- విద్యుత్ ఆదాపై ప్రజల్లో చైతన్యం తేవాలని సూచన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. విద్యుత్ ఆదా ద్వారా విద్యుత్ సంస్థలు ఆదాయం పెంచుకోవటం, సాగునీటి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, సామాజిక పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయటం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలతో మసలుకోవాల్సిన విధానంపై చర్చించారు.
శనివారం జరిగిన ముఖాముఖిలో మంత్రి కె.అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విప్ చైతన్యరాజు, ఎంపీ అవంతి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. విద్యుత్‌ను ఒక శాతం ఆదా చేస్తే ఏడాదికి రూ.250 కోట్ల ఆదాయాన్ని విద్యుత్ సంస్థలు పొందవచ్చని, ఈ దిశగా ప్రజల్లో చైతన్యం తేవటంతోపాటు అధికారులూ కృషి చేయాలన్నారు.
రక్షణ మంత్రి పారికర్ భేటీ:ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ శనివారం ఆయన నివాసంలో భేటీఅయ్యారు. ఏపీకి మరిన్ని రక్షణరంగ ప్రాజెక్టులను కేటాయించాలని కోరిన చంద్రబాబు రాష్ట్రానికి మరింత ఆర్థికసాయం చేయాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు.
నేడు ఢిల్లీకి సీఎం :కేంద్రం తాజాగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మరలా ఆయన ఈ నెల 10న ఢిల్లీ వెళతారు. అక్కడ జరిగే రాయబారుల సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం నీతి ఆయోగ్ సమావేశానంతరం ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. మంగళవారం జరిపే ఢిల్లీ పర్యటనలోనూ కేంద్రమంత్రులను కలవనున్నారు.