2017–18 సంవత్సరంలో పంటలకు రుణ పరిమితి ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ పంటలు సాగు చేసే రైతులకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణపరిమితి ఖరారైంది. 2017–18 వ్యవసాయ సీజన్‌లో ఆ ప్రకారమే బ్యాంకులు రుణాలివ్వాలి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఈ రుణపరిమితిని ఖరారు చేసింది. రాష్ట్రంలో సగటు పంటల సాగు వ్యయం ఆధారంగా దీనిని రూపొందిం చింది. ఈ మేరకు నివేదికను నాబార్డుకు, వ్యవసాయశాఖకు పంపించింది. దీని ఆధారంగానే నాబార్డు వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయనుంది.
సాగునీటి వనరులున్నచోట వరికి ఎకరానికి రూ. 29 వేల నుంచి రూ. 31 వేల వరకు రుణ పరిమితిని నిర్ధారించారు. 2016–17 కంటే ఇది రూ. వెయ్యి అదనం. పత్తికి సాగునీటి వనరులున్నచోట రూ. 33 వేల నుంచి రూ. 35 వేలకు ఖరారు చేశారు. 2016–17 కంటే ఇది రూ. 5 వేల వరకు అదనం. ఇదే పంటకు సాగునీటి వనరులు లేనిచోట రూ. 28 వేల నుంచి రూ. 30 వేలు ఖరారు చేశారు. ఇలా మొత్తం 70 పంటలకు రుణ పరిమితిని ఖరారు చేశారు. అయితే గ్రీన్‌హౌస్ పద్ధతిలో సాగు చేసే రైతులకు మాత్రం రుణపరిమితి ని నిర్ధారించలేదు. లక్షల్లో సాగు ఖర్చు ఉన్నందున దానికి కూడా రుణపరిమితి నిర్ధారిస్తే బాగుండేదన్న చర్చ జరుగుతోంది. రుణ పరిమితి లేకపోవడంతో గ్రీన్‌హౌస్ ద్వారా సాగు చేసే రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదన్న విమర్శలున్నాయి.
వరికి రుణ పరిమితి రూ.31 వేలు
Published Sun, Mar 26 2017 12:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement