సాగునీటి వనరుల్లో మత్స్య సిరులు | Natural fisheries in irrigated water resources are gradually increasing | Sakshi
Sakshi News home page

సాగునీటి వనరుల్లో మత్స్య సిరులు

Published Fri, Feb 18 2022 6:26 AM | Last Updated on Fri, Feb 18 2022 6:26 AM

Natural fisheries in irrigated water resources are gradually increasing - Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి వనరుల్లో సహజ మత్స్య సంపద క్రమేపీ పెరుగుతోంది. ఏడేళ్లలో సహజ మత్స్య దిగుబడులు రెండున్నర రెట్లు పెరిగాయి. 2014–15లో సహజ మత్స్య దిగుబడి 12 లక్షల టన్నులు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2020–21 నాటికి 29.75 లక్షల టన్నులకు పెరిగింది. దీనిని మరింతగా పెంపొందించేందుకు మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. 

రాష్ట్రంలో అపారమైన వనరులు
రాష్ట్రంలో ఉన్న మంచినీటి వనరుల్లో చేపల, రొయ్యల పెంపకం (ఆక్వా కల్చర్‌) 11 శాతం కాగా.. పంచాయతీ, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు 11 శాతం, రిజర్వాయర్లు 9 శాతం, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పంచాయతీ చెరువులు మినహాయిస్తే 1,24,151 హెక్టార్లలో రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం 74,491 హెక్టార్లు (60%) విస్తీర్ణంలో మాత్రమే సహజ మత్స్య సిరులు లభ్యమవుతున్నాయి. హెక్టారుకు 100 కేజీల చొప్పున ఏటా 7,449 టన్నుల సహజ మత్స్య సిరులను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కేవలం 2,555 టన్నులు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఇక మధ్యస్థ, పెద్ద రిజర్వాయర్ల ప్రాంతం 1,60,907 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 161 హెక్టార్లలో మాత్రమే సహజ మత్స్య ఉత్పత్తి లభిస్తోంది. అందుబాటులో ఉన్న రిజర్వాయర్‌ విస్తీర్ణాన్ని బట్టి ఏటా మరో 1,93,088 టన్నుల ఉత్పత్తిని ఒడిసిపట్టే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది.

1,771 సొసైటీలు.. 1.72 లక్షల మంది మత్స్యకారులు
గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పంచాయతీ చెరువులు, సాగునీటి చెరువులు, రిజర్వాయర్లలో మేత, మందులు వేయకుండా సహజ మత్స్య పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలుగా ఏర్పడిన స్థానిక యువతకు లీజు పద్ధతిన పంచాయతీల ద్వారా చెరువులను కేటాయిస్తారు. వీటిలో చేప పిల్లలను సహజసిద్ధంగా పెంచుకొని జీవనోపాధి పొందేలా అవకాశం కల్పిస్తారు. కాగా, జల వనరుల శాఖ అధీనంలో ఉన్న సాగు నీటి చెరువులను మత్స్య శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించి ఎంపిక చేసిన వారికి లీజు పద్ధతిలో కేటాయిస్తుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో 1,771 మత్స్యకార సహకార సంఘాల్లో 1,72,141 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. వీరిలో 601 మహిళా మత్స్యకార సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వాటి పరిధిలో 32,826 మంది సభ్యులున్నారు.

ఆక్వా హబ్‌లతో సొసైటీలు బలోపేతం
మత్స్యకార సొసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ గ్రామంలో ఎన్ని సొసైటీలున్నాయి, వాటి పరిధిలో ఎంతమంది మత్స్యకారులు, నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారో గుర్తిస్తున్నారు. ఆ వివరాలను మత్స్య శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తోంది. సొసైటీలకు అవసరమైన ఆర్థిక చేయూత ఇవ్వడంతో పాటు సాగులో మెళకువలపై మత్స్య సాగు బడిలో శిక్షణ ఇస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సొసైటీల్లో ఉండే మత్స్యకారులకు అవసరమైన వలలు, ఇతర పరికరాలను అందిస్తోంది. సహజ మత్స్య సంపదను ఆక్వాహబ్‌ల ద్వారా రిటైల్‌ అవుట్‌లెట్స్, కియోస్క్‌లకు సరఫరా చేసేందుకు మ్యాపింగ్‌ చేస్తోంది. గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సొసైటీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. వీరిలో ఆసక్తి చూపే వారికి మినీ ఫిష్‌ అవుట్‌ లెట్స్, కియోస్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయూత ఇస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement