసేందుకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణలో రాజ కీయ పార్టీల విధానాలు తెలుసుకునేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఆదికేశవరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ చెలికం కుసుమ, మాజీ జెడ్పీటీసీ వెంకటమునిరెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, మబ్బు నాదమునిరెడ్డి, మెడికల్ అసోసియేషన్ నాయకులు బీ.రాజేంద్రరెడ్డి, నాగేంద్ర, మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.